కామన్వెల్త్: సెమీస్‌లో పోరాడి ఓడిన హాకీ పురుషుల జట్టు

Posted By:
CWG 2018, hockey: India men lose 2-3 to New Zealand in semi-final; will now fight for bronze

హైదరాబాద్: గోల్డ్‌ కోస్ట్ వేదికగా భారత క్రీడాకారులు సత్తా చాటుతుంటే పురుషుల హాకీ జట్టు మాత్రం సెమీస్‌లో ఓటమి పాలైంది. దీంతో స్వర్ణం నెగ్గాలన్న ఆటగాళ్ల కల చెదిరింది. టోర్నీ ఆరంభం నుంచి ఓటమి ఎరుగకుండా జైత్రయాత్ర కొనసాగించిన భారత్ పురుషుల జట్టు శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో 2-3 తేడాతో ఓటమి పాలైంది.

ఈ మ్యాచ్‌ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించిన న్యూజిలాండ్ ధాటికి భారత్ డిఫెండర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. ఆట మొదలైన 13 నిమిషాల్లోనే న్యూజిలాండ్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లడంతో.. భారత్‌పై క్రమంగా ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో 29వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ సింగ్ ఓ గోల్ చేసి ఆధిక్యాన్ని 1-2కి తగ్గించాడు.

అయితే, ఆట 40వ నిమిషంలో న్యూజిలాండ్ మరో గోల్ చేసింది. దీంతో ప్రత్యర్థి ఆధిక్యాన్ని తగ్గించేందుకు భారత్ ఆటగాళ్లు పదే పదే న్యూజిలాండ్ గోల్ పోస్టుపై దాడికి యత్నించినప్పటికీ, ప్రయోజనం లేకపోయింది. చివరకు 57వ నిమిషంలో భారత ఆటగాడు హర్మన్‌ప్రీత్ సింగ్ మరో గోల్ చేసినప్పటికీ భారత్‌ను ఓటమి అంచు నుంచి తప్పించలేకపోయాడు.

ఈ గేమ్స్‌లో పాకిస్థాన్‌తో జరిగిన టోర్నీ తొలి మ్యాచ్‌ని 2-2తో డ్రా చేసుకున్న భారత పురుషుల జట్టు ఆ తర్వాత వేల్స్‌, మలేసియా, ఇంగ్లాండ్ జట్లని ఓడించి సెమీస్ చేరింది. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌ కంటే ముందే సెమీస్ బెర్తు ఖాయమైనా.. ఫూల్‌-బిలో అగ్రస్థానాన్ని దక్కించుకోవడం కోవడంతో సెమీస్‌లో న్యూజిలాండ్‌తో తలపడింది.

చివరకు న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలవడంతో కాంస్య పతకం కోసం రెండో సెమీఫైనల్లో తలపడే ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్‌ జట్లలో ఓడిన జట్టుతో పోటీపడనుంది. ఇదిలా ఉంటే మహిళల హాకీ జట్టు కూడా గురువారం సెమీస్‌లో ఓడిన సంగతి తెలిసిందే. మరోవైపు మహిళల హాకీ జట్టు సైతం కాంస్య పతకం కోసం ఇంగ్లాండ్‌తో తలపడనుంది.

Story first published: Friday, April 13, 2018, 18:39 [IST]
Other articles published on Apr 13, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి