T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచ కప్ సన్నాహాల్లో భాగంగా టీమిండియా సెమీస్‌లో పటిష్టమైన ఇంగ్లాండ్ జట్టును ఎదుర్కోవడానికి సిద్ధమవుతోంది. అయితే ఈ కీలక మ్యాచ్‌కు ముందు ఓపెనింగ్ జోడీని ఎంపిక చేయడం జట్టు యాజమాన్యానికి సవాలుగా మారింది. ముఖ్యంగా టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ వరుస వైఫల్యాలు చెందుతుండటం జట్టులో ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తనదైన శైలిలో స్పందిస్తూ. ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండాల్సిన మార్పులపై ఆసక్తికర సూచనలు చేశారు.

టోర్నీ ఆరంభానికి ముందు ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ వంటి వారే అభిషేక్ శర్మ ఈ టోర్నీలో టాప్ స్కోరర్‌గా నిలుస్తాడని జోస్యం చెప్పారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గత 6 ఇన్నింగ్స్‌ల్లో అభిషేక్ కేవలం 80 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అందులో సగం కంటే ఎక్కువ పరుగులు జింబాబ్వేపై వచ్చినవే. 131.14 స్ట్రైక్ రేట్‌తో ఆయన తడబడుతుంటే.. మరోవైపు ఇషాన్ కిషన్ 185.12 స్ట్రైక్ రేట్‌తో 224 పరుగులు చేసి జోరుమీదున్నాడు. అలాగే సంజూ శాంసన్ కూడా తక్కువ అవకాశాల్లోనే 195.89 స్ట్రైక్ రేట్‌తో మెరుపులు మెరిపించి తుది జట్టులో చోటు కోసం గట్టిగా పోటీ పడుతున్నారు.

అభిషేక్ శర్మను జట్టు నుంచి తొలగించే విషయంలో రవిశాస్త్రి ఓ వినూత్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేవలం స్కోర్లు రావడం లేదని అతడిని పక్కన పెట్టకూడదని, అతడి 'ఆత్మవిశ్వాసం దెబ్బతిందా లేదా అన్నది మాత్రమే కొలమానం కావాలని ఆయన అన్నారు. నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతడి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, మానసికంగా అతను ఎంత బలంగా ఉన్నాడనేది జట్టు మేనేజ్‌మెంట్ నిశితంగా గమనించాలని సూచించారు. ఒకవేళ అతడు మానసికంగా కుంగిపోయి ఉంటేనే మార్పు గురించి ఆలోచించాలని రవిశాస్త్రి స్పష్టం చేశారు.

ఒకవేళ అభిషేక్‌ను తప్పించక తప్పని పరిస్థితి వస్తే.. అప్పుడు టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌ను పూర్తిగా పునర్వ్యవస్థీకరించాలని రవి శాస్త్రి సూచించారు. ఇషాన్ కిషన్‌ను సంజూ శాంసన్‌తో కలిసి ఓపెనింగ్‌కు పంపాలని.. తద్వారా మిడిలార్డర్‌లో ఏర్పడే ఖాళీని 'ఫినిషర్' రింకూ సింగ్‌తో భర్తీ చేయాలని ఆయన ప్లాన్ వివరించారు. దీనివల్ల బ్యాటింగ్ లైనప్‌లో లోతు పెరగడమే కాకుండా, చివరి ఓవర్లలో భారీ హిట్టింగ్ చేసే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
అభిషేక్ శర్మకు మద్దతు ఇవ్వడానికి రవిశాస్త్రి గత చరిత్రను కూడా గుర్తు చేశారు. గతేడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌పైనే వాంఖడే స్టేడియంలో అభిషేక్ 135 పరుగులతో వీరవిహారం చేసి, టీ20ల్లో భారత్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును నెలకొల్పాడు. ఇంగ్లాండ్ బౌలర్లను చిత్తుగా కొట్టిన అనుభవం అతడికి ఉంది కాబట్టి, మరో అవకాశం ఇస్తే సెమీస్‌లో అతడు మళ్లీ ఫామ్‌లోకి వచ్చే ఛాన్స్ ఉందని రవిశాస్త్రి ఆశాభావం వ్యక్తం చేశారు.