జొహాన్నెస్‌బర్గ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్ కోసం రాజస్థాన్ రాయల్స్ తనని అట్టిపెట్టుకోవడంపై దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మిల్లర్ సంతోషం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2021లోనూ రాజస్థాన్ జట్టుతో కొనసాగడం సంతోషకరమని, ఒక కుటుంబంలా ఉండే ఆ ఫ్రాంఛైజీలోని వాతావరణం తనకెంతో ఇష్టమని ట్విట్టర్ వేదికగా చెప్పాడు. ఈసారి కొత్త సారథి సంజూ శాంసన్ కెప్టెన్సీలో ఆడడానికి ఎదురుచూస్తున్నానని, అతడి నేతృత్వంలో జట్టు విజయాల కోసం తోడ్పడడానికి ఆసక్తిగా ఉన్నా అని మిల్లర్ తెలిపాడు.
డేవిడ్ మిల్లర్ చాలా కాలం కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరఫున ఆడాడు. 2014 సీజన్‌లో 446 పరుగులు చేసి పంజాబ్ తొలిసారి ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. అందువల్లే పంజాబ్ అతడిని 2019వరకు కొనసాగించింది. అయితే చివరి 2-3 సీజన్లలో అతడి ప్రదర్శన బాలేకపోవడంతో.. 2020 సీజన్‌కు ముందు వదిలేసింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ మిల్లర్‌ను కొనుగోలు చేసింది. యూఏఈలో జరిగిన 13వ సీజన్‌లో మిల్లర్ ఒకే ఒక్క మ్యాచ్ ఆడి రిజర్వ్ బెంచ్‌కు పరిమితమయ్యాడు.
చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో డకౌటవ్వడంతో రాజస్థాన్ రాయల్స్ తర్వాతి మ్యాచ్‌ల్లో మిల్లర్‌కు అవకాశం ఇవ్వలేదు. తుది జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లు ఉండాలన్న నిబంధన కూడా అవకాశాలు రాకపోవడానికి ఓ కారణం. బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, జోస్ బట్లర్, స్టీవ్ స్మిత్ గత సీజన్ ఆడారు. మిల్లర్ ఇప్పటివరకు ఐపీఎల్‌లో మొత్తం 80 మ్యాచ్‌లు ఆడగా.. 1,850 పరుగులు చేశాడు. అందులో ఒక శతకం, 9 అర్ధ శతకాలు ఉన్నాయి.
ఐపీఎల్ 2021 సీజన్‌కు సంబంధించిన ప్లేయర్స్ వేలం ఫిబ్రవరి 18న జరిగే అవకాశం ఉందని బీసీసీఐ అధికారి శుక్రవారం తెలిపారు. ఫిబ్రవరి 18న వేలం జరగనుందని, వేదికపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. ఈ ఏడాది ఐపీఎల్ భారత్‌లో జరుగుతుందా లేదా అనే విషయంపై బీసీసీఐ ఎలాంటి స్పష్టతనివ్వలేదు. రాబోయే సీజన్‌ను స్వదేశంలో నిర్వహించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా చాలాసార్లు చెప్పారు. సొంతగడ్డపై వచ్చే నెల నుంచి ఇంగ్లాండ్‌తో భారత్ సిరీస్ సజావుగా జరిగితే స్వదేశంలోనే ఐపీఎల్ నిర్వహించడానికి మార్గం సుగమం అవుతుంది.
రాజస్థాన్ రాయల్స్:
రిటేన్ చేసుకున్న ప్లేయర్స్: సంజు శాంసన్, బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, జోస్ బట్లర్, రియాన్ పరాగ్, శ్రేయస్ గోపాల్, రాహుల్ తెవాతియా, మహిపాల్ లోమ్రార్, కార్తీక్ త్యాగి, ఆండ్రూ టై, జయదేవ్ ఉనద్కట్, మయాంక్ మార్కండె, యశస్వి జైస్వాల్, అనుజ్ రావత్, డేవిడ్ మిల్లర్, మనన్ వోహ్రా, రాబిన్ ఉతప్ప.
రిలీజ్ చేసిన ప్లేయర్స్: స్టీవ్ స్మిత్, అంకిత్ రాజ్‌పుత్, ఒషానె థామస్, ఆకాశ్ సింగ్, వరుణ్ ఆరోన్, టామ్ కరన్, అనిరుద్ధ జోషి, శశాంక్ సింగ్.
ఆరుగురు అరంగేట్ర ఆటగాళ్లకు కొత్త కార్లు.. సర్ప్రైజ్ ఇచ్చింది ఎవరో తెలుసా?