పార్ల్ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైంది. తాజాగా టీమిండియా ఓటమిపై సీనియర్ బ్యాటర్ శిఖర్ ధావన్ స్పందించాడు. అంతేకాకుండా ఓటమికి గల పలు కారణాలను ధావన్ వివరించాడు. 297 పరుగుల భారీ లక్ష్య చేధనలో తాము మంచిగా ఆరంభించామని చెప్పాడు. కెప్టెన్ రాహుల్ త్వరగా ఔటైనప్పటికీ తాను విరాట్ కోహ్లీ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లామని తెలిపాడు. అయితే ఆ తర్వాత మంచు ప్రభావంతో పిచ్ మందగించిందని చెప్పుకొచ్చాడు. దీంతో పిచ్ బౌలర్లకు అనుకూలించడం మొదలుపెట్టిందన్నాడు. అలాంటి పరిస్థితుల్లో భారీ షాట్లు ఆడడం తేలికైన విషయం కాదని ధావన్ చెప్పాడు. అలాంటి పరిస్థితుల్లో మిడిలార్డర్ బ్యాటర్లకు షాట్లు ఆడడం కష్టంతో కూడుకున్న పని అని తెలిపాడు.
ఈ క్రమంలో భారీ భాగస్వామ్యాలను నెలకొల్ప లేకపోయామని ధావన్ చెప్పాడు. దీనికి తోడు వరుసగా వికెట్లు కూడా కోల్పోవడం తమ విజయావకాశాలను దెబ్బ తీసిందని తెలిపాడు. ఇక తమను తాము నిరూపించుకోవడానికి రిషబ్ పంత్, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ వంటి యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని చెప్పుకొచ్చాడు. 2023 ప్రపంచకపే లక్ష్యంగా వారిని తయారు చేస్తున్నామని, జట్టు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నామిన ధావన్ తెలిపాడు. అయితే మధ్యలో ఇలాంటి ఓటములు సహజమేనన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ లేని లోటు స్పష్టంగా కనిపించిందని ధావన్ అన్నాడు. రోహిత్ జట్టులోకి వస్తే రాహుల్ మిడిలార్డర్‌లో ఆడతాడని, అప్పుడు మిడిలార్డర్ బలంగా తయారువుతుందన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు టెంబా బావుమా, వాన్ డెర్ డస్సేన్ అద్భుతంగా ఆడారని ధావన్ కొనియాడాడు. అలాగే తొలి వన్డేలో ధావన్ 79 పరుగులతో రాణించిన సంగతి తెలిసిందే.
అలాగే తన వ్యక్తిగత ఫామ్‌పై కూడా శిఖర్ ధావన్ స్పందించాడు. '' నా కెరీర్ పట్ల నాకు పూర్తి స్పష్టత ఉంది. నా ఆటపై నాకు నమ్మకముంది. అందుకే జట్టులోకి తిరిగి రాగలిగాను. నాపై వేటు పడిన ప్రతిసారి పుంజుకున్నాను. మళ్లీ జట్టులోకి తిరిగొచ్చాను. జట్టు కోసం సర్వశక్తులు ఒడ్డుతాను. మీడియాలో వచ్చే వార్తలను నేను అసలు పట్టించుకోను. అలాగే చదవను కూడా. అందుకే నెగేటివ్ ఆలోచనలకు దూరంగా ఉంటున్నాను.'' అని ధావన్ తెలిపాడు. కాగా శిఖర్ ధావన్ తన వ్యక్తిగత జీవితంలో కొంతకాలం క్రితం భార్యతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.