అబుదాబి: రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్ ఫలితం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నానని ముంబై తాత్కలిక కెప్టెన్ కీరన్ పొలార్డ్ తెలిపాడు. ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతున్నామన్నాడు. ఇక తొడ కండరాల గాయం కారణంగా గత రెండు మ్యాచ్‌లకు దూరమైన రోహిత్ శర్మ.. ఈ మ్యాచ్‌కు కూడా అందుబాటులోకి రాలేదు. సోమవారం అతను నెట్స్‌లో ప్రాక్టీస్ చేసినా పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది.
ఇక తాము బ్యాటింగే చేయాలనుకున్నామని ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. మూడు మార్పులతో బరిలోకి దిగుతున్నామని చెప్పాడు. గాయం కారణంగా నవ్‌దీప్ సైనీ దూరమవడంతో ఈ మార్పులు చేయాల్సి వచ్చిందన్నాడు. నవదీప్ సైనీ, ఫించ్, మోయిన్ అలీ స్థానాల్లో ఫిలిప్, స్టెయిన్, దూబే జట్టులోకి వచ్చారన్నాడు.
11 మ్యాచ్‌ల్లో చెరో ఏడు విజయాలతో పాయింట్ల పట్టికలో 1, 2వ స్థానాల్లో ఉన్న ఇరు జట్లూ మరో విజయంతో ప్లే ఆఫ్స్ బెర్త్‌ను అధికారికంగా ఖరారు చేసుకోవాలని భావిస్తున్నాయి. అలాగే, ఇరు జట్లూ తమ గత మ్యాచ్‌ల్లో చిత్తుగా ఓడి కాస్త డీలా పడ్డాయి. ముంబై 8 వికెట్ల తేడాతో రాజస్తాన్ చేతిలో ఓడగా.. బెంగళూరు కూడా అన్నే వికెట్ల తేడాతో చెన్నై చేతిలో పరాజయాన్ని ఎదుర్కొంది. దాంతో, ఈ మ్యాచ్‌లో గెలిచి మళ్లీ గెలుపు బాట పట్టాలని రెండు టీమ్స్ ఆశిస్తున్నాయి. తొలి అంచె మ్యాచ్‌లో ఇరు జట్ల మధ్య పోరు సూపర్ ఓవర్‌కు దారితీసింది. నవ్‌దీప్ సైనీ సూపర్ బౌలింగ్‌తో బెంగళూరు అద్భుత విజయాన్నందుకుంది. దాంతో ఈ మ్యాచ్‌లో గెలిచి ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ముంబై భావిస్తోంది. ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు 26 సార్లు తలపడగా.. 16-10తో ముంబై లీడ్‌లో ఉంది. చివరి 5 మ్యాచ్‌ల్లో ముంబై మూడు సార్లు గెలిచింది.
తుది జట్లు
ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్, క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారి, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్(కెప్టెన్), కృనాల్ పాండ్యా, ట్రెంట్ బౌల్ట్, జేమ్స్ పాటిన్సన్, రాహుల్ చహర్, జస్ప్రీత్ బుమ్రా.
బెంగళూరు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), దేవదూత్ పడిక్కల్, ఫిలిప్, ఏబి డివిలియర్స్, డేల్ స్టెయిన్, శివమ్ దూబే, గుర్‌క్రీత్ సింగ్, క్రిస్ మొర్రిస్, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్, యుజువేంద్ర చాహల్.