అసలేం జరుగుతోంది?: మొన్న వార్నర్-డీకాక్... నేడు రబాడ-స్మిత్ (వీడియో)

Posted By:
Kagiso Rabada vs Steve Smith

హైదరాబాద్: నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా పోర్ట్ ఎలిజబెత్ వేదికగా జరుగుతోన్న రెండో టెస్టులో ఆటగాళ్లు క్రీడాస్ఫూర్తిని మరిచిపోతున్నారు. డర్బన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో వార్నర్-డీకాక్‌ల మధ్య చోటు చేసుకున్న వివాదం అంతర్జాతీయ క్రికెట్‌లో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.

తాజాగా పోర్ట్ ఎలిజబెత్ వేదికగా జరుగుతోన్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబడ, ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ల మధ్య గొడవ చేసుకుంది. ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్మిత్‌(25) రబడ వేసిన 51.6వ బంతికి ఎల్బీగా ఔటయ్యాడు.

నిరాశతో పెవిలియన్ వెళ్లేందుకు నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌వైపు వస్తున్న స్మిత్‌కు ఎదురుగా వెళ్లిన రబాడ తన భుజంతో ఢీకొట్టాడు. అయినప్పటికీ స్మిత్ కేవలం వెనక్కి తిరిగి మాత్రమే చూశాడు. ఇదే ఇప్పుడు వివాదానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో ఐసీసీ నిబంధనల ప్రకారం స్మిత్‌ను శారీరకంగా తాకినందుకు రబాడపై చర్యలు తీసుకోనున్నారు.

Kagiso Rabada vs Steve Smith send-off video: ‘Nasty’ act could get Proteas bowler banned

ఐసీసీ ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిలో లెవల్-2 తప్పిదం కింద రబాడపై అభియోగాలు నమోదు చేశారు. తప్పు చేసినట్లు తేలితే మూడు లేదా నాలుగు డీమెరిట్ పాయింట్లు ఇచ్చే అవకాశ ముంది. దీంతో అతడు రెండు మ్యాచ్‌ల్లో నిషేధం ఎదుర్కోనున్నాడు. రెండో రోజు ఆటలో అతడిని వివరణ కూడా కోరే అవకాశం ఉంది.

మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రౌ దీనిపై విచారణ జరిపి తుది నిర్ణయం ప్రకటించే అవకాశముంది. ప్రస్తుతం రబాడ ఖాతాలో 5 డీమెరిట్ పాయింట్లు ఉన్నాయి. డీమెరిట్ పాయింట్లు 8కి చేరితే రెండు టెస్టులపై నిషేధం విధిస్తారు. ఐసీసీ అతడిపై వేటు వేస్తే ఆసీస్‌తో సిరీస్‌లో మిగతా మ్యాచ్‌లకు దూరంకానున్నాడు.

ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని మ్యాచ్‌ రిఫరీ ప్రకటించాడు. తొలి ఇన్నింగ్స్‌లో రబడ (5/96) విజృంభించడంతో ఆస్ట్రేలియాను 243 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌ (63), బాన్‌క్రాఫ్ట్‌ (38) చక్కటి శుభారంభాన్నిచ్చినప్పటికీ.. మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలమవడంతో ఆస్ట్రేలియా తక్కువ స్కోరుకే ఆలౌటైంది.

మిడిలార్డర్లో టిమ్‌ పైన్‌ (36) రాణించడంతో ఆస్ట్రేలియా 200 పరుగులు మాత్రమే దాటగలిగింది. సఫారీ బౌలర్లలో రబాడతో పాటు ఎంగిడి (3/51), ఫిలాండర్‌ (2/25) రాణించారు. ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా ఆటగాళ్ల ప్రవర్తనపై మాజీ ఆటగాళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది క్రీడాస్పూర్తికి విరుద్దమని అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉంటే డర్బన్ టెస్టులో క్రీడాస్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించిన వార్నర్‌, నాథన్‌ లియోన్‌లకు మ్యాచ్‌ ఫీజులో కోత విధించిన సంగతి తెలిసిందే. డ్రెస్సింగ్‌ రూంకు వెళ్తుండగా డికాక్‌తో గొడవ పెట్టుకున్న వార్నర్‌కు 75 శాతం మ్యాచ్‌ ఫీజు కోతతో పాటు మూడు డీమెరిట్‌ పాయింట్స్‌ విధించారు.

అలాగే దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటన్ డీకాక్‌కు 25 శాతం మ్యాచ్ ఫీజులో కోత విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్‌ను జత చేశారు. డివిలియర్స్‌ రనౌట్‌ అనంతరం అతనిపైకి బాల్‌ విసిరిన లియాన్‌కు 15 శాతం ఫీజుకోత విధించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన దక్షిణాఫ్రికా ఆట ముగిసే సమయానికి మార్‌క్రమ్‌ (11) వికెట్‌ నష్టపోయి 39 పరుగులు చేసింది. ఎల్గర్‌ (11), రబాడ (17) క్రీజులో ఉన్నారు.

Story first published: Saturday, March 10, 2018, 13:54 [IST]
Other articles published on Mar 10, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి