అజ్లాన్ షా కప్: మలేసియాపై భారత్ విజయం, ఫైనల్ ఆశలు సజీవం

Posted By:
Azlan Shah Cup 2018: India thump hosts Malaysia 5-1 for first win

హైదరాబాద్: అజ్లాన్ షా కప్ హాకీ టోర్నీలో భారత హాకీ జట్టు ఎట్టకేలకు బోణీ చేసింది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 5-1తో మలేసియాపై విజయం సాధించడంతో టోర్నీలో ఆశలను సజీవంగా ఉంచుకుంది. దీంతో ఈ టోర్నీలో తొలిసారి మూడు పాయింట్లను భారత్ తన ఖాతాలో వేసుకుంది.

టోర్నీలో భాగంగా తోలి మ్యాచ్‌లో అర్జెంటీనా చేతిలో ఓడిన భారత్... ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌ను డ్రా చేసుకుని ఫైనల్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. దీంతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో మలేసియాపై 5-1తో నెగ్గి ఫైనల్‌కు అర్హత సాధించేందుకు అవకాశాన్ని సృష్టించుకుంది.


ఈ మ్యాచ్‌లో భారత్ తరుపున శీలానంద్ లక్రా (10వ నినిమిషం), గుర్జాంత్ సింగ్ (42, 57వ నిమిషం), సుమిత్ కుమార్ (48వ నిమిషం), రమన్‌దీప్ సింగ్ (51వ నిమిషం)లో గోల్స్ చేశారు. ఇక, మలేసియాకు చెందిన ఫైజల్ సారీ 33వ నిమిషంలో ఆ జట్టుకు ఏకైక గోల్ అందించాడు.

ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచీ దూకుడుగా ఆడిన భారత్ వచ్చిన అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకుంది. ఈ విజయంతో భారత్‌ ఫైనల్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. చివరి రౌండ్‌ రాబిన్‌ మ్యాచ్‌ల ఫలితాలు భారత్‌ ఫైనల్‌ చేరుతుందో లేదో తేల్చనున్నాయి.

పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా (12) టాప్‌లో కొనసాగుతుండగా, అర్జెంటీనా (7), మలేసియా (6), ఇంగ్లండ్ (5), భారత్ (4) వరుసగా రెండు నుంచి ఐదు స్థానాల్లో ఉన్నాయి. భారత్ ఫైనల్‌కు చేరాలంటే శుక్రవారం ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో భారీ ఆధిక్యంతో విజయం సాధించాలి.

మరోవైపు అర్టెంటీనాపై ఆస్ట్రేలియా విజయం సాధించాలి. అదే సమయంలో మలేసియా, ఇంగ్లాండ్‌ మధ్య మ్యాచ్‌ డ్రాగా ముగియాలి. అప్పుడు మాత్రమే భారత్ ఫైనల్‌కు చేరుతుంది. నాలుగు వరుస పరాజయాలతో ఉన్న ఐర్లాండ్ ఇప్పటికే నాకౌట్ బెర్త్‌కు దూరమైన సంగతి తెలిసిందే.

Story first published: Thursday, March 8, 2018, 11:58 [IST]
Other articles published on Mar 8, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి