తొందర్లో అన్ని సద్దుమణుగుతాయి: తనపై వచ్చిన ఆరోపణలపై షమీ

Posted By:
Mohammed Shami

హైదరాబాద్: తొందర్లోనే అన్ని సద్దుమణుగుతాయని తనపై వచ్చిన ఆరోపణలపై టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ స్పందించాడు. తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో షమీ మాట్లాడుతూ 'నా భార్య చేసిన ఆరోపణలు నిజమైతే క్షమాపణ అడగడానికి నేను సిద్ధంగా ఉన్నా' అని వెల్లడించాడు.

షమీ ఓ శృంగార పురుషుడని వ్యాఖ్యానించిన జహాన్‌.. విడాకులు ఇవ్వాలంటూ తనను షమీ కుటుంబం తనను వేధిస్తోందని అతడి భార్య హసీన్ జహాన్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. తన భర్త చేసిన అకృత్యాలకు సంబంధించిన ఆధారాలన్నీ తన దగ్గర ఉన్నాయని, వీటితో అతడిని కోర్టుకు లాగుతానని పేర్కొంది.

అయితే ఈ వ్యాఖ్యలు అవాస్తవమని షమీ సోషల్‌మీడియా వేదికగా స్పందించాడు. దీంతో ఆమె తనపై గృహ హింసకు పాల్పడుతున్నాడని అతడి భార్య బుధవారం సాయంత్రం కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో బీసీసీఐ ప్రకటించిన తాజా కాంట్రాక్టు నుంచి షమీని తప్పించింది.

ఈ వివాదంపై విచారణ పూర్తయ్యే వరకు షమీకి కాంట్రాక్ట్‌ దక్కదని బీసీసీఐ తేల్చి చెప్పింది. అయితే, గురువారం తాజాగా షమీ మ్యాచ్ ఫిక్సింగ్‌కి కూడా పాల్పడ్డాడని హాసీన్ మరో సంచలన ఆరోపణ చేసింది. దీనిపై షమీ మాట్లాడుతూ "
ఇదంతా నా పేరును దెబ్బతీయడానికి చేస్తున్న కుట్ర. హసీన్‌కు మెంటల్ బ్యాలెన్స్ తప్పిందని, అందుకే నాపై నిరాధారమైన ఆరోపణలు చేస్తోంది" అని అన్నాడు.

"నేను నా భార్యతో మాట్లాడానికి చాలా సార్లు ఫోన్‌ చేశాను. కానీ ఆమె నా ఫోన్‌ ఎత్తడం లేదు. నా మీద వచ్చిన ఆరోపణలన్నీ నిజమైతే నా భార్య, అభిమానులను క్షమించమని అడగడానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను సామరస్యంగా సమస్యను పరిష్కరించుకుందామని అనుకుంటున్నా.. కానీ తన చర్యలు చూస్తుంటే.. నేను కూడా ఈ విషయంలో లీగల్ సహాయం తీసుకొనేందుకు సిద్ధంగా ఉన్నా" అని షమీ అన్నాడు.

"నాపై వచ్చిన ఆరోపణలన్నీ ఆధారం లేనివే. నాకు తెలియని వాటి గురించి ఇప్పుడు నేనేమి మాట్లాడలేను. మేమిద్దరం కలిసే ఉంటున్నాం. కలిసే హోలీ వేడుకలు చేసుకున్నాం. దక్షిణాఫ్రికా పర్యటన తరవాత ఇద్దరం కలిసి షాపింగ్ కూడా చేశాం. నేను ధర్మశాలలో ఉన్నపుడు వీటి గురించి విన్నాను" అని షమీ చెప్పాడు.

"నాకు వేరే వారితో సంబంధం ఉండి ఉంటే ఇతరులు ఈ విషయాన్ని వెల్లడించేవారు. మీడియాలో నా భార్య వెల్లడించిన వాట్సప్‌ సందేశాలు ఏవీ నావి కావు. కావాలంటే నా ఫోన్‌ చెక్‌ చేసుకోండి. నేను మా మామయ్యతో మాట్లాడాను. అతడు నాతో మంచిగా మాట్లాడారు. తొందర్లో అన్ని సద్దుమణుగుతాయని ఆశిస్తున్నా" అని ఆశాభావం వ్యక్తం చేశాడు.

Story first published: Thursday, March 8, 2018, 23:14 [IST]
Other articles published on Mar 8, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి