అది నా అదృష్టం: 'బాల్ ఆఫ్ ద సెంచ‌రీ'పై షేన్ వార్న్ (వీడియో)

Posted By:

హైదరాబాద్: బాల్ ఆఫ్ ద సెంచ‌రీ.. క్రికెట్ గురించి తెలిసిన ప్ర‌తి ఒక్క‌రికి దీని గురించి తెలిసే ఉంటుంది. ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ 1993లో ఈ మ్యాజిక్ చేశాడు. యాషెస్ టెస్టు సిరిస్‌లో భాగంగా మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరిగిన టెస్టులో ఈ అరుదైన సంఘటన చోటు చేసుకుంది.

ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో వార్న్ వేసిన ఈ బంతి అతడి కెరీర్‌నే ఓ మలుపు తిప్పిందనే చెప్పాలి. ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మ‌న్ మైక్ గ్యాటింగ్‌ను బోల్తా కొట్టించిన బంతి అది. లెగ్ స్టంప్ బ‌య‌ట పిచ్ అయిన బాల్‌.. మెలిక‌లు తిరుగుతూ ఏకంగా ఆఫ్‌స్టంప్‌ను గిరాటేసింది.

ఏం జ‌రిగిందో అర్థం కాని గ్యాటింగ్‌తోపాటు అంపైర్ కూడా అలా చూస్తుండిపోయారు. ఆసీస్ ప్లేయ‌ర్స్ మాత్రం సంబ‌రాల్లో మునిగితేలారు. దీనిని 'బాల్ ఆఫ్ ద సెంచ‌రీ'గా ఆ త‌ర్వాత ఐసీసీ గుర్తించింది. ఈ టెస్టులో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా 179 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ఇక, ఈ మ్యాచ్‌లో షేన్ వార్న్ 8 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. బుధవారం షేన్ వార్న్ తన 48వ పుట్టినరోజు సందర్భంగా బాల్ ఆఫ్ ద సెంచ‌రీపై వార్న్ స్పందించాడు. దీనికి సంబంధించిన వీడియోని ఐసీసీ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసింది.

ఆ బంతి కేవ‌లం త‌న అదృష్ట‌మేన‌ని ఈ సంద‌ర్భంగా వార్న్ అన్నాడు. 'ప్ర‌తి లెగ్ స్పిన్న‌ర్ వేయాల‌నుకునే బాల్ అది. నా అదృష్టం.. నేను వేశాను. ఆ బాలే ఫీల్డ్‌లో ఫీల్డ్ బ‌య‌ట నా జీవితాన్ని మొత్తం మార్చేసింది. ఆ త‌ర్వాత అలాంటి బంతి నేను ఎప్పుడూ వేయ‌లేదు' అని వార్న్ చెప్పాడు.

Story first published: Friday, September 15, 2017, 16:00 [IST]
Other articles published on Sep 15, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి