
ఫామ్‌లో ఉన్న ప్లేయర్
ఈ ఏడాది శ్రేయాస్ అయ్యర్.. ముఖ్యంగా వన్డే ఫార్మాట్‌లో తిరుగులేకుండా ఆడుతున్నాడు. కివీస్‌తో జరిగిన తొలి వన్డేలో కూడా హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇంత అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అతను జట్టుకు చాలా కీలకంగా మారతాడు. 2021లో జట్టులోకి వచ్చిన అతను గాయం కారణంగా మళ్లీ జట్టుకు దూరమయ్యాడు. తిరిగొచ్చేసరికి రిషభ్ పంత్, సూర్యకుమార్ వంటి ఆటగాళ్లతో తన స్థానం కోసం పోటీ పడాల్సి వచ్చింది. ఈ పోటీని తట్టుకొని వన్డే ఫార్మాట్‌లో తనే బెటర్ ప్లేయర్ అని నిరూపించుకున్నాడు. ఈ ఏడాదిలో ఆడిన 11 వన్డే మ్యాచుల్లో కలిపి 63 సగటుతో 566 పరుగులు చేశాడు. ఇందులో ఐదు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉండటం గమనార్హం.

స్పిన్‌ను దంచికొడతాడు
శ్రేయాస్ అయ్యర్ తరఫున వినిపించే బలమైన వాదనల్లో ఇది ఒకటి. అతను స్పిన్ బౌలింగ్‌ను అద్భుతంగా ఎదుర్కొంటాడు. స్పిన్ బౌలింగ్‌లోనే అతను 520 పరుగులు చేయడం గమనార్హం. స్పిన్ బౌలింగ్‌లో అయ్యర్ స్ట్రైక్ రేట్ 105, సగటు 87 అంటేనే ఈ బౌలర్లపై అతని ఆధిపత్యం ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్‌నకు భారత్ ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో అయ్యర్ సత్తా జట్టుకు చాలా కీలకంగా మారే అవకాశం ఉంది.

ఇన్నింగ్స్ నిర్మించగలడు
ఏదో క్రీజులోకి వచ్చామా? మన వంతుగా కొన్ని పరుగులు చేసి వెళ్లిపోయామా? అన్నట్లుగా కాకుండా పరిస్థితికి తగినట్లు ఇన్నింగ్స్ నిర్మించగలిగే సత్తా కూడా అయ్యర్‌కు ఉంది. ఈ ఏడాది అక్టోబరులో లక్నో వేదికగా కివీస్‌తో జరిగిన వన్డేలో అతని ఆలోచనా విధానం తేటతెల్లమైంది. ఆ మ్యాచ్‌లో టపటపా మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా కష్టాల్లో ఉంది. ఇషాన్ కిషన్ బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. అలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన అయ్యర్.. ధనాధన్ బ్యాటింగ్‌తో 37 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇలా పరిస్థితికి తగినట్లు బ్యాటింగ్ చేస్తూ జట్టును విజయం దిశగా తీసుకెళ్లే సత్తా అయ్యర్ సొంతం. ముఖ్యంగా వన్డే ఫార్మాట్‌కు అతని ఆటతీరు చాలా కరెక్ట్‌గా సరిపోతుంది.