న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పీవీ సింధుకు కేంద్రమంత్రుల సన్మానం: ఒలింపిక్స్ అథ్లెట్లకు ప్రధాని మోడీ నుంచి అరుదైన ఆహ్వానం

PM Modi will invite the Indian Olympics contingent to Red Fort as special guests on 15th August

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత అథ్లెట్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి ఓ అరుదైన ఆహ్వానం అందబోతోంది. ఇది వారికి ఇచ్చే గౌరవంగా భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ ఒలింపిక్స్‌లో దేశానికి కాంస్య పతకాన్ని అందించిన స్టార్ షట్లర్, తెలుగుతేజం పీవీ సింధును కేంద్రం సన్మానించనుంది. ఈ సాయంత్రం 6:30 గంటలకు ఈ కార్యక్రమం ఏర్పాటైంది. కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, సహాయ మంత్రి నితీష్ ప్రామాణిక్.. పీవీ సింధును సత్కరిస్తారు. ఈ కార్యక్రమాన్ని యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

ఈ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున 127 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. 18 ఈవెంట్లకు ప్రాతినిథ్యాన్ని వహించారు. ఇందులో రెండింట్లో భారత్ పతకాలను ముద్దాడింది. మహిళల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి చాను రజత పతకాన్ని అందుకున్నారు. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ కేటగిరీలో పీవీ సింధు కాంస్యాన్ని సాధించారు. వరుస ఒలింపిక్స్‌లో పతకాన్ని సాధించిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. 2016లో రియో డీ జనేరియోలో సాగిన ఒలింపిక్స్‌లో సింధు రజతాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇంకా కొన్ని కేటగిరీలు మిగిలే ఉన్నందున.. ఈ పతకాల సంఖ్య పెరిగే అవకాశాలు లేకపోలేదు.

కాగా- భారత అథ్లెట్లు అధ్బుతంగా రాణించారని ప్రధాని మోడీ ప్రశంసించారు. ఈ ఉదయం పురుషుల హాకీ కేటగిరీలో భారత్-బెల్జియం మధ్య సెమీ ఫైనల్స్ మ్యాచ్‌ను ఆయన తిలకించారు. సెమీ ఫైనల్‌లో ఓడినప్పటికీ..ఒలింపిక్స్ మొత్తం మీద హాకీ ఇండియా అంచనాలకు మించి రాణించిందని ప్రశంసించారు. జట్టు కేప్టెన్ మన్‌ప్రీత్ సింగ్‌కు స్వయంగా ఫోన్ చేశారు. అభినందనలు తెలిపారు. అదే సమయంలో ప్రధానమంత్రి మరో కీలక నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. ఆగస్టు 15వ తేదీన దేశ రాజధానిలోని ఎర్రకోట వద్ద నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అథ్లెట్లందరినీ ఆహ్వానించబోతోన్నారు.

ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఓ సమాచారాన్ని విడుదల చేసింది. పతాక ఆవిష్కరణ, ప్రసంగం ముగించిన అనంతరం ప్రధాని.. అథ్లెట్లను కలుసుకుంటారని, వారితో ముచ్చటిస్తారని పేర్కొంది. అనంతరం అక్కడి నుంచి నేరుగా వారందరినీ తన అధికారిక నివాసానికి తీసుకెళ్తారని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. అక్కడ వారి గౌరవార్థం హై-టీని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అథ్లెట్లతో పాటు ఒలింపిక్స్‌లో పాల్గొన్న అధికారులు.. కొందరు కేంద్రమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశంలో క్రీడారంగాన్ని మరింత బలోపేతం చేయడానికి అవసరమైన సూచనలు, సలహాలను ప్రధాని అడిగి తెలుసుకుంటారని సమాచారం.

Story first published: Tuesday, August 3, 2021, 15:47 [IST]
Other articles published on Aug 3, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X