న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇయర్-ఎండ్ స్పెషల్: ఏబీ నుంచి గంభీర్ వరకు క్రికెట్‌కు రిటైర్మెంట్

Year-End Special: From AB de Villiers to Gautam Gambhir, Here’s the List of Cricketers Who Retired in 2018

హైదరాబాద్: రిటైర్మెంట్ అనేది ప్రతి ఒక్క ఆటగాడికి ఉద్వేగభరిత క్షణం. ఆ క్షణంలో ఎంతటి వారైనాసరే ఎమోషనల్‌కు గురవుతారు. అందుకు కారణం అప్పటివరకు తమ జట్టుకు ప్రాతినిథ్యం వహించి, ఇకపై ఆటతో పాటు అభిమానులకు కూడా దూరమవుతుండటమే.

<strong>దేవుడిని ప్రార్ధించా!: రూ 8.4 కోట్లు పలికి అందరినీ ఆశ్చర్యపరిచిన వరుణ్‌ (వీడియో)</strong>దేవుడిని ప్రార్ధించా!: రూ 8.4 కోట్లు పలికి అందరినీ ఆశ్చర్యపరిచిన వరుణ్‌ (వీడియో)

2018లో పలువురు క్రికెటర్లు ఇలాంటి ఉద్వేగభరిత క్షణాలనే ఎదుర్కొన్నారు. మా టర్న్ వచ్చిందంటూ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. తమ సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో ఎన్నో రికార్డులను తమ ఖాతాలో వేసుకోవడంతో పాటు అనేక జట్టు విజయాల్లో పాలుపంచుకున్నారు.

భారంతోనే పలువురు క్రికెటర్లు ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. వారెవరో ఒక్కసారి చూద్దాం...

ఏబీ డివిలియర్స్

మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో ఒకడు. అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు మిస్టర్ 360. తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో అనేక అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికాకు చెందిన ఏబీ డివిలియర్స్ ఈ ఏడాది మొదట్లో ఆస్ట్రేలియాపై టెస్టు సిరిస్ విజయం అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇదే సరైన సమయమని చెప్పిన డివిలియర్స్ తన 14 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికాడు. 2004 డిసెంబర్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌తో డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగేట్రం చేశాడు. తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20లు, 141 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన డివిలియర్స్ మొత్తం 50 సెంచరీలు, 137 హాఫ్ సెంచరీలు, 2 డబుల్ సెంచరీలు సాధించాడు. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న డివిలియర్స్ తన బ్యాటింగ్ స్టైల్‌తో భారత్‌లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. కాగా, తాను అంతర్జాతీయ క్రికెట్‌కి మాత్రమే వీడ్కోలు పలుకుతున్నానని, దేశవాళీ క్రికెట్‌కి మాత్రం అందుబాటులో ఉంటానని డివిలియర్స్ చెప్పాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో డివిలియర్స్‌కు అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (16 బంతుల్లో), ఫాస్టెస్ట్ సెంచరీ (31 బంతుల్లో), ఫాస్టెస్ట్ 150 (64 బంతుల్లో) రికార్డులు డివిలియర్స్ పేరిటే ఉన్నాయి. దక్షిణాఫ్రికా తరఫున టెస్టుల్లో రెండో అత్యధిక టెస్టు స్కోరు (278 నాటౌట్) కూడా డివిలియర్స్ పేరిటే ఉంది. ఐసీసీ టెస్ట్ ర్యాంకుల్లో అత్యధిక పాయింట్లు (935) సాధించిన దక్షిణాఫ్రికా క్రికెటర్ కూడా డివిలియర్సే కావడం విశేషం. మొత్తం 114 టెస్టుల్లో 50.66 సగటుతో 8765 పరుగులు చేశాడు. అందులో 22 సెంచరీలు ఉన్నాయి. ఇక, 228 వన్డేల్లో 53.50 సగటుతో 9577 పరుగులు చేశాడు.

అలెస్టర్ కుక్

అలెస్టర్ కుక్

ఇంగ్లాండ్ జట్టు ప్రపంచ క్రికెట్‌కు అందించిన అత్యుత్తమ టెస్టు క్రికెటర్లలో అలెస్టర్ కుక్ ఒకడు. ఈ ఏడాది భారత పర్యటనలో ఓవల్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌తో కుక్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లాండ్ తరుపున అలెస్టర్ కుక్ అనేక రికార్డులను నమోదు చేశాడు. 33 ఏళ్ల కుక్ టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆరోస్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్ జట్టు తరుపున అలెస్టర్ కుక్ అనేక రికార్డులను నమోదు చేశాడు. ఇప్పటివరకు టెస్టుల్లో ఇంగ్లాండ్ జట్టు తరుపున 160 టెస్టులు ఆడిన కుక్.. 12254 పరుగులు చేశాడు. ఇందులో 32 సెంచరీలు, 56 అర్ధ శతకాలు ఉన్నాయి. టెస్టుల్లో కుక్ యావరేది 44.88గా ఉంది. 2016లో 10వేల పరుగుల మైలురాయిని చేరుకున్న అతి చిన్న క్రికెటర్‌గా రికార్డు కుక్ సృష్టించాడు. ఈ ఫీట్‌ని అతను 31 సంవత్సరాల, 157 రోజుల్లో సాధించాడు. అంతకు ముందు ఈ రికార్డు టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. ఇంగ్లాండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో అలెస్టర్ కుక్ రికార్డులు:

ఇంగ్లండ్ తరఫున అత్యధిక టెస్టు పరుగులు: 12254

ఇంగ్లండ్ తరఫున అత్యధిక టెస్టు సెంచరీలు: 32

ఇంగ్లండ్ తరఫున అత్యధిక 150+ స్కోర్లు : 11

ఇంగ్లండ్ తరఫున అత్యధిక టెస్టులు : 160

విరామం లేకుండా అత్యధిక టెస్టులు ఆడిన ప్లేయర్ : 158 టెస్టులు

ఇంగ్లండ్ కెప్టెన్‌గా అత్యధిక టెస్టులు: 59

మహమ్మద్ కైఫ్

భారత్ తరుపున చివరిసారిగా 12 ఏళ్ల క్రితం మ్యాచ్ ఆడిన మొహమ్మద్ కైఫ్ శుక్రవారం (జులై 13)న క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అలహాబాద్‌కు చెందిన కైఫ్ భారత జట్టులో మంచి ఫీల్డర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కైఫ్ సారథ్యంలోనే భారత్‌ అండర్‌-19 జట్టు 2000 వరల్డ్‌కప్ గెలిచింది. రంజీ క్రికెట్‌లో ఉత్తరప్రదేశ్‌కు కైఫ్ రంజీ ట్రోఫీని అందించాడు. చివరిసారిగా ఛత్తీస్‌గడ్ తరుపున రంజీ క్రికెట్ ఆడాడు. తన ఐదేళ్ల క్రికెట్ కెరీర్‌లో కైఫ్ ఎన్నో అద్భుతాలు చేశాడు. ముఖ్యంగా 30 యాడ్ సర్కిల్‌లో ఫీల్డింగ్‌ చేసిన కైఫ్ భారత్ తరుపున అద్భుతమైన క్యాచ్‌లను అందుకున్నాడు.

125 వన్డేలాడిన కైఫ్ 32 యావరేజితో 2753 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో కైప్ ఎక్కువగా 6 లేదా 7 స్థానాల్లో బరిలోకి దిగేవాడు. ఇక, టెస్టుల విషయానికి వస్తే 13 టెస్టులాడి 624 పరుగులు నమోదు చేశాడు. టెస్టుల్లో అత్యధిక స్కోరు 148 నాటౌట్. టెస్టుల్లో ఒక సెంచరీతో పాటు 3 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. లార్డ్స్‌లో సెంచరీతోపాటు 2002లో ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీని నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత టాపార్డర్ విఫలం కావడంతో చివరి వరకు పోరాడి భారత్‌కు విజయాన్ని అందించాడు.

రంగనా హెరాత్

రంగనా హెరాత్

శ్రీలంక స్పిన్ దిగ్గజం రంగనా హెరాత్ ఓటమితో వీడ్కోలు పలికాడు. గాలె వేదికగా ఇంగ్లాండ్‌తో తన చివరి టెస్టుని ఆడాడు. ఈ టెస్టులో శ్రీలంక జట్టు 211 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. ఈ వేదికపై ఇంగ్లాండ్ జట్టు టెస్టులో గెలుపొందడం ఇదే తొలిసారి. 1999లో గాలే వేదికగా జరిగిన టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేసిన రంగనా హెరాత్ 19 ఏళ్ల పాటు ఆ జట్టుకు సేవలందించాడు. అయితే, ఏ వేదికలోనైతే అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేశాడో అదే వేదికపై రంగనా హెరాత్ తన చివరి టెస్టు మ్యాచ్‌ని ఆడటం విశేషం. హెరాత్ టెస్టుల్లో 433 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో హెరాత్ ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఒకే వేదికపై 100 అంతకన్నా ఎక్కువ వికెట్లు తీసిన టెస్టు బౌలర్లలో మూడో బౌలర్‌గా నిలిచాడు.

ఈ టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు గాలే స్టేడియంలో 99 వికెట్లు తీసిన రంగనా హెరాత్ ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ వికెట్ తీశాడు. ఇన్నింగ్స్ 17వ ఓవర్‌ వేసిన హెరాత్... జో రూట్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో గాలే స్టేడియంలో హెరాత్‌కు ఇది 100వ టెస్టు వికెట్ కావడం విశేషం. అంతకు ముందు టెస్టుల్లో కేవలం ఇద్దరు బౌలర్లు మాత్రమే ఈ ఘనత సాధించారు. శ్రీలంక మాజీ స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్, ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్‌లు మాత్రమే అంతకు ముందు ఈ ఘనత సాధించారు. ముత్తయ్య మురళీధరన్ అయితే మూడు వేదికల్లో ఈ ఘనత సాధించాడు. సింహలీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్, అసిగిరియ స్టేడియం, గాలే అంతర్జాతీయ స్టేడియంలలో మురళీధరన్ 100కు పైగా వికెట్లను తీయగా, జేమ్స్ ఆండర్సన్ లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో 100కు పైగా వికెట్లు తీశాడు.

మిచెల్ జాన్సన్

మిచెల్ జాన్సన్

ఆసీస్ ఫాస్ట్ బౌలర్ అయిన మిచెల్ జాన్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2009, 2014లో ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను సొంతం చేసుకున్నాడు. తన టెస్ట్ కెరీర్ లో ఇప్పటికే 311 వికెట్లు తీసుకొని ఆస్ట్రేలియా తరుపు అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన నాలుగో బౌలర్ గా రికార్డులు లిఖించాడు. 2005లో న్యూజిలాండ్ పై వన్డే ఆరంగ్రేటం చేసిన జాన్సన్ టెస్టుల్లో మాత్రం 2007 లో నవంబర్ 8 గబ్బాలో శ్రీలంక పై ఆరంగ్రేటం చేసాడు. వన్డేల్లో 239 వికెట్లు తీసాడు. 2015 లో ఆస్ట్రేలియా వరల్డ్ కప్ గెలిచిన టీంలో సభ్యుడిగా ఉన్నాడు.

సుబ్రమణియమ్‌ బద్రీనాథ్‌

సుబ్రమణియమ్‌ బద్రీనాథ్‌

తన 38వ పుట్టినరోజుని జరుపుకున్న ఆ మరుసటి రోజే సుబ్రమణియమ్‌ బద్రీనాథ్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. క్రికెట్‌లోని అన్ని రకాల ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. తమిళనాడుకు చెందిన ఈ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ టీమిండియా తరుపున 2008 నుంచి 2011 మధ్య కాలంలో రెండు టెస్టులు, ఏడు వన్డేలు, ఓ టీ20 ఆడాడు. రంజీ క్రికెట్‌లో తమిళనాడుకు 14 ఏళ్ల పాటు మిస్టర్ డిపెండబుల్‌గా బద్రినాథ్ సేవలందించాడు. రంజీ క్రికెట్‌లో గత మూడు సీజన్లలో బద్రినాథ్ విదర్భకు రెండు సంవత్సరాలు, హైదరాబాద్‌కు ఒక సంవత్సరం ప్రాతినిథ్యం వహించాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో 145 మ్యాచ్‌లాడిన బద్రినాథ్‌ 54.49 సగటుతో 10,245 పరుగులు చేశాడు. దాంట్లో 32 సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్‌లో బద్రినాథ్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2010, 2011లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ విజేతగా నిలవడంతో బద్రినాథ్ తనవంతు పాత్ర పోషించాడు.

గౌతమ్ గంభీర్

గౌతమ్ గంభీర్

టీమిండియా రెండు వరల్డ్ కప్‌లు సాధించడంలో కీలకపాత్ర పోషించిన వెటరన్‌ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ కూడా ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. గత కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్‌కి దూరంగా ఉంటున్న గంభీర్ తన రిటైర్‌మెంట్‌ని ఓ ఫేస్‌బుక్ వీడియో ద్వారా గంభీర్ ప్రకటించాడు. ఆటతో అనుబంధానికి ముగింపు పలికే సమయం ఆసన్నమైందని, ఇంతకాలం తనను ఆదరించిన అభిమానులకు గంభీర్ ధన్యవాదాలు తెలిపాడు. తన క్రికెట్ ప్రాక్టీస్‌ కోసం కష్టపడిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు. తనకి అండగా ఉన్న భార్య, కుటుంబం, మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు. 2004 నుంచి 2016 వరకు గంభీర్ కెరీర్‌ దిగ్విజయంగా సాగింది. తన 15 సంవత్సరాల కెరీర్‌లో 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టి20లు ఆడిన ఈ 37 ఏళ్ల ఓపెనర్ అన్ని ఫార్మాట్లలో కలిపి 10,324 పరుగులు చేశాడు. గౌతమ్ గంభీర్ 2011 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Story first published: Tuesday, December 25, 2018, 15:12 [IST]
Other articles published on Dec 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X