ఐపీఎల్ 2018 గీతం విడుదల , ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అభిమానులు

Posted By:
 IPL launches anthem for 2018 edition

హైదరాబాద్: ఐపీఎల్ 2018 కోసం సర్వం సిద్ధమైంది. ఫ్రాంచైజీలు ఇప్పటికే జట్టులో కెప్టెన్, కోచ్‌లతో సహా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకున్నాయి. అయితే ఈ ఏడాది ఐపీఎల్ ప్రసార హక్కుల దక్కించుకున్న స్టార్‌ స్పోర్ట్స్‌ ఈ 11వ సీజన్‌కు సంబంధించిన ఐపీఎల్ గీతాన్ని విడుదల చేసింది. బెస్ట్ వర్సెస్ బెస్ట్ శీర్షికతో విడుదల చేసిన ఈ గీతం కొంతసమయంలోనే సోషల్‌మీడియాలో వైరల్ అయింది.

గత పది సీజన్లుగా ఐపీఎల్‌లో జరిగిన ముఖ్య సంఘటనలు మిక్స్ చేస్తూ దానికి ఓ పాటని జత చేసి ఈ గీతాన్ని విడుదల చేశారు. అయితే ఈ గీతం అంత ఆసక్తిగా లేకపోవడంతో ఐపీఎల్ అభిమానులు అసంతృప్తికి గురైయ్యారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను గత పదేళ్లుగా సోని టెలివిజన్ ఐపీఎల్‌ను ప్రసారం చేస్తూ వచ్చింది.


ప్రతీ ఏడాది ఓ కొత్త తరహా పాటతో సోని నెట్‌వర్క్ అభిమానుల్ని అలరిస్తూ వస్తోంది. ట్విట్టర్ వేదికగా విడుదల చేసిన ఈ గీతంపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది వచ్చిన పాటల్ని రీమిక్స్ చేసి ఈ పాటను విడుదల చేశారని కామెంట్ చేస్తున్నారు. ఈ ఏడాది కూడా ప్రసారహక్కులు సోనీ వద్దే ఉంటే.. ఇంతకంటే మెరుగైన గీతాన్ని విడుదల చేసేదని అంటున్నారు.

మరికొందరు నిరుత్సాహంతో మొత్తానికి ఏదో ఒక పాటనైతే విడుదల చేశారు.. థాంక్స్ అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 7నుంచి ఐపీఎల్ 11వ సీజన్ ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్ వాంఖడే స్టేడియం వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్ - ముంబై ఇండియన్స్ మధ్య ఏప్రిల్ 7న జరుగనుంది.

Story first published: Tuesday, March 13, 2018, 10:15 [IST]
Other articles published on Mar 13, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి