క్రికెట్‌లో పరుగుల కోత ఇలా కూడా పడుతుందా? (వీడియో)

Posted By:
Sheffield Shield: Matt Renshaw Slapped With Rare Five-Run Penalty

హైదరాబాద్: మైదానంలో కీపర్‌ ఉపయోగించని హెల్మెట్‌కు బంతి తగిలితే, ఫీల్డింగ్‌ చేస్తూ బంతి చేతిలో లేకుండానే బ్యాట్స్‌మెన్ వైపు విసిరినట్లు నటించినా... అదనంగా పరుగులు రావడాన్ని చూశాం. కానీ ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌లో ఓ ఫీల్డర్ చేసిన సరదా పని ఆ జట్టుకు ఐదు పరుగులు కోత పడేలా చేసింది.

షెఫీల్డ్‌ షీల్డ్‌ టోర్నీలో భాగంగా బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో క్వీన్స్‌లాండ్‌-వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. రెన్‌షా క్వీన్స్‌లాండ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన క్వీన్స్‌లాండ్‌ 215 పరుగులు చేసింది. అనంతరం వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా బ్యాటింగ్‌కు దిగగా రెన్‌షా స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్నాడు.

బౌలర్‌ వేసిన బంతిని బ్యాట్స్‌మెన్‌ ఎదుర్కొనగా దానిని అందుకునేందుకు వికెట్ కీపర్ జిమ్మి పీయర్సన్‌ తన చేతి గ్లౌజ్‌ను తీసి కింద పడేసి పరిగెత్తాడు. అదే సమయంలో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తోన్న రెన్‌షా ఆ గ్లౌజ్‌ను చేతికి తగిలించుకున్నాడు. ఇంతలో వికెట్‌ కీపర్‌ తాను అందుకున్న బంతిని రెన్‌షాకు ఇచ్చాడు.

అతడేమో గ్లౌజ్‌ తగిలించుకున్న చేతితో ఆ బంతిని బౌలర్‌కు ఇచ్చాడు. ఇది క్రికెట్‌ నిబంధనలకు విరుద్దం కావడంతో అంపైర్‌ వెంటనే ఐదు పరుగులు కోత విధించాడు. దీంతో క్విన్స్‌లాండ్‌ ఆటగాళ్లు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. నిబంధనల ప్రకారం మైదానంలో వికెట్‌ కీపర్‌ కాకుండా ఫీల్డింగ్‌ చేస్తున్న జట్టు ఆటగాడు ఎవరూ గ్లౌజ్‌ ధరించకూడదు.

'క్రికెట్‌ రూల్‌ 27.1 ప్రకారం కేవలం వికెట్‌ కీపర్‌ మాత్రమే గ్లోవ్స్‌ ధరించి ఫీల్డింగ్‌ చేయాలి. ఇతరులకు అనుమతి లేదని వివరించారు' అని అంఫైర్ రెన్ షాకు వివరించాడు. అంఫైర్ ఐదు పరుగులు కోత విధించినప్పటికీ... ఈ మ్యాచ్‌లో క్వీన్స్‌లాండ్ విజయం సాధించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Story first published: Saturday, March 10, 2018, 16:09 [IST]
Other articles published on Mar 10, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి