ధావన్, రోహిత్‌లకు ఏ ప్లస్ అవసర్లేదు: వసీం అక్రం

Posted By:
 Wasim Akram questions Grade A+ BCCI contracts for Rohit Sharma, Shikhar Dhawan

హైదరాబాద్: ఇటీవల భారత క్రికెటర్ల వార్షిక కాంట్రాక్ట్‌ వేతనాలను బీసీసీఐ భారీగా పెంచడంతో.. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించే ఆటగాళ్ల ప్రతిభ ఆధారంగా నూతన కాంట్రాక్ట్‌ ప్రకారం వేతనాలు ఇస్తున్నట్లు బీసీసీఐ పాలక మండలి వెల్లడించింది. దీనిలో భాగంగా కీలక ఐదుగురు ఆటగాళ్లను ఏ ప్లస్‌ గ్రేడ్‌లో చేర్చి వారికి ఏకంగా రూ.7కోట్లు ఇవ్వనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

ఏ ప్లస్‌ గ్రేడ్‌లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, శిఖర్ ధావన్‌, రోహిత్‌ శర్మ, భువనేశ్వర్‌ కుమార్‌, జస్ర్పీత్‌ బుమ్రా ఉన్నారు. అయితే ఈ గ్రేడ్‌లో టెస్ట్‌ స్పెషలిస్ట్‌లు ఛతేశ్వర్‌ పుజారా, అశ్విన్‌, రవీంద్ర జడేజాను కాదని.. రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌కు చోటు కల్పించడం సరైన నిర్ణయం కాదంటూ పాకిస్థాన్‌ క్రికెట్‌ మాజీ దిగ్గజం వసీం అక్రం అంటున్నాడు. ఇదిలాఉండగా రోహిత్‌, ధావన్‌ కూడా టెస్ట్‌ క్రికెట్‌లో తమని తాము అంతగా నిరూపించుకోలేకపోయారు. కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనే రాణిస్తున్నారు. అయినా వారికి ఏ ప్లస్‌ గ్రేడ్‌ కేటాయించడం పట్ల వసీం అక్రం తన అభిప్రాయాన్ని వెలువరించడం చర్చకు దారి తీసింది.

'టెస్ట్‌ క్రికెట్‌ ద్వారానే ఆటగాళ్లలో అత్యుత్తమ ప్రతిభ బయటపడుతుంది. అసలు టెస్ట్‌ క్రికెట్‌ అంటేనే ఎంతో కఠినమైన ఆట. అక్కడ నిరూపించుకున్న వాళ్లు ఎక్కడైనా రాణించగలరు. అలాంటి వారికే అత్యధిక నజరానాలు అందించాలంటూ' పాక్‌ మాజీ ఆటగాడు అక్రం అభిప్రాయపడ్డాడు. అయితే టెస్ట్‌లలో అత్యుత్తమంగా రాణిస్తున్న ఛతేశ్వర్‌ పుజారా, అశ్విన్‌, రవీంద్ర జడేజాలకు ఏ ప్లస్‌ గ్రేడ్‌ కేటాయించలేకపోవడం ఆశ్చర్యకరం.

వారిని పక్కనపెట్టి మరీ టెస్ట్‌లలో అంతంతమాత్రంగా ప్రదర్శన చేస్తున్న రోహిత్‌, ధావన్‌కు ఏ ప్లస్‌ గ్రేడ్‌ కేటాయించి భారీ మొత్తంలో వేతనాలు అందించడం సరైనది కాదంటూ ఈ మాజీ దిగ్గజం అభిప్రాయపడ్డాడు. మరోవైపు టెస్ట్‌లలో, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో స్పిన్‌ విభాగం అంటేనే ముందుగా గుర్తుకు వచ్చేది అశ్విన్‌, జడేజాలే. కానీ కొంతకాలంగా యువ స్పిన్‌ ద్వయం చాహల్‌, కుల్‌దీప్‌ హవా సాగుతున్న నేపథ్యంలో వారిద్దరికీ అవకాశాలు క్రమంగా తగ్గిపోతున్నాయి.

Story first published: Monday, March 12, 2018, 9:09 [IST]
Other articles published on Mar 12, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి