నాలుగో బంతికే ఔట్‌: టీ20ల్లో రోహిత్ శర్మ డకౌట్ల రికార్డు

Posted By:
rohit sharma

హైదరాబాద్: టీ20ల్లో టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ తన డకౌట్ల రికార్డుని కొనసాగిస్తున్నాడు. ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ మరోసారి డకౌటయ్యాడు. ఇన్నింగ్స్‌ నాలుగో బంతికే వికెట్‌ ఇచ్చేశాడు.

శ్రీలంక బౌలర్ చమీరా విసిరిన బంతిని లాంగాఫ్‌ దిశగా గాల్లోకి లేపాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఫీల్డర్‌ మెండిస్‌ ఆ బంతిని అద్భుతమైన క్యాచ్‌గా అందుకున్నాడు. దీంతో రోహిత్ శర్మ డకౌట్‌గా వెనుదిరిగాడు. తద్వారా టీ20ల్లో ఐదుసార్లు డకౌట్ అయిన తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు 75 టీ20లు ఆడిన రోహిత్‌ 68 ఇన్నింగ్స్‌ల్లో ఐదు సార్లు డకౌటయ్యాడు. భారత్‌ తరఫున ఏ ఆటగాడు ఇన్నిసార్లు డకౌటైన దాఖలాలు లేవు.

ఇండియా-శ్రీలంక టీ20 మ్యాచ్ స్కోరు కార్డు

ఇటీవలే ముగిసిన దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా జరిగిన టీ20 సిరీస్‌లో రెండుసార్లు డకౌట్ అయిన రోహిత్ శర్మ టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా, యూసుఫ్ పఠాన్ రికార్డును అధిగమించిన సంగతి తెలిసిందే. సఫారీ పర్యటనలో ఫామ్ కోల్పోయిన రోహిత్ శర్మ ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తున్న భారత జట్టుకు కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. గత ఏడాది ఇదే శ్రీలంకపై సొంతగడ్డపై జరిగిన టీ20లో వేగవంతమైన శతకం సాధించి రోహిత్‌ శర్మ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. అలాంటిది ఇప్పుడు డకౌట్‌గా వెనుదిరగడంతో అభిమానులు నిరాశ చెందారు.

లంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియాకు ఆదిలోనే షాక్‌ తగిలింది. తొలి రెండు ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. రోహిత్‌ శర్మ తొలి ఓవర్‌లో డకౌట్‌గా వెనుదిరగగా, రెండో ఓవర్‌లో సురేశ్‌ రైనా(1) పెవిలియన్‌ చేరాడు. నువాన్‌ ప్రదీప్‌ వేసిన రెండో ఓవర్‌ ఆఖరి బంతికి రైనా బౌల్డ్‌ అయ్యాడు.

Story first published: Tuesday, March 6, 2018, 20:10 [IST]
Other articles published on Mar 6, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి