కరాచీ: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సలీమ్ మాలిక్‌పై దిగ్గజ పేసర్ వసీం అక్రమ్ సంచలన ఆరోపణలు చేశాడు. తనకంటే రెండేళ్లు ముందు జట్టులోకి వచ్చిన కారణంగా.. తనను జూనియర్‌గా భావించి సపర్యలు చేయించుకునేవాడిని, కట్టు బానిసలాగా ట్రీట్ చేసేవాడని తెలిపాడు. వసీం అక్రమ్ ఆటో బయోగ్రఫీ 'సుల్తాన్ : ఎ మెమోయిర్' పుస్తకంలో అక్రమ్ ఈ విషయాన్ని వెల్లడించాడు. సలీమ్ మాలిక్ తనను ఓ పనోడిలా ఉపయోగించుకున్నాడని అప్పుడు తనకు చాలా కోపంగా ఉండేదని పుస్తకంలో పేర్కొన్నాడు. సలీమ్ మాలిక్ 1982లో పాక్ జట్టులోకి రాగా అక్రమ్ 1984లో జట్టులోకి వచ్చాడు.
అక్రమ్ తన పుస్తకంలో.. 'తన కంటే రెండేళ్లు జూనియర్ అయినందుకు అతను ఆ అడ్వంటేజీని తీసుకునేవాడు. నాతో ఎప్పుడూ నెగిటివ్ గా ఉండేవాడు. సెల్ఫిష్. ఎప్పుడూ నన్ను తనకు ఓ పనోడిలా భావించేవాడు. తనకు మసాజ్ చేయమని అడిగేవాడు. తన మాసిన బట్టలు, బూట్లను ఉతకమనేవాడు. అప్పుడు నాకు చాలా కోపం వచ్చేది.'అని రాసుకొచ్చాడు.
ఈ ఇద్దరూ కలిసి చాలాకాలం పాటు పాకిస్థాన్ జట్టు తరఫున ఆడారు. ఇమ్రాన్ ఖాన్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాక పాకిస్థాన్ సారథిగా సలీమ్ మాలిక్ ఎంపికయ్యాడు. 1992 నుంచి 1995 వరకు అక్రమ్.. మాలిక్ సారథ్యంలోనే ఆడాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య తీవ్ర విభేదాలు వచ్చాయని అప్పట్లో పాకిస్థాన్ మీడియాలో వరుస కథనాలు వెలువడ్డాయి. సలీమ్ మాలిక్.. 2000 ఫిక్సింగ్ వివాదంలో ఇరుక్కొని జీవితకాల నిషేధం ఎదుర్కొన్నాడు.
ఈ ఆరోపణలను వసీం మాలీక్ ఖండించాడు. ఇవన్నీ అవాస్తవాలని కొట్టిపారేసాడు. వసీం తన పుస్తకం అమ్మకాలు పెంచుకునేందుకు ఇదంతా చేస్తున్నాడని తెలిపాడు. తాను కెప్టెన్‌గా ఉండగా వసీం.. వకార్ యూనిస్ తనతో మాట్లాడేవారు కాదని తెలిపాడు.