
అవయవాలు దెబ్బతినడంతో..
ఇటీవల ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేర్చారు. ఆయనకు ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఈ క్రమంలో పలు అవయవాలు పనిచేయకపోవడంతో పీలే ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. పీలే కన్నుమూయడంతో దేశాధినేతలు, క్రీడాకారులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఇటీవలి క్రిస్మస్ రోజున ఆస్పత్రిలోనే కుటుంబ సభ్యుల సమక్షంలో ఆనందంగా గడిపిన పీలే ఇంతలోనే కానరాని లోకాలకు వెళ్లిపోయాడు.

మూడు ప్రపంచకప్‌లు గెలిచిన ఏకైక ప్లేయర్‌గా..
1940 అక్టోబర్ 24న జన్మించిన పీలే తన మంత్ర ముగ్ధమైన ఆటతీరుతో సాకర్ చరిత్రలో ఓ దిగ్గజ ఆటగాడిగా వెలుగొందాడు. 1958, 1962, 1970 ప్రపంచకప్‌లలో బ్రెజిల్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన పీలే.. సుమారు రెండు దశాబ్దాలపాటు ఎన్నో ఘనతలు అందుకున్నాడు. మూడు ప్రపంచకప్‌లు అందుకున్న ఏకైక వ్యక్తిగా పీలే నిలిచాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫుట్‌బాల్ ఫార్వర్డ్ క్రీడాకారుడిగా పేరు లిఖించుకున్న పీలే.. 16 ఏళ్ల ప్రాయంలోనే బ్రెజిల్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.

మారడోనాతో కలిసి..
92 మ్యాచ్‌ల్లో 77 గోల్స్ చేసి జట్టు తరఫున అత్యధిక గోల్స్ చేసిన వ్యక్తిగా నిలిచాడు. 1956 నుంచి 1974 వరకు బ్రెజిలియన్ క్లబ్ శాంటోస్ తరఫున బరిలోకి దిగిన పీలే 659 మ్యాచ్‌ల్లో 643 గోల్స్ చేశాడు. 1961, 1962, 1963, 1964, 1965, 1968లో ఆరుసార్లు తన క్లబ్‌కు బ్రెజిల్ లీగ్ టైటిల్‌ను అందించాడు. ఇక తన కెరీర్ చరమాంకంలో న్యూయార్స్ కాస్మోస్ తరఫున రెండేళ్లు యూఎస్‌లో ఫుట్‌బాల్ ఆడాడు. మరో దిగ్గజ ఆటగాడు, అర్జెంటీనా దిగ్గజం డిగో మారడోనాతో కలిపి 'ప్లేయర్ ఆఫ్ ది సెంచరీ' అవార్డును పీలే అందుకున్నాడు.

పిలే గెలిచిన అవార్డులు
1978లో ఇంటర్నేషనల్ పీస్ అవార్డు
1980లో ఫ్రెంచ్ క్రీడా ప్రచురణల సంస్థ ఎల్ ఎక్విప్ 'అథ్లెట్ ఆఫ్ ది సెంచరీ' అవార్డు
1999లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ 'అథ్లెట్ ఆఫ్ ది సెంచరీ' అవార్డు
20 శతాబ్దానికి చెందిన 100 మంది 'అత్యంత ముఖ్యమైన వ్యక్తు'ల టైమ్స్ అవార్డు 1999
ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫుట్‌బాల్ వరల్డ్ అండ్ స్టాటిస్టిక్స్ 'వరల్డ్ ప్లేయర్ ఆఫ్ ది సెంచరీ' అవార్డు 2000
డీగో మారడోనాతో కలిసి 'ఫిఫా ప్లేయర్ ఆఫ్ ది సెంచరీ' అవార్డు 2000
1997లో ఎలిజిబెత్ రాణినుంచి గౌరవ నైట్‌హుడ్