బంగ్లాదేశ్‌తో రెండో వన్డే సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడిన సంగతి తెలిసిందే. ఈ గాయం తీవ్రమైంది కావడంతో మూడో వన్డేలో అతను ఆడటం లేదని టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పష్టం చేశాడు. రోహిత్ వెంటనే ముంబై వెళ్లిపోతాడని, అక్కడ చికిత్స తీసుకుంటాడని, అక్కడి మెడికల్ టీం విశ్లేషణను బట్టి అతను టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉండేదీ లేనిదీ తెలుస్తుందని ద్రావిడ్ అన్నాడు. ఈ విషయంలో ఇప్పుడే ఏం చెప్పలేమని అభిప్రాయపడ్డాడు.
అయితే గతంలో రవీంద్ర జడేజా కూడా టీ20 వరల్డ్ కప్ ఆడతాడని ద్రావిడ్ అన్నాడు. ఆసియా కప్ నుంచి తప్పుకున్న జడేజా, అంతకుముందే జట్టుకు దూమరమైన బుమ్రా విషయంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. దీంతో అభిమానులు ఇప్పటికే టెస్టు సిరీస్‌లో రోహిత్ ఆడడని డిసైడ్ అయిపోయారు. అతని గైర్హాజరీలో కేఎల్ రాహుల్‌కు జట్టు పగ్గాలు అందే అవకాశం ఉంది.
ఈ క్రమంలో జట్టులో రోహిత్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు కరువయ్యాడు. మూడో వన్డేలో అయితే విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. మరి టెస్టుల్లో రోహిత్ స్థానాన్ని ఎవరు భర్తీ చేయాలి? అందుకే టెస్టు సిరీస్‌లో రోహిత్ స్థానాన్ని భర్తీ చేసేందుకు యువ ప్లేయర్‌ను ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తోందట. ఇండియా-ఎ కెప్టెన్‌గా వ్యవహరించిన అభిమన్యు ఈశ్వరన్‌ను టెస్టు జట్టుకు ఎంపిక చేయనుందట బీసీసీఐ. అతను రోహిత్ స్థానంలో జట్టుకు ఓపెనింగ్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఈ విషయం గురించి బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ''అభిమన్యు ఈశ్వరన్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇండియా ఎ సిరీస్‌లో వరుసగా సెంచరీలు బాదాడు. మంచి ఓపెనర్ కూడా. అందుకే రోహిత్ స్థానంలో అతన్ని ఎంపిక చేయాలని నిర్ణయించాం. ఇండియా ఎ తరఫున సైలెట్‌లో జరిగే చివరి టెస్టు ముగిసిన వెంటనే.. చట్టోగ్రాంలో భారత బృందంతో ఈశ్వరన్ కలుస్తాడు'' అని స్పష్టం చేశారు.