విషాదం: అందరూ చూస్తుండగానే మెడ విరిగి రెజ్లర్ మృతి

Posted By:
20-year-old Kolhapur wrestler dies after breaking neck in bout

హైదరాబాద్: రెజ్లింగ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఆటలో భాగంగా జరిగిన బౌట్‌లో మెడ విరిగిన 20 ఏళ్ల యువ రెజ్లర్ నీలేశ్ కందుర్కర్ స్థానికి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందిన సంఘటన మహారాష్ట్రలోని కోల్హాపూర్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే జ్యోతిబా జాతర సందర్భంగా గత సోమవారం కోల్హాపూర్‌లోని బండివేడ్‌ గ్రామంలో రెజ్లింగ్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ పోటీలో పాల్గొన్న తొలి బౌట్‌లోనే నీలేశ్‌కు బలమైన ప్రత్యర్థి ఎదురయ్యాడు. దీంతో నీలేశ్‌ ఎక్కువగా ఆత్మరక్షధోరణిలో ఆడుతూ ప్రత్యర్థికి పాయింట్లు ఇవ్వలేదు.

దీంతో అసహనానికి లోనైన ప్రత్యర్ధి రెజ్లర్ నీలేశ్‌ను గాల్లోకి అమాంతం ఎత్తగా.. పట్టు విడిపించుకునే యత్నంలో కిందపడ్డాడు. ఈ క్రమంలో నీలేశ్‌ తల నేలను బలంగా తాకింది. అదే సమయంలో ప్రత్యర్థి రెజ్లర్ సంబరాలు చేసుకుంటుండగా.. కింద పడిన నిలేశ్ స్పృహ కోల్పోయినట్లు టోర్నీ నిర్వహకులు గుర్తించారు.

దీంతో వెంటనే నిలేశ్‌ని కోల్హాపూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత పరిస్థితి విషయంగా ఉందని కరాడ్‌లోని క్రిష్ణ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. నిలేశ్‌కు చికిత్స అందించిన న్యూరాలజీ సర్జన్ డాక్టర్ ప్రసన్న పట్నాకర్ మాట్లాడుతూ ఎత్తు నుంచి కిందకు పడటంతో మెడ వెన్నుముక పూర్తిగా దెబ్బతిన్నందని తెలిపారు.

నిలేశ్‌ని బ్రతికించేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తామని ఆయన తెలిపారు. అయితే గత నాలుగు రోజులుగా వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో రెజ్లర్ నీలేశ్ శుక్రవారం మృతి చెందాడు. అయితే, పోటీల్లో అనుకోకుండా జరిగిన ఘటన కావడంతో ప్రత్యర్థి రెజ్లర్ పేరు వెల్లడించలేమని టోర్నీ నిర్వాహకులు తెలిపారు.

అంతేకాదు నీలేశ్ మృతికి కారణమైన రెజ్లర్ ఇంకా షాక్‌లోనే ఉన్నాడని తెలిపారు. ఈ సంఘటనతో రెజ్లర్ నీలేశ్ కుటుంబం ఇంట తీవ్ర విషాదం అలుముకుంది. నీలేశ్ రెజ్లర్ల కుటుంబానికి చెందిన వాడు. నీలేశ్ తండ్రి విట్టల్ కందుర్కర్ తో పాటు సోదరుడు సుహాస్ కూడా కోల్హాపూర్‌లో రెజ్లర్లే.

నీలేశ్ పలు స్థానిక టోర్నీల్లో గెలుపొందాడని, అతడిపై తమ కుటుంబం ఎన్నో ఆశలు పెట్టుకుందని ఇంతలో ఇలా జరగడం బాధగా ఉందని నీలేశ్ సోదరుడు సుహాస్ పేర్కొన్నాడు. నీలేశ్ మ్యాట్ రెజ్లింగ్‌లో వార్నానగర్ లోని తాత్యాసాహెబ్ కోర్ రెజ్లింగ్ కాంప్లెక్స్‌లో శిక్షణ కూడా తీసుకున్నాడని వెల్లడించాడు.

Story first published: Friday, April 6, 2018, 20:57 [IST]
Other articles published on Apr 6, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి