
వీళ్లు ఓపెనర్లేనా?
ఓపెనర్ల పని బంతి బాత పడేలా చేయడం మాత్రమే అనుకోవడానికి టీమిండియా కేవలం టెస్టు క్రికెట్ ఆడటం లేదు. వన్డేలు, టీ20ల్లో కూడా ఓపెనర్లు చాలా నిదానంగా పరుగులు చేయడం భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. టీ20 వరల్డ్ కప్‌లో ఈ సమస్య చాలా స్పష్టంగా కనిపించింది. ఎగ్రెసివ్‌గా బ్యాటింగ్ చేస్తామని జట్టు పగ్గాలు అందుకున్నప్పటి నుంచి రోహిత్ శర్మ చెప్తూనే ఉన్నాడు. కానీ మ్యాచుల్లో మాత్రం ఇది కనిపించడం లేదు. ప్రస్తుతం వన్డేల్లోనే ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వన్డే వరల్డ్ కప్‌లో అయినా టీమిండియా రాణించాలంటే ఓపెనర్లు గేరు మార్చక తప్పదు.

మంచి స్పిన్నర్ దొరకలేదా..?
వన్డే ఫార్మాట్‌లో టాప్ జట్లలో భారత్‌తోపాటు న్యూజిల్యాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్తా, ఉన్నాయి. ఈ జట్లు అన్నింటి దగ్గరా ఒక నిఖార్సయిన రిస్ట్ స్పిన్నర్ ఉన్నారు. ఐష్ సోధి, అదిల్ రషీద్, ఆడమ్ జంపా, షాదాబ్ ఖాన్.. వీళ్లంతా మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచుతున్నారు. కానీ భారత్ వద్ద సరైన స్పిన్నర్ లేడు. ఫామ్‌లో లేని యుజ్వేంద్ర చాహల్ జట్టు కు భారంగా మారాడు. ఈ క్రమంలో పునరాగమనంలో అదరగొడుతున్న కుల్దీప్ యాదవ్ లేదంటే యువ స్పిన్నర్ రవి బిష్ణోయి, రాహుల్ చాహర్‌లలో ఒకరికి అవకాశం కల్పిస్తే ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచొచ్చు.

బ్యాటింగ్ డెప్త్ ఎక్కడ?
భారత్ వద్ద ఉన్న ప్రధాన పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్. వీళ్లు ముగ్గురూ బ్యాటుతో ఏమీ చెయ్యలేరు. కొత్తగా వస్తున్న ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ సేన్ వంటి వాళ్లు కూడా ఏమాత్రం బ్యాటింగ్ చెయ్యలేరు. కొద్దోగొప్పో బ్యాటింగ్ చేసే దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ అంతంతమాత్రమే.
బౌలింగ్ చేస్తూ బ్యాటింగ్ చేసే నిఖార్సయిన ఆల్‌రౌండర్ లేకపోవడం భారత్‌కు అతిపెద్ద సవాల్‌గా మారింది. ఇలా కనీసం బ్యాటింగ్ డెప్త్ లేకపోవడం వన్డే వరల్డ్ కప్‌లో భారత్‌కు అతి పెద్ద సమస్యగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఈ సమస్యలను టీమిండియా ఎలా అధిగమిస్తుందో చూడాలి.