టీ20ల్లో హిట్ వికెట్‌గా: కేఎల్ రాహుల్ ఖాతాలో ఓ చెత్త రికార్డు (వీడియో)

Posted By:
Nidahas Trophy: KL Rahul Becomes First Indian To Be Dismissed Hit Wicket In T20Is

హైదరాబాద్: ముక్కోణపు టీ20 సిరిస్‌లో భాగంగా సోమవారం లంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ ఓ చెత్త రికార్డుని సొంతం చేసుకున్నాడు. భారత్‌ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో హిట్‌ వికెట్‌ రూపంలో వెనుదిరిగిన తొలి ఆటగాడిగా రికార్డు సాధించాడు.

టీ20ల్లో ఇప్పటివరకు ఏ భారత ఆటగాడు కూడా హిట్ వికెట్‌గా ఔటవ్వలేదు. అయితే, సోమవారం కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌ హిట్‌ వికెట్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. ఇన్నింగ్స్ 10వ ఓవర్లో కుశాల్‌ మెండీస్‌ వేసిన ఐదో బంతిని ఎదుర్కొనే క్రమంలో కేఎల్ రాహుల్ కాస్త వెనక్కి వెళ్లాడు.

ఆ సమయంలో అతడి కుడి కాలు వికెట్లను తాకడంతో బెయిల్స్‌ కిందపడ్డాయి. దీంతో రాహుల్‌ హిట్‌ వికెట్‌‌గా పెవిలియన్‌కు చేరాడు. ఇప్పటి వరకు అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 10 మంది ఆటగాళ్లు హిట్‌ వికెట్‌‌గా పెవిలియన్‌కు చేరారు. వన్డేల్లో ఇప్పటి వరకు 65 మంది హిట్‌ వికెట్‌ రూపంలో ఔటవ్వగా ఇందులో నలుగురు భారత క్రికెటర్లు ఉన్నారు.

నయన్‌ మోంగియా(1995లో, పాకిస్థాన్‌పై), అనిల్‌కుంబ్లే(2003లో, న్యూజిలాండ్‌పై), సచిన్‌ టెండూల్కర్(2008లో, ఆస్ట్రేలియాపై), విరాట్‌ కోహ్లీ(2011లో, ఇంగ్లాండ్‌పై) వన్డేల్లో హిట్‌ వికెట్‌గా ఔటైన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. ఇక, టెస్టు క్రికెట్‌లో ఇప్పటి వరకు 158 మంది ఆటగాళ్లు ఇలా ఔటయ్యారు.

టెస్టుల్లో హిట్ వికెట్‌గా వెనుదిరిగిన తొలి భారత క్రికెటర్‌గా మాజీ కెప్టెన్ లాల్‌ అమర్‌నాథ్‌ నిలిచాడు. చెన్నైలో వెస్టిండీస్‌తో 1949లో జరిగిన టెస్టులో లాల్ అమర్‌నాథ్ హిట్‌వికెట్‌గా వెనుదిరిగాడు. టీమిండియా మాజీ క్రికెటర్ మోహింద‌ర్‌ అమర్‌నాథ్‌ తాను ప్రాతినిథ్యం వహించిన 69 టెస్టుల్లో మూడుసార్లు ఇలా ఔటయ్యాడు.

అటు టెస్టుల్లోనూ, వన్డేల్లోనూ హిట్‌ వికెట్‌‌గా వెనుదిరిగిన ఒకే ఒక్క భారత ఆటగాడు విరాట్‌ కోహ్లీనే.

Story first published: Tuesday, March 13, 2018, 12:11 [IST]
Other articles published on Mar 13, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి