అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో తలపడేందుకు టీమిండియా సన్నద్ధమవుతోంది. బుధవారం నుంచి ఆరంభంకానున్న డే/నైట్ టెస్టు కోసం అహ్మదాబాద్‌లో కొత్తగా నిర్మించిన మొతేరా స్టేడియంలో టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. నెట్స్‌లో సుదీర్ఘంగా ప్రాక్టీస్ చేశారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మ, వికెట్ కీపర్ రిషబ్ పంత్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయగా.. పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్ చేస్తూ కనిపించాడు. వీరితో పాటు భారత ఆటగాళ్లు అందరూ నెట్స్‌లో చెమటోడ్చారు.
అయితే టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన కొత్త ఫ్రెండ్‌తో కలిసి డే/నైట్ టెస్టు మ్యాచ్‌కు సిద్ధమవుతున్నాడు. దీనిలో భాగంగా తన ఫ్రెండ్‌తో కలిసి నెట్ సెషన్‌లో బిజీబిజీగా గడిపాడు. ఇంతకీ పంత్ కొత్త ఫ్రెండ్ ఎవరో తెలుసా? మరెవరో కాదు 'డ్రోన్ కెమెరా'. ప్రాక్టీస్ సందర్భంగా పంత్ డ్రోన్ కెమెరాతో సందడి చేశాడు. డ్రోన్ కెమెరాతో ట్రైనింగ్ సెషన్‌ను వీడియో తీశాడు. అంతేకాదు తన కొత్త స్నేహితుడిని సోషల్ మీడియాలో అభిమానులకు పరిచయం చేశాడు.
'ఈరోజు నేను స్టంప్స్ వెనుక చాలా ప్రాక్టీస్ చేశాను. నెట్ ప్రాక్టీస్‌ను కొత్తగా చూడాలనుకున్నా. నా కొత్త ఫ్రెండ్‌ను కలవండి. నేను అతన్ని స్పైడే అని పిలుస్తాను' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రిషబ్ పంత్ ట్వీట్ చేశాడు. పంత్ డ్రోన్ కెమెరాతో సందడి చేస్తుండగా తీసిన వీడియోను అతడు షేర్ చేశాడు. తాజాగా మిగతా ఆటగాళ్లు జిమ్‌లో శారీరక కసరత్తులు చేస్తుంటే.. పంత్ నేలపై పాకుతూ వెళ్లాడు. గత నెల ఆస్ట్రేలియాతో తలపడిన బ్రిస్బేన్ టెస్టులోనూ నాలుగో రోజు మైదానంలోనే స్పైడర్‌మ్యాన్ హిందీ పాట పాడాడు. కీపింగ్ చేస్తున్నప్పుడు అతడు ఈ పాట పాడడంతో అది స్టంప్‌మైక్‌లో రికార్డు అయింది. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. అప్పటి నుంచి మనోడిని స్పైడర్ పంత్ అని పిలుస్తున్నారు.
ఆస్ట్రేలియా టూర్‌లో వృద్దిమాన్ సాహా స్థానంలో జట్టులోకి వచ్చిన రిషబ్ పంత్ అప్పటినుంచి తన ఆటలో దూకుడును ప్రదర్శిస్తూ వచ్చాడు. ఆసీస్ పర్యటనలో మూడు, నాలుగు టెస్టులతో పాటు ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి రెండు టెస్టుల్లోనూ పంత్ అదే జోరును కొనసాగించాడు. మ్యాచ్ విన్నింగ్స్ ఆడాడు. ఇక ఇంగ్లండ్-భారత్ జట్ల మధ్య మూడో టెస్టు అహ్మదాబాద్ వేదికగా డే/నైట్ రూపంలో జరగనుంది. నాలుగు టెస్టు సిరీస్‌లో భాగంగా ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమానంగా ఉన్నాయి. దీంతో మూడో టెస్ట్ కీలకంగా మారింది.
PinkBall Test: ఆ సమయంలో ఇషాంత్ శర్మను తన్ని లేపాల్సి వచ్చింది: కోహ్లీ