ఐసీసీ నిబంధన ఉల్లంఘన: డీకాక్‌కు 25 శాతం మ్యాచ్ ఫీజులో కోత

Posted By:
Quinton de Kock fined 25 percent of Match fee for breaching ICC Code of Conduct

హైదరాబాద్: డర్బన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో నిబంధనలను ఉల్లంఘించినందుకు దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటర్ డీకాక్‌పై ఐసీసీ చర్యలు తీసుకుంది. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు డర్బన్ వేదికగా జరిగింది.

తప్పంతా వార్నర్‌దే: 75 శాతం కోత, మూడు డీమెరిట్ పాయింట్లు

ఈ మ్యాచ్‌లో నాలుగో రోజైన ఆదివారం టీ విరామ సమయంలో ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, సఫారీ వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్‌ మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ వివాదంపై విచారణ పూర్తి చేసిన ఐసీసీ వార్నర్ చేసింది తప్పుగా పరిగణించి మూడు డీమెరిట్ పాయింట్లతో పాటు మ్యాచ్ ఫీజు నుంచి 75 శాతం కోత విధించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ వివాదంలో ప్రమేయం ఉన్న మరో ఆటగాడు క్వింటన్ డీకాక్‌పై కూడా చర్యలు తీసుకుంది. డికాక్ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా వేయడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్‌ను అతడి ఖాతాలో జత చేసింది. తొలి టెస్టులో వార్నర్ లెవల్ 2 అతిక్రమణకు పాల్పడగా, డీకాక్ లెవెల్ 1 అతిక్రమణకు పాల్పడినట్లు అంఫైర్లు స్పష్టం చేశారు.

ఈ జరిమానాకు సంబంధించి ఐసీసీ అధికారికంగా వెల్లడించలేదని, ఐసీసీ ఆటగాళ్ల ప్రవర్తనా నియమావళి లెవల్-1 తప్పిదం కింద మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో ఈ జరిమానా వేసినట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రస్తుతం వార్నర్ ఖాతాలో మూడు డీమెరిట్ పాయింట్లు ఉండగా, డీకాక్ ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ ఉంది.

ఐసీసీ నిబంధనల ప్రకారం ఏ ఆటగాడి ఖాతాలో నాలుగు డీమెరిట్‌ పాయింట్లు ఉంటే అతడిపై ఒక టెస్టు మ్యాచ్‌ లేదా రెండు వన్డేలు నిషేధం విధిస్తారు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య శుక్రవారం నుంచి పోర్ట్ ఎలిజబెత్ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది.

అసలేం జరిగింది?
డర్బన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో డేవిడ్‌ వార్నర్‌-డికాక్‌ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తొలి టెస్టులో భాగంగా నాలుగో రోజైన ఆదివారం మర్క్రమ్, డీకాక్‌లు క్రీజులో పాతుకుపోయి నిలకడగా ఆడుతూ ఆసీస్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టిన సమయంలో డీకాక్ ఏకాగ్రతను దెబ్బతీసేందుకు వార్నర్ స్లెడ్జింగ్ చేశాడు. ఇందులో భాగంగా డీకాక్ కుటుంబాన్ని వార్నర్ "Bush Pig" అన్నాడు.

దీనిని ఎంతమాత్రం తట్టుకోలేని డీకాక్ టీ విరామ సమయం మైదానం నుంచి బయటకు వచ్చే సమయంలో వార్నర్ భార్య గురించి "f***ing sook" అని అవమానకరమైన వ్యాఖ్యలు చేశాడు. దీంతో డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లేటప్పుడు మెట్ల వద్ద వార్నర్ తీవ్ర వాగ్వాదానికి దిగాడు. సహచరులు టిమ్‌ పైన్‌, ఖవాజా, ఓ అధికారి వారిస్తున్నా వినకుండా వార్నర్‌.. క్వింటన్‌ను కొట్టేందుకు దూసుకెళ్లాడు.

చర్యలు తీసుకోవాల్సిందే: వార్నర్-డీకాక్‌ల వివాదంపై ఐసీసీ

ఈ గొడవ ఎక్కువవడంతో సఫారీ డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉన్న ఆ జట్టు కెప్టెన్‌ డుప్లెసిస్‌ బయటకు వచ్చాడు. ఆ తర్వాత కాసేపటికి కెప్టెన్‌ స్మిత్‌ వచ్చి వార్నర్‌ను డ్రస్సింగ్ రూమ్‌లోకి తీసుకువెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో మొత్తం కింగ్స్ మీడ్ స్టేడియంలో మెట్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డు అయింది.

Story first published: Thursday, March 8, 2018, 14:52 [IST]
Other articles published on Mar 8, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి