'సచిన్ గిప్ట్‌గా ఇచ్చిన బ్యాట్‌తోనే పరుగుల వరద పారించా'

Posted By:

హైదరాబాద్: సమాజంలో బాలికల హక్కులను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పిలుపునిచ్చాడు. బుధవారం అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో యూనిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్ హోదాలో సచిన్ హాజరయ్యారు.

అమ్మాయిలకు సరైన అవకాశాలు కల్పించాలి

ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ భారత్‌లో వివక్షను పారద్రోలేందుకు ఇదే సరైనసమయమని అన్నాడు. కలలను సాకారం చేసుకునేందుకు అమ్మాయిలకు సరైన అవకాశాలు కల్పించాలని సచిన్ చెప్పాడు. ఆడ పిల్లలను మగపిల్లలతో సమానంగా పెంచాలని సచిన్ తల్లిదండ్రులకు సూచించాడు.

అడపిల్లలకు ప్రోత్సాహం, తోడ్పాటు ఉండాలి

ప్రతి ఆడపిల్లకు కుటుంబసభ్యుల ప్రోత్సాహం, తోడ్పాటు ఉండాలని తెలిపాడు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న భారత మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యలతో ఏకీభవించింది. సమాజంలో అమ్మాయిలను చిన్నచూపు చూడకూడదని విజ్ఞప్తి చేసింది.

వన్డేల్లో ఆరువేల పరుగుల మైలురాయి

ఇంగ్లాండ్ వేదికగా ఈ ఏడాది జరిగిన ఐసీసీ వరల్డ్ కప్‌లో మిథాలీ రాజ్ వన్డేల్లో ఆరువేల పరుగులు మైలురాయిని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సచిన్ తనని సచిన్ అభినందించిన తీరుపై మిథాలీ ఈ కార్యక్రమంలో వెల్లడించింది. 'వన్డేల్లో ఆరువేల పరుగుల మైలురాయిని సాధించినప్పుడు సచిన్ ఫోన్ చేసి క్రికెట్‌ను ఆపొద్దని సలహా ఇచ్చారు. వరల్డ్ కప్ ఫైనల్‌ మ్యాచ్‌కి ముందు రోజు కూడా నేను సచిన్‌తో మాట్లాడా. ఫైనల్ మ్యాచ్ కావడంతో మమ్మల్ని ఉత్సాహపరచడానికి సచిన్ అక్కడికి వచ్చాడు' అని మిథాలీ పేర్కొంది.

సచిన్ ఇచ్చిన బ్యాట్‌తోనే పరుగుల వరద

సచిన్ టెండూల్కర్ నుంచి తాను గిఫ్ట్‌గా అందుకున్న బ్యాట్‌తోనే వరల్డ్ కప్‌లో పరుగుల వరద పారించానని మిథాలీ చెప్పుకొచ్చింది. అది ఇప్పటికీ తన వద్దే ఉందని వెల్లడించింది. ఇక, మైదానంలో మహిళలు క్రికెట్ ఆడే సమయంలో పలు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని మిథాలీ ఈ సందర్భంగా సూచించింది.

Story first published: Thursday, October 12, 2017, 12:00 [IST]
Other articles published on Oct 12, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి