అహ్మదాబాద్: గుజరాత్ ఎమ్మెల్యేగా ఎంపికైన తన సతీమణి రివాబా జడేజాను టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అభినందించాడు. బుధవారం వెలువడిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో రివాబా జడేజా జామ్‌నగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలుపొందిన విషయం తెలిసిందే. ఇక ట్విటర్ వేదికగా ఆమె విజయాన్ని ప్రస్తావించిన జడేజా.. 'హలో ఎమ్మెల్యే' అంటూ శుభాకాంక్షలు తెలిపాడు. గుజరాతీలో ట్వీట్ చేసిన జడేజా.. ఈ విజయానికి రివాబా పూర్తి అర్హురాలని పేర్కొన్నాడు. జామ్ నగర్ నియోజకవర్గంలో పనులన్నీ వేగంగా జరిగిపోతాయని హామీ ఇచ్చిన జడేజా.. తన సతీమణిని గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశాడు.
'హలో ఎమ్మెల్యే.. ఈ విజయానికి నువ్వు అర్హురాలివి. జామ్‌నగర్ ప్రజలు గెలిచారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక నుంచి జామ్‌నగర్ పనులన్నీ జామ్ జామ్‌గా సాగిపోతాయి.'అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు రివాబాతో కలిసి ఉన్న ఫోటోను జత చేసిన జడేజా.. దానిపై 'ఎమ్మెల్యే గుజరాత్'అని క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ కాగా.. 'యూ ఆర్ మై ఎమ్మెల్యే'అని జడేజా పాడుకుంటున్నాడని అభిమానులు సరదాగా కామెంట్ చేస్తున్నారు.
రివాబా జడేజా తన ప్రత్యర్ధిపై 15వేల పైచిలుకు ఓట్ల మేజార్టీ సాధించింది. సతీమణి ఎన్నికల ప్రచారం కోసం గాయం సాకుతో బంగ్లాదేశ్ పర్యటనకు దూరంగా ఉన్న జడేజా.. దగ్గరుండి రివాబా జడేజాను గెలిపించాడు. రివాబా జడేజా మొత్తం 57 శాతం ఓట్లు సాధించింది. జామ్‌నగర్ నార్త్ నియోజక వర్గం నుంచే పోటీచేసిన ఆమ్ ఆద్మీ అభ్యర్థి కర్షన్‌భాయ్ కర్ముర్ 23 శాతం ఓట్లు దక్కించుకోగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బిపేంద్రసిన్హ్ జడేజాకి 15.5 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. జడేజా సోదరి నైనబా జడేజా, తండ్రి అనిరుద్ద్ సిన్హ్ జడేజా కోడలికి వ్యతిరేకంగా ప్రచారం చేశాడు.
Hello MLA you truly deserve it. જામનગર ની જનતા નો વિજય થયો છે. તમામ જનતા નો ખુબ ખુબ દીલથી આભાર માનુ છુ. જામનગર ના કામો ખુબ સારા થાય એવી માં આશાપુરા ને વિનંતી. જય માતાજી🙏🏻 #મારુજામનગર pic.twitter.com/2Omuup5CEW
— Ravindrasinh jadeja (@imjadeja) December 9, 2022
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన బిపేంద్ర సిన్హ్ జడేజాను గెలిపించాలని కోరారు. కానీ మామ, ఆడబిడ్డపై రివాబా జడేజానే పై చేయి సాదించింది. రవీంద్ర జడేజా కుటుంబం ఎన్నో తరాలుగా కాంగ్రెస్ పార్టీకి మద్ధతుదారులుగా ఉన్నారు. జామ్‌నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి జడేజా సోదరి నైనబా జడేజా టికెట్ ఆశించింది. కానీ ఆమెకు టికెట్ దక్కలేదు.