ముక్కోణపు సిరిస్ ఆస్ట్రేలియాదే: టీ20ల్లో అత్యధిక స్కోరుతో చరిత్ర

Posted By:
World record secures Aussies tri-series title

హైదరాబాద్: మహిళల ముక్కోణపు టీ20 సిరీస్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. శనివారం ఇంగ్లాండ్‌తో ముంబైలోని బ్రాబోర్న్‌ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.

మహిళల అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలోనే ఇప్పటివరకూ దక్షిణాఫ్రికా పేరిట ఉన్న 205 పరుగుల రికార్డును ఆస్ట్రేలియా అధిగమించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాకు చక్కటి శుభారంభం లభించలేదు.

తొలి ఓవర్‌ నాలుగో బంతికి ఓపెనర్‌ బెత్‌ మూనీ డకౌట్‌గా పెవిలియన్‌ చేరారు. ఆ తర్వాత బరిలోకి దిగిన అలైస్సా హేలీ(33), గార్డనర్‌(33) నిలకడగా రాణించి స్కోరు బోర్డుని పరిగెత్తించారు. ఈ క్రమంలో వీరిద్దరూ రెండో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం వీరిద్దరూ నాలుగు పరుగుల వ్యవధిలో పెవిలియన్‌ చేరారు.

ఆ తర్వాత కెప్టెన్‌ మెగ్‌ లాన్నింగ్‌(88 నాటౌట్‌), విల్లానీ(51)లు చెలరేగడంతో నాలుగో వికెట్‌కు 139 పరుగులు జోడించడంతో ఆస్ట్రేలియా రెండొందల పరుగుల మైలురాయిని అందుకుంది. అనంతరం ఆస్ట్రేలియా నిర్దేశించిన 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసిన ఓటమి పాలైంది.

ఇంగ్లాండ్ బ్యాట్స్‌ఉమెన్‌లలో నటాలీ స్కీవర్‌(50) హాఫ్‌ సెంచరీతో రాణించగా, డానియెల్లీ వ్యాట్‌(34), ఎలెన్‌ జోన్స్‌(30)లు ఫరవాలేదనిపించారు. మిగతా క్రికెటర్లలో ఏడుగురు సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావడంతో ఇంగ్లాండ్ ఓటమి పాలైంది. ఈ సిరిస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన మేగాన్ స్కట్‌కు మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డు లభించగా, ఫైనల్లో హాఫ్ సెంచరీతో నాటౌట్‌గా నిలిచిన కెప్టెన్ మెగ్‌ లాన్నింగ్‌ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Saturday, March 31, 2018, 15:59 [IST]
Other articles published on Mar 31, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి