న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చివరివరకు ఉత్కంఠ: ఆఖరి బంతికి ముంబైపై ఢిల్లీ విజయం

By Nageshwara Rao
Roy

హైదరాబాద్: ఓపెనర్ జేసన్ రాయ్ మెరుపు ఇన్నింగ్స్‌తో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఈ సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ డేర్‌డెవిల్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 195 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీని జేసన్ రాయ్ ఒంటిచేత్తో విజయతీరాలకు చేర్చాడు.

చివరి ఓవర్లో ఢిల్లీ విజయానికి 11 పరుగులు అవసరమైన వేళ.. కెప్టెన్ రోహిత్ శర్మ ఆఖరి ఓవర్‌ను ముస్తాఫిజుర్ రెహ్మాన్‌కు ఇచ్చాడు. ముస్తాఫిజుర్ వేసిన తొలి రెండు బంతుల్ని ఫోర్, సిక్స్ బాదిన రాయ్.. తర్వాతి మూడు బంతుల్లో పరుగులు చేయలేకపోయాడు. దీంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది.

విజయానికి ఆఖరి బంతికి ఒక్క పరుగు అవసరమైన వేళ.. ఉత్కంఠ మధ్య సింగిల్ బాదిన రాయ్ (53 బంతుల్లో 91 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్సులు) జట్టును గెలిపించాడు. గంభీర్‌తో కలిసి తొలి వికెట్‌కు 50 పరుగులు జోడించిన జేసన్ రాయ్.... రిషబ్ పంత్‌ (47)తో కలిసి రెండో వికెట్‌కు 69 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

దూకుడుగా ఆడుతోన్న రిషబ్ పంత్ (47) వ్యక్తిగత పరుగుల వద్ద కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో కీరన్ పొలార్డ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ (13)ను హార్దిక్ పాండ్యా స్టన్నింగ్‌ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు. మ్యాక్స్‌వెల్ త్వరగానే ఔటైనప్పటికీ.. చివర్లో శ్రేయస్ అయ్యర్‌ (20 బంతుల్లో 27)తో కలిసి రాయ్ ఢిల్లీని విజయ తీరాలకు చేర్చాడు.

ఫీల్డర్లు క్యాచ్‌లు వదిలేయడం, ఆఖరి ఓవర్లలో ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా రాణించడం ముంబై ఓటమికి కారణమైంది. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది.


జేసన్ రాయ్ హాఫ్ సెంచరీ
వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ దూకుడుగా ఆడుతోంది. 195 పరుగుల లక్ష్య ఛేదనలో 11 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు వికెట్‌ నష్టానికి 113 పరుగులు చేసింది. ఓపెనర్ జేసన్ రాయ్ (56 నాటౌట్: 29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులు) హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. మరోవైపు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ (42) వరుస బౌండరీలు బాదడంతో మెరుగైన స్థితిలో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో రిషబ్ పంత్(42), జేసన్ రాయ్ (56) పరుగులతో ఉన్నారు.


గంభీర్ ఔట్: తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ
195 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు ఆరో ఓవర్ తొలి బంతికి కెప్టెన్ గౌతమ్ గంభీర్ (15) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి గంభీర్ పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం 6 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ జట్టు వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది. జాసన్ రాయ్ (37), రిషబ్ పంత్ (1) క్రీజులో ఉన్నారు.


3 ఓవర్లకు ఢిల్లీ 25/0
ముంబై ఇండియన్స్‌ నిర్దేశించిన 195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ డేర్ డెవిల్స్ దూకుడుగా ఆడుతోంది. 3 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 25 పరుగులు చేసింది. ఓపెనర్లు జేసన్‌ రాయ్‌ (17), గౌతమ్‌ గంభీర్‌ (8) పరుగులతో క్రీజులో ఉన్నారు.


ఢిల్లీ విజయ లక్ష్యం 195
వాంఖడే స్టేడియంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు సూర్య కుమార్ యాదవ్‌ (53), ఎవిన్ లావిస్ (48)తో పాటు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ (44) చెలరేగడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది.

దీంతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు 195 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో మిడిలార్డర్‌‌లో బ్యాటింగ్‌కి వచ్చిన కీరన్ పొలార్డ్ (0), కెప్టెన్ రోహిత్ శర్మ (18) ఉసూరుమనిపించడంతో ప్రేక్షకులు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. కృనాల్ పాండ్యా (11), హార్దిక్ పాండ్యా (2) తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు.

MI

ఢిల్లీ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, డేనియల్ క్రిస్టియన్, రాహుల్ తెవాటియా చెరో రెండు వికెట్లు తీసుకోగా, మహమ్మద్ షమీ ఒక వికెట్ తీసుకున్నాడు.


మళ్లీ నిరాశపరిచిన రోహిత్ శర్మ
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మరోమారు నిరాశపరిచాడు. 15 బంతుల్లో 2 ఫోర్లుతో 18 పరుగులు చేసిన రోహిత్... ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో రాయ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ దాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్లు సూర్యకుమార్ యాదవ్ (53), ఎవిన్ లూయిస్ (48) చక్కటి ఆరంభాన్ని ఇచ్చారు. ఇషాన్ కిషన్ కూడా అదే దూకుడును కొనసాగించి 44 పరుగులు చేశాడు. ప్రస్తుతం 18 ఓవర్లు ముగిసే సరికి ముంబై 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది.


వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయిన ముంబై
వాంఖడే స్టేడియంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. ఎవిన్ లూయిస్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించారు. ఈ క్రమంలో 23 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 44 పరుగులు చేసిన ఇషాన్ కిషన్‌ను డానియేల్ క్రిస్టెన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాతి బంతికి ముంబై జట్టు స్టార్ బ్యాట్స్‌మన్ కీరన్ పొలార్డ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 17 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 4 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ రోహిత్ శర్మ (16), కృనాల్ పాండ్యా (7) పరుగులతో ఉన్నారు.


11 ఓవర్లకు ముంబై 111/2
వాంఖడే స్టేడియంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 11 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్‌ను దాటిగా ప్రారంభించింది. ఓపెనర్ ఎవిన్ లావిస్ (48) చెలరేగిపోయాడు. 28 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 48 పరుగులు చేసి రాహుల్ తెవాటియా బౌలింగ్‌లో రాయ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్‌ సూర్య కుమార్ యాదవ్‌ (53)తో కలిసి ఎవిన్ లావిస్ తొలి వికెట్‌కి 102 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

ముంబై ఓపెనర్లు దూకుడుగా ఆడటంతో 3.2 ఓవర్లలో 50 పరుగుల మార్క్‌ని అందుకున్న ముంబై 8.3 ఓవర్లలో 100 పరుగులు చేయడం విశేషం. ఎవిన్ లూయిస్ ఔటైన కొద్దిసేపటికే సూర్య కుమార్ యాదవ్‌ని కూడా తెవాటియా ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. టోర్నీ తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన రోహిత్ శర్మ బ్యాటింగ్ ఆర్డర్‌లో వెనక్కి వెళ్లాడు.

గత సీజన్ అంతా మిడిలార్డర్‌లో ఆడిన రోహిత్.. ఈ సీజన్‌లో మళ్లీ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. ఈ సీజన్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో కలిపి రోహిత్ శర్మ 26 పరుగులు చేశాడు. దీంతో, ఈ మ్యాచ్‌లో మళ్లీ మిడిలార్డర్‌లోకి వెళ్లిన రోహిత్.. ఓపెనర్‌గా అతడి స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ని పంపాడు.


ముంబై ఖాతాలో వేగవంతమైన 50 పరుగుల రికార్డు
తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలవడంతో ముంబై ఇండియన్స్ ఆటగాళ్ల కసి మీద ఉన్నట్లు ఉన్నారు. ఆ కసి మొత్తాన్ని ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లో తీర్చుకుంటున్నారు. ఓపెనర్లు సూర్యకుమార్‌ యాదవ్‌ (41; 20 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సు), ఇవిన్‌ లూయిస్‌ (37; 16 బంతుల్లో 4 పోర్లు, 3 సిక్సులు)తో చెలరేగి ఆడుతున్నారు.

రోహిత్‌ శర్మ స్థానంలో ఓపెనర్‌గా దిగిన సూర్యకుమార్‌ అద్భుతంగా ఆడుతున్నాడు. దీంతో ముంబై తన ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత వేగవంతమైన 50 పరుగుల రికార్డును సాధించింది. కేవలం 22 బంతుల్లోనే 50 పరుగుల మైలురాయిని అందుకుంది. 6 ఓవర్లు ముగిసే సరికి ముంబై వికెట్ నష్టపోకుండా 84 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(41), లూయిస్(37) పరుగులతో ఉన్నారు.


3 ఓవర్లకు ముంబై 40/0
వాంఖడే స్టేడియంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఆటగాళ్లు దూకుడుగా ఆడుతున్నారు. 3 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ వికెట్ కోల్పోకుండా 40 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు ఓపెనర్లు సూర్యకుమార్‌ యాదవ్‌ (22), ఇవిన్‌ లూయిస్‌ (13) సిక్సర్లు, ఫోర్లతో అలరిస్తున్నారు.


టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ డేర్‌డెవిల్స్
ఐపీఎల్ టోర్నీలో భాగంగా శనివారం రెండు మ్యాచ్‌లు జరుగుతున్నాయి. సాయంత్రం నాలుగు గంటలకు జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్-ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్లు తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ముంబైని బ్యాటింగ్‌‌కు ఆహ్వానించాడు.

ముంబై Vs ఢిల్లీ లైవ్ స్కోరు కార్డు

ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఇరు జట్లు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలయ్యాయి. దీంతో ఈ మ్యాచ్‌లోనైనా నెగ్గి టోర్నీలో శుభారంభం చేయాలని ఇరు జట్లు ఊవిళ్లూరుతున్నాయి. తొలి మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో ఓడిన ఢిల్లీ.. రెండో మ్యాచ్‌లో వర్షం కారణంగా ఓవర్లను కుదించడంతో రాజస్థాన్ చేతిలో ఓడింది.

ఈ మ్యాచ్‌లో ఇరు జట్లూ రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నాయి. ముంబై జట్టులోకి బెన్ ‌కటింగ్ స్థానంలో అఖిల ధనంజయ, ప్రదీప్ సంగ్వాన్ స్థానంలో హార్దిక్ పాండ్య‌ాలు చోటు దక్కించుకున్నారు. ఇక, ఢిల్లీ జట్టు ఓపెనర్ కొలిన్ మున్రో స్థానంలో జాసన్ రాయ్, క్రిస్ మోరీస్ స్థానంలో డేనియేల్ క్రిస్టెన్‌కు చోటు దక్కించుకున్నాడు.

జట్ల వివరాలు:
ముంబై ఇండియన్స్:

ఎవిన్ లూయిస్, రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, అకిలా ధనుంజయ, మయాంక్ మార్కండే, జస్ప్రీత్ బుమ్రా, ముస్తాఫిజుర్ రెహ్మాన్

ఢిల్లీ డేర్‌డెవిల్స్
గౌతమ్ గంభీర్ (కెప్టెన్), జాసన్ రాయ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, విజయ్ శంకర్, డేనియేల్ క్రిస్టెన్, రాహుల్ తెవాటియా, నదీమ్, ట్రెంట్ బౌల్ట్, మహమ్మద్ షమీ

Story first published: Saturday, April 14, 2018, 20:03 [IST]
Other articles published on Apr 14, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X