ఢాకా ప్రీమియర్ లీగ్‌లో డబుల్ హ్యాట్రిక్: వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు

Posted By:
Mashrafe Mortaza achieves rare ‘double hat-trick’ in Dhaka Premier League

హైదరాబాద్: బంగ్లాదేశ్‌ వన్డే కెప్టెన్‌ మష్రాఫ్‌ మోర్తజా అరుదైన ఘనతను సాధించాడు. ఢాకా ప్రీమియర్ లీగ్‌లో మోర్తజా వరుస నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు సాధించాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

ఢాకా ప్రీమియర్‌ లీగ్‌లో అబాహనీ లిమిటెడ్‌ జట్టు తరపున ఆడుతున్న మోర్తజా.. అగ్రానీ బ్యాంక్‌ క్రికెట్‌ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో భాగంగా చివరి ఓవర్‌లో వరుసగా నాలుగు వికెట్లు తీశాడు. మోర్తజా వరుసగా నాలుగు వికెట్లు తీయడంతో అబాహనీ జట్టు 11 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

బంగ్లాదేశ్‌ దేశవాళీ మ్యాచ్‌ల్లో ఇలా ఒక బౌలర్‌ వరుస బంతుల్లో నాలుగు వికెట్లు సాధించడం ఇదే మొట్టమొదటిసారి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అబాహనీ జట్టు 290 పరుగులు చేసింది. అనంతరం 291 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన అగ్రానీ బ్యాంక్‌ జట్టు ప్రారంభం నుంచే దూకుడుగా ఆడింది.

49 ఓవర్లు ముగిసే సరికి ఆరు వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసింది. దీంతో ఆఖరి ఓవర్‌లో అగ్రానీ బ్యాంక్ జట్టు విజయానికి 13 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్ వేసేందుకు బంతిని అందుకున్న మోర్తజా తొలి బంతికి పరుగు ఇచ్చాడు. ఆపై వరుసగా నాలుగు వికెట్లు సాధించాడు.

ఆఖరి ఓవర్ రెండో బంతికి దిమాన్‌ ఘోష్‌ను పెవిలియన్‌కు పంపిన మోర్తజా.. మూడో బంతికి అబ్దుర్‌ రజాక్‌ను ఔట్ చేశాడు. ఇక, నాలుగో బంతికి షఫుల్‌ ఇస్లామ్‌ను ఐదో బంతికి ఫజల్‌ రాబీని పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో అగ్రానీ జట్టుపై అబాహనీ జట్టు 11 పరుగుల తేడాతో విజయం​ సాధించింది.

మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో మోర్తజా ఆరు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మోర్తాజా ప్రస్తుతం వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగే ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌పై దృష్టి సారించాడు.

Story first published: Wednesday, March 7, 2018, 11:36 [IST]
Other articles published on Mar 7, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి