హైదరాబాద్: రెండు దశాబ్దాల పాటు వన్డే క్రికెట్‌ను ఏలిన ఆస్ట్రేలియా.. టీ20 ఫార్మాట్‌లో తొలిసారి విశ్వ విజేతగా నిలిచింది. ఏమాత్రం అంచనాల్లేకుండా టీ20 ప్రపంచకప్ 2021లో అడుగుపెట్టిన ఆసీస్.. నిలకడైన ఆటతో టైటిల్ గెలుచుకుంది. అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించి ఔరా అనిపించింది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి తన సత్తాను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. వన్డే ఫార్మాట్‌లో ఐదు సార్లు విశ్వవిజేతగా నిలిచిన ఆసీస్‌కు టీ20ల్లో ఇదే తొలి టైటిల్ కాగా.. మొదటిసారి తుది పోరుకు అర్హత సాధించిన కివీస్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అయితే ఆసీస్ విజయం, డేవిడ్ వార్నర్ ఆటతీరుపై సోషల్ మీడియా వేదికగా పలు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
ఐపీఎల్ 2021లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సహచరులు అయినా కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్) , డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) టీ20 ప్రపంచకప్ 2021లో బరిలోకి దిగడం తెలుగు అభిమానుల్లో ఉత్కంఠ రేపింది. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే కేన్.. చివరిక్షణాల్లో కప్ పోతున్నా నవ్వుతూ కనిపించాడు. ఐపీఎల్ 14వ సీజన్‌లో వార్నర్‌ను హైదరాబాద్ కెప్టెన్సీ నుంచి తప్పించి, అతడి స్థానంలో విలియమన్స్‌ను కెప్టెన్‌గా నియమించారు. ఇక వార్నర్ పని అయిపోయింది అనేంత రీతిలో విమర్శలూ వినిపించాయి.దేవ్ వీడ్కోలు పలకాల్సిన సమయం వచ్చేసిందని కూడా వార్తలు పుట్టుకొచ్చాయి. కట్ చేస్తే నెల తరవాత వార్నర్ గోడకు కొట్టిన బంతిలా దూసుకొచ్ఛాడు. 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ'గా నిలిచి తనపై వచ్చిన నెగెటివ్ కామెంట్స్‌కు పులిస్టాప్ పెట్టేశాడు.
డేవిడ్ వార్నర్ సతీమణి క్యాండీస్ వార్నర్ .. భర్తకు చెప్పిన విషెస్ అతడిపై ఉన్న ప్రేమను చూపించడమే కాదు విమర్శలు చేసిన వారికి పంచ్ విసిరేలా ఉంది. 'ఫామ్‌లో లేవు, వయసు పెరుగుతోంది, చాలా నెమ్మదిగా ఆడే నీకు అభినందనలు' అంటూ క్యాండీస్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. 'మిమ్మల్ని ద్వేషించే వారికి ఈ రకంగా పాఠం చెప్పే భార్యను పెళ్లి చేసుకోండి' అంటూ ఫాన్స్ మీమ్స్ ట్రెండ్ చేశారు. మీమ్స్‌లో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ త్రిష, కమెడియన్ బ్రహ్మానందంకు సంబంధించింది కూడా తెగ చక్కర్లు కొడుతోంది. కొన్ని ఆకట్టుకునే మీమ్స్ మీ కోసం....