ఒకవైపు పెళ్లి, మరోవైపు ఐపీఎల్: తొలి మ్యాచ్‌కి ఫించ్ దూరం

Posted By:
Why Delhi Daredevils star Glenn Maxwell will choose friendship over opening match of IPL 2018

హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు ఆడే తొలి మ్యాచ్‌కి ఆస్ట్రేలియా టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ ఆరోన్ ఫించ్ దూరం కానున్నాడు. ఐపీఎల్ 2018 కోసం జనవరి 27, 28 తేదీల్లో బెంగళూరు వేదికగా జరిగిన వేలంలో ఆరోన్ ఫించ్‌ని పంజాబ్ యాజమాన్యం రూ. 6.2 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

2019 వరల్డ్ కప్‌ని మరిచిపొండి: అశ్విన్, జడేజాలకు కష్టమే!

ఐపీఎల్ 11వ సీజన్ ఏప్రిల్ రెండో వారంలో ప్రారంభం అవుతుందని భావించిన ఆరోన్ ఫించ్... ఏప్రిల్ 7న తన ప్రేయసి అమ్మీ గ్రిఫిత్‌తో పెళ్లి తేదీని ఫిక్స్ చేసుకున్నాడు. అయితే, గురువారం ఐపీఎల్ 11వ సీజన్ మ్యాచ్‌ల షెడ్యూల్‌‌ని బీసీసీఐ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ 11వ సీజన్ ఏప్రిల్ 7 నుంచి మే 27 వరకు జరగనుంది.

తన పెళ్లి తేదీ, ఐపీఎల్ 11వ సీజన్ ప్రారంభ తేదీ ఒకే రోజు కావడంతో కంగుతిన్నాడు. అంతేకాదు ఆ మరుసటి రోజే (ఏప్రిల్ 8న) కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో తలపడనుంది. దీంతో ఆరోన్ పించ్ ఐపీఎల్ 11వ సీజన్‌లో పంజాబ్ జట్టు ఆడే తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండనని చెప్పేశాడు.

తనతో పాటు మరో ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా ఈ మ్యాచ్‌కి అందుబాటులో ఉండటం లేదు. ఎందుకంటే ఈ పెళ్లికి మాస్టర్ ఆఫ్ సెర్మెనీ (ఎంసీ)గా మ్యాక్స్‌వెల్ వ్యవహరించనున్నాడు. వివాహ వేడుక సక్రమంగా జరిగేలా చూడటంతోపాటు అతిథులను ఉత్సాహపర్చడం, వ్యాఖ్యాతగా వ్యహరించడం, వధువరులతో ప్రమాణం చేయించడం లాంటి బాధ్యతల్ని ఎంసీ నిర్వహించాల్సి ఉంటుంది.

ఫించ్ పెళ్లి వేడుకల్లో ఇంతటి కీలక బాధ్యతలను నిర్వర్తించబోతున్న మ్యాక్సీ ఆరంభ మ్యాచ్‌కు దూరం అవుతున్నాడు. వేలంలో మ్యాక్స్‌వెల్‌ను ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు రూ. 9 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆరోన్ పింఛ్ పెళ్లి కారణంగా వీరిద్దరూ ఆయా జట్ల తొలి మ్యాచ్‌కి దూరమవుతున్నారు.

ఐపీఎల్ 2018 షెడ్యూల్ విడుదల: మ్యాచ్ టైమింగ్స్, వేదికల వివరాలివే

దీనిపై ఆరోన్ ఫించ్ క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ 'ఈరోజు ఉదయమే ఐపీఎల్ మ్యాచ్ షెడ్యూల్ చూశాను. నేను ఎట్టిపరిస్థితుల్లోనూ తమ జట్టు ఆడే తొలి మ్యాచ్‌లో పాల్గొనలేను.. నేను ఆరోజు పెళ్లి చేసుకోబోతున్నా. కాబోయే జీవిత భాగస్వామిని అలా వదిలేసి వెళ్లడం భావ్యం కాదు' అని అన్నాడు. రెండో మ్యాచ్ ఏప్రిల్ 13న జరగనుందని దానికోసం చాలా సమయం ఉందని అప్పటిలోగా అక్కడి వచ్చి సన్నద్ధం అవుతానని ఫించ్ వివరించాడు.

'టోర్నీలో భాగంగా పంజాబ్ 13వ తేదీన రెండో మ్యాచ్ ఆడనుంది. పెళ్లి తర్వాత రెండో మ్యాచ్‌కి ఎక్కువ సమయం ఉంది కాబట్టి కేవలం ఒక్క మ్యాచ్‌నే మిస్సవుతున్నా. ప్రస్తుతానికి మిస్ అవుతుంది ఒక్క గేమ్ మాత్రమే, రాబోయే మూడేళ్లు పంజాబ్‌కే ఆడతా, ఇదే ప్రపంచానికి ముగింపు కాదు. నా సహచరుల్లో ఒకడైన హాడ్జికి ఈ విషయం ఇప్పటికే తెలియజేశా' అని అన్నాడు.

ఐపీఎల్ 11వ సీజన్‌కు గాను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కోచ్‌గా బ్రాడ్ హాడ్జిని నియమించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ వల్ల ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులోని చాలా మంది ఆటగాళ్లు ఆరోన్ ఫించ్ పెళ్లిని మిస్సవుతున్నారు. ముందుగానే ఐపీఎల్‌తో కుదుర్చుకున్న ఒప్పందం వల్ల ఆసీస్ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లు ఫించ్ పెళ్లికి హాజరుకాలేకపోతున్నారు.

చెన్నైతోపాటు రెండేళ్లు సస్పెన్షన్ వేటుకు గురై.. తిరిగి బరిలోకి దిగుతున్న రాజస్థాన్ జట్టు హైదరాబాద్ వేదికగా ఏప్రిల్ 9న తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌తో తలపడనుంది. ఐపీఎల్ 11వ సీజన్‌లో డేవిడ్ వార్నర్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తుండగా, రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ ఉన్న సంగతి తెలిసిందే.

Story first published: Thursday, February 15, 2018, 16:04 [IST]
Other articles published on Feb 15, 2018
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి