
తొలుత బౌలింగ్.. అనంతరం బ్యాటింగ్ ఫెయిల్స్..
ముంబై సీసీఐ-బ్రబౌర్న్ స్టేడియంలో శుక్రవారం రాత్రి పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ సమష్టిగా విఫలమైంది. 54 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. బౌలింగ్, బ్యాటింగ్‌లో చేతులెత్తేసిందీ జట్టు. బౌలర్లు ధాటిగా పరుగులను సమర్పించుకోగా.. ప్రత్యర్థి నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించలేక బ్యాటర్లు చతికిల పడ్డారు. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. లియామ్ లివింగ్ స్టోన్-70, జానీ బెయిర్ స్టో-66 విధ్వంసకర ఇన్నింగ్ ఆడారు. జట్టు 200 పరుగులను దాటడానికి వీరిద్దరి భాగస్వామ్యమే ప్రధాన కారణం. సకాలంలో వారిని అవుట్ చేయలేకపోయారు ఆర్సీబీ బౌలర్లు.

వెంటవెంటనే మూడు వికెట్లు..
అనంతరం ఆర్సీబీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. మిడిలార్డర్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్- 35 మినహా మిగిలిన వారంతా విఫలమయ్యారు. జట్టు స్కోరు 33 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ అవుట్ అయిన తరువాత వెంటవెంటనే రెండు వికెట్లు పడ్డాయి. ఇది జట్టుపై ఒత్తిడిని పెంచింది. 34 పరుగుల వద్ద ఫాఫ్ డుప్లెసిస్, 40 పరుగుల వద్ద మహిపాల్ లోమ్రర్ పెవిలియన్ చేరడంతో ఆర్సీబీకి కళ్లెం పడినట్టయింది.

భారీ భాగస్వామ్యాన్ని విజయంగా మలచుకోలేక..
ఆ తరువాత రజత్ పటిదర్-గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఇన్నింగ్‌ను చక్కదిద్దారు నాలుగో వికెట్‌కు 64 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఈ భాగస్వామ్యాన్ని లక్ష్యం వైపు విజయవంతంగా తీసుకెళ్లడంలో మిగిలిన బ్యాటర్లు విఫలం అయ్యారు. జట్టు స్కోర్ 104 పరుగుల వద్ద పటిదర్ అవుట్ అయిన తరువాత మళ్లీ వికెట్ పతనం మొదలైంది. అదే స్కోర్ వద్ద గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా పెవిలియన్ చేరడంతో ఆర్సీబీ పరాజయం ఖరారైంది.

దినేష్ కార్తీక్ సైతం..
ఈ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తోన్న వికెట్ కీపర్ ప్లస్ బ్యాటర్ దినేష్ కార్తీక్ సైతం చేతులెత్తేశాడు. 120 పరుగుల వద్ద అతని వికెట్ పడింది. దినేష్ కార్తీక్ క్రీజ్‌లో ఉన్నాడనే ధీమా సడలిపోయింది. ఆర్సీబీ ఓటమిపై అప్పటివరకు ఉన్న అనుమానాలన్నీ తొలగిపోయాయి. అక్కడి నుంచి సగటున ప్రతి 10 పరుగులకూ వికెట్‌ను కోల్పోతూ వచ్చింది రాయల్ ఛాలెంజర్స్ 155 పరుగుల వద్ద జట్టు మొత్తం పెవిలియన్ చేరింది. అటు కగిసొ రబడ నిప్పులు చెరిగే బంతులకు ఆర్సీబీ బ్యాటర్ల వద్ద సమాధానమే లేదు. నాలుగు ఓవర్లల్లో 21 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడీ సౌతాఫ్రికన్ ఫాస్ట్ బౌలర్.

బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై..
సాధారణంగా సీసీఐ-బ్రబౌర్న్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. హార్డ్ హిట్టర్ల స్వర్గధామంగా పిలుస్తుంటారు. దీన్ని నిజం చేశారు ఇంగ్లాండ్ ప్లేయర్లు- జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టొన్. ఒకరు 66, ఇంకొకరు 70 బాది అవతల పడేశారు. పంజాబ్ ఇన్నింగ్‌లో ఆడింది వీరిద్దరే. శిఖర్ ధవన్-21, కేప్టెన్ మయాంక్ అగర్వాల్-19 పరుగులే ఆ తరువాతి టాప్ స్కోరర్లు. మిగిలిన బ్యాటర్లపై వేసిన వ్యూహాలు బెయిర్‌స్టో, లివింగ్‌స్టొన్ విషయంలో తేలిపోయాయి.