రిటైర్మెంట్‌ నా సొంత నిర్ణయం: ఎవరి ఒత్తిడి లేదన్న నెహ్రా

Posted By:

హైదరాబాద్: నవంబర్ 1న న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లో మైదాంలో న్యూజిలాండ్‌తో జరగబోయే టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు ఆశిష్ నెహ్రా వీడ్కోలు పలుకుతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై ఆశిష్ నెహ్రా స్పందించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ తన సొంత నిర్ణయమని, ఇందులో ఎవరి ఒత్తిడి లేదని కూడా నెహ్రా స్పష్టం చేశాడు.

ఆసీస్‌తో టీ20 సిరీస్‌ కోసం బీసీసీఐ ఎంపిక చేసిన జట్టులో నెహ్రా స్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా చివరిదైన మూడో టీ20 కోసం ఇరు జట్లు ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్నాయి. అయితే ఇప్పటి వరకు జరిగిన రెండు టీ20ల్లోనూ నెహ్రా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.

మూడు టీ20ల సిరిస్ విజేత ఎవరో నిర్ణయించే చివరి టీ20 శుక్రవారం జరగనుంది. ఈ సందర్భంగా ఆశిష్ నెహ్రా గురువారం మీడియాతో మాట్లాడాడు. 'జట్టు మేనేజ్‌మెంట్‌తో పాటు సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌తో మాట్లాడా. సుమారు 20 ఏళ్ల క్రితం రంజీ ట్రోఫీలో తన తొలి మ్యాచ్ ఎక్కడ ఆడానో, అదే వేదికలో చివరి మ్యాచ్ ఆడాలని కోరా' అని నెహ్రా అన్నాడు.

రిటైర్మెంట్‌ నా సొంత నిర్ణయం

'రిటైర్మెంట్‌ నా సొంత నిర్ణయం. ఎవరి ఒత్తిడి లేదు. నవంబర్ 1న కివీస్‌తో జరిగే టీ20 నా చివరి అంతర్జాతీయ మ్యాచ్‌. అదీ కూడా నా సొంత మైదానమైన ఢిల్లీలో సొంత అభిమానుల మధ్య వీడ్కోలు పలకడం కంటే ఇంకేం కావాలి. నేను ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని ఎప్పటికీ వెనక్కి తీసుకోను' అని నెహ్రా పేర్కొన్నాడు.

వీడ్కోలు తర్వాత ఐపీఎల్‌లో కూడా ఆడను

'అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించిన తర్వాత ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) కూడా ఆడను. రాబోయే రోజుల్లో పెద్ద టోర్నీ కూడా లేదు. భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. ఇదే సరైన నిర్ణయమని, ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నా' అని నెహ్రా తెలిపాడు.

కోచ్‌, కెప్టెన్‌‌లతో చర్చించా

కోచ్‌, కెప్టెన్‌‌లతో చర్చించా

వీడ్కోలు నిర్ణయంపై ఇప్పటికే కోచ్‌ రవిశాస్త్రి, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో చర్చించిన ఆశిష్ నెహ్రా బుధవారం టీమిండియా సభ్యులతో కూడా తన నిర్ణయాన్ని చెప్పాడు. అయితే వచ్చే ఏడాది షెడ్యూల్ ప్రకారం టీ20 వరల్డ్ కప్ జరిగే అవకాశం లేకపోవడంతో నెహ్రా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు.

భారత్ తరుపున 17 టెస్టులు, 120 వన్డేలు, 26 టీ20 మ్యాచ్‌లాడిన నెహ్రా

యువ క్రికెటర్లకు అవకాశం ఇచ్చే క్రమంలో తన రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయమని నెహ్రా భావించి తన రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు సదరు అధికారి తెలిపారు. 1999లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన నెహ్రా, ఇప్పటివరకు భారత్ తరుపున 17 టెస్టులు, 120 వన్డేలు, 26 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 44 వికెట్లు, వన్డేల్లో 157, టీ20ల్లో 34 వికెట్లు తీశాడు. 2011లో వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాలో కూడా నెహ్రా సభ్యుడిగా ఉన్నాడు.

Story first published: Thursday, October 12, 2017, 17:10 [IST]
Other articles published on Oct 12, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి