టీమిండియాకు షాకిచ్చిన శ్రీలంక: ముక్కోణపు సిరిస్‌లో తొలి విజయం

Posted By:
Perera

హైదరాబాద్: ముక్కొణపు సిరీస్‌లో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన తొలి టీ20లో టీమిండియాపై ఆతిథ్య శ్రీలంక 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 175 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక మరో 9 బంతుల మిగిలుండగానే లక్ష్యాన్ని చేధించింది.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు టాపార్డర్ ఆటగాళ్లు చక్కటి శుభారంభాన్నిచ్చారు. కుషల్ పెరీరా 37 బంతుల్లో 4 సిక్సులు, 6 ఫోర్ల సాయంతో 66 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 175 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు ఓపెనక్ కుశాల్‌ మెండిస్‌(11) వికెట్‌ను ఆదిలోనే కోల్పోయింది.

ఆ తర్వాత కుశాల్‌ పెరీరా, గుణతిలకాల జోడి నిలకడగా ఆడుతూ పరుగులు సాధించారు. వీరిద్దరూ ఐదు ఓవర్లు ముగిసేసరికి లంక స్కోరును 70 పరుగులకు చేర్చారు. ఈ సమయంలో గుణతిలకా (19) పరుగుల వద్ద జయదేవ్ ఉనాద్కత్ బౌలింగ్‌‌లో రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

గుణతిలకా ఔటైన పెరీరా మాత్రం దూకుడుగా ఆడుతూ రన్‌రేట్‌ను కాపాడుకుంటూ వచ్చాడు. ఈ క్రమంలో చండిమాల్‌(14), కుశాల్‌ పెరీరా(66) పరుగుల వద్ద ఔట్ అవడంతో టీమిండియా మ్యాచ్‌పై పట్టు బిగించినట్లే కనిపించింది. అయితే చివర్లో తిషారా పెరీరా(22), షనకా(15) బ్యాట్‌ను ఝుళిపించడంతో లంక 18.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది.

భారత బౌలర్లలో చాహల్, సుందర్ చెరో రెండు వికెట్లు తీసుకోగా.... ఉనాద్కట్ ఒక వికెట్ తీశాడు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక శిఖర్ ధావన్ అద్భుతమైన బ్యాటింగ్‌తో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 174 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.


శ్రీలంక విజయ లక్ష్యం 175

ముక్కొణపు సిరీస్‌లో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. దీంతో ఆతిథ్య శ్రీలంకకు 175 పరుగుల భారీ విజయ లక్ష్యం నిర్దేశించింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఓపెనర్ శిఖర్ ధావన్ బాధ్యాయుతంగా ఆడి కష్టాల్లో పడ్డ జట్టుకు అండగా నిలిచాడు. ప్రేమదాస స్టేడియంలో బౌండరీల వర్షం కురిపించాడు.

లంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. 49 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సుల సాయంతో 90 పరుగులు చేసి తృటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. మరోవైపు మనీష్ పాండే ధావన్‌కు మద్దతుగా నిలిచి స్కోరు బోర్డుని పరిగెత్తించాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.

shikhar dhawan

అయితే జట్టు స్కోరు 104 పరుగులు వద్ద మనీష్ పాండే(37) మెండీస్ బౌలింగ్‌లో గుణతిలకాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన యువ క్రికెటర్ రిషబ్ పంత్‌ (23) అద్భుతంగా ఆడాడు. ఇక, ధావన్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన దినేష్ కార్తీక్(13) చివర్లో మెరుపులు మెరిపించాడు.

శ్రీలంక బౌలర్లలో చమేరా రెండు వికెట్లు తీసుకోగా, గుణతిలకా, మెండీస్, ప్రదీప్ తలో వికెట్ తీశారు.


ధావన్ హాఫ్ సెంచరీ

ముక్కొణపు సిరీస్‌లో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న తొలి టీ20లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ దూకుడుగా ఆడుతున్నాడు. ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడ్డ జట్టుకు అండగా నిలిచాడు. ధనంజయ డిసిల్వా వేసిన 10.5వ బంతిని బౌండరీకి తరలించి టీ20ల్లో ఐదో హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. 33 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 56 పరుగులు నమోదు చేశాడు. మరోవైపు మనీష్ పాండే(34) ధావన్‌కు మద్దతుగా అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్నాడు. వీరిద్దరు కలిసి మూడో వికెట్‌కి 91 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. దీంతో 12 ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది.


నాలుగో బంతికే రోహిత్ శర్మ డకౌట్
ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ మరోసారి డకౌటయ్యాడు. ఇన్నింగ్స్‌ నాలుగో బంతికే వికెట్‌ ఇచ్చేశాడు. శ్రీలంక బౌలర్ చమీరా విసిరిన బంతిని లాంగాఫ్‌ దిశగా గాల్లోకి లేపాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఫీల్డర్‌ మెండిస్‌ ఆ బంతిని అద్భుతమైన క్యాచ్‌గా అందుకున్నాడు. తద్వారా టీ20ల్లో ఐదుసార్లు డకౌట్ అయిన తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు.

తొలి రెండు ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. రోహిత్‌ శర్మ తొలి ఓవర్‌లో డకౌట్‌గా వెనుదిరగగా, రెండో ఓవర్‌లో సురేశ్‌ రైనా(1) పెవిలియన్‌ చేరాడు. నువాన్‌ ప్రదీప్‌ వేసిన రెండో ఓవర్‌ ఆఖరి బంతికి రైనా బౌల్డ్‌ అయ్యాడు. దీంతో భారత్ తొలి రెండు ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 10 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ధావన్(8), మనీష్ పాండే(1) పరుగులతో ఉన్నారు.


టీమిండియా బ్యాటింగ్
ముక్కోణపు టీ20 సిరిస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత్-శ్రీలంక జట్లు మంగళవారం తలపడతున్నాయి. కొలంబో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య శ్రీలంక జట్టు ఫీల్డింగ్ ఎంచుకుని రోహిత్ సేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

ఇండియా-శ్రీలంక టీ20 మ్యాచ్ స్కోరు కార్డు

ఈ మ్యాచ్‌లో భారత్ తరుపున ఆల్ రౌండర్ విజయ్ శంకర్ అరంగేట్రం చేస్తున్నాడు. టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి అతడికి క్యాప్ ఇచ్చి శుభాకాంక్షలు తెలిపాడు. శ్రీలంకకు స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా నిదాహాస్‌ ట్రోఫీ పేరిట ఈ టోర్నీ జరుగుతోంది.

ఈ సందర్భంగా శ్రీలంక కెప్టెన్ చండీమాల్ మాట్లాడుతూ 'పిచ్ చాలా బాగుంది. భారత్‌ని తక్కువ స్కోర్‌కి కట్టడి చేసి మేం ఆ స్కోర్‌కి చేజింగ్ చేయాలని అనుకుంటున్నాం. ఏడుగురు బ్యాట్స్‌మెన్లు, నలుగురు బౌలర్లతో బరిలోకి దిగుతున్నాం' అని అన్నాడు.

అనంతరం భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ 'టాస్ ఓడినందుకు ఏం బాధపడటం లేదు. పిచ్ చాలా బాగుంది. ఈ సిరీస్‌కి మేం శుభ ఆరంభం ఇవ్వాలని అనుకుంటున్నాం. యువ ఆటగాళ్లు తమ సత్తా చాటుకునేందుకు ఇది సరైన అవకాశం. దేశవాళీ టోర్నీల్లో వాళ్ల గొప్ప ప్రదర్శన చేశారు' అని అన్నాడు.

ఈ టోర్నీలో మూడో జట్టుగా బంగ్లాదేశ్ పాల్గొంటుంది. ఈ ముక్కోణపు టీ20 సిరిస్ రౌండ్ రాబిన్ పద్ధతిన జరగనుంది. అంటే టోర్నీలోని ఒక్కో జట్టు మరో జట్టుతో రెండేసి సార్లు ఆడుతాయి. టాప్‌లో నిలిచిన రెండు జట్లు ఈనెల 18న జరిగే ఫైనల్లో తలపడుతాయి. ఫైనల్ మ్యాచ్‌తో సహా ఈ సిరిస్‌లోని అన్ని మ్యాచ్‌లు ప్రేమదాస స్టేడియంలోనే జరుగుతాయి.

భారత్, శ్రీలంక మధ్య జరిగే తొలి మ్యాచ్ టికెట్లన్నీ ఇప్పటికే అమ్ముడుపోయాయి. ఈ సిరిస్‌లో భారత జట్టు ఫెవరేట్‌గా బరిలోకి దిగుతోంది. జాతీయ జట్టులో చోటు సంపాదించాలని కలలు కంటున్న యువ క్రికెటర్లకు ఇదో సువర్ణావకాశం. ఈ టోర్నీలో చక్కటి ప్రదర్శన కనబరిస్తే, 2019 వన్డే జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయం.

శ్రీలంకతో జరిగిన 14 టీ20 మ్యాచ్‌ల్లో భారత్‌ 10 నెగ్గింది. ఈ ముక్కోణపు సిరిస్ జరుగుతున్న కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత జట్టు ఆడిన 7 టీ20ల్లో ఆరింటిలో గెలిచింది. ఈ సిరిస్‌లో పలువురు ఆటగాళ్ల కోసం రికార్డులు ఎదురు చూస్తున్నాయి.

జట్ల వివరాలు:
భారత్‌:
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శిఖర్ ధావన్, సురేశ్ రైనా, మనీశ్ పాండే, రిషబ్‌ పంత్, దినేశ్‌ కార్తీక్‌, వాషింగ్టన్‌ సుందర్‌, విజయ్ శంకర్, యజువేంద్ర చాహల్‌, శార్దూల్ ఠాకూర్‌, జయదేవ్ ఉనాద్కత్

శ్రీలంక:
చండిమల్ (కెప్టెన్), కుశాల్ మెండిస్, గుణతిలక, కుశాల్ పెరీరా, ఉపుల్ తరంగ, శనక, తిసారా పెరీరా, అఖిల ధనంజయ, అమిలా అపోన్సో, లక్మల్, చమీరా.

Story first published: Tuesday, March 6, 2018, 18:49 [IST]
Other articles published on Mar 6, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి