తలకు దెబ్బ: స్టీవ్ స్మిత్‌‌ని ఢీకొట్టిన స్టోక్స్ (వీడియో)

Posted By:

హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా బుధవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రైజింగ్ పుణె సూపర్‌ జెయింట్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించి షాకిచ్చింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది.

అనంతరం 156 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పూణె 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులతో కోల్‌కతాపై నెగ్గింది. అయితే ఈ మ్యాచ్‌‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌‌కతా ఇన్నింగ్స్‌‌లో ఓ షాకింగ్‌ ఘటన జరిగింది. బౌండరీ వద్ద పూణె కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఆల్ రౌండర్ బెన్‌ స్టోక్స్‌ ఢీకొన్నారు.

దీంతో కెప్టెన్ స్టీవ్ స్మిత్ కాసేపు విలవిల్లాడిపోయాడు. మైదానంలో అంతకముందులాగా కదల్లేకపోయాడు. మ్యాట్‌ తీసుకురావాలని బెన్ స్టోక్స్‌ ఫిజియోను పిలిచినా.. కష్టమ్మీద స్మిత్‌ నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఈ సంఘటన పూణె బౌలర్ జయదేవ్‌ ఉనాద్కత్‌ వేసిన ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌లో చోటు చేసుకుంది.

19వ ఓవర్ ఐదో బంతిని కోల్‌కతా ఆటగాడు కోల్టర్‌ నీల్‌ భారీ షాట్‌ ఆడాడు. బౌండరీ అవతలపడే బంతిని ఎలాగైనా ఆపాలని, వీలైతే క్యాచ్‌ పట్టాలని స్టీవ్ స్మిత్ యత్నించాడు. అదే సమయంలో బెన్ స్టోక్స్ కూడా బంతిని ఆపాలని పరుగెత్తుకుంటూ బౌండరీ లైన్‌ వద్దకు వచ్చాడు.

ముందుగా స్టోక్స్‌ తన చేతిలో పడిని బంతిని గాల్లోకి విసురుతూ.. బౌండరీ లైన్‌ దాటాడు. అయితే ఈ క్రమంలో స్టోక్స్‌ గట్టిగా తగలడంతో బౌండరీ లైన్‌ అవతల ఉన్న సైన్ బోర్డుకు స్టీవ్ స్మిత్‌ తల గుద్దుకుంది. వెంటనే స్టోక్స్ ఫిజియోని రమ్మని పిలిచాడు. ఇంతలో స్మిత్ కాసేపు అలాగే ఉండిపోయాడు.

ఫిజియో వచ్చినా స్మిత్‌ ఎవరి సాయం లేకుండా నొప్పిగా ఉన్నా అలాగే నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌‌లో కూడా కాస్తంత ఇబ్బంది పడుతున్నట్లు కనిపించాడు.

Story first published: Thursday, May 4, 2017, 11:33 [IST]
Other articles published on May 4, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి