ఐపీఎల్ 2018: షమీ స్థానాన్ని భర్తీ చేసే ఆ ఐదుగురు బౌలర్లు వీరే

Posted By:
IPL 2018: 5 pacers who can replace Mohammed Shami in Delhi Daredevils

హైదరాబాద్: చాలా మంది మహిళలతో తన భర్తకు వివాహేతర సంబంధాలు ఉన్నాయంటూ, తనపై గృహహింసకు పాల్పడినట్లు టీమిండియా పేసర్ షమీపై భార్య హాసిన్‌ జహాన్‌ చేసిన ఆరోపణలతో ఇప్పటికే బీసీసీఐ ప్రకటించిన వార్షిక వేతనాల కాంట్రాక్ట్ జాబితా నుంచి తప్పించిన సంగతి తెలిసిందే.

మరోవైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్‌లో షమీ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. షమీపై ఇప్పటికే పలు రకాల సెక్షన్ల కింద కేసు నమోదు కావడంతో ఐపీఎల్‌ క్యాంప్‌లకు అనుమతించాలా? వద్దా అనే సందిగ్ధంలో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ యాజమాన్యం ఉంది.

ఈ విషయంలో బీసీసీఐ న్యాయసలహా తీసుకోవాలని యాజమాన్యం భావిస్తోంది. షమీది సున్నితమైన అంశం కాబట్టి ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ యాజమాన్యం సిద్ధంగా లేదు. ఒకవేళ ఐపీఎల్‌కు షమీ దూరమైతే అతని స్థానంలో ఎవరు అనే చర‍్చ ప్రారంభమైంది.

ఇందులో భాగంగా నలుగురి బౌలర్ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. విదర్భ పేసర్‌ రజ్నీస్‌ గుర్బానీతో పాటు ఇషాంత్‌ శర్మ, శ్రీనాథ్‌ అరవింద్‌, అశోక్‌ దిండాల పేర్లు తాజాగా తెరపైకి వచ్చాయి.

 రజ్నీస్‌ గుర్బానీ

రజ్నీస్‌ గుర్బానీ

2017-18 సీజన్‌లో విదర్భ జట్టు రంజీ ట్రోఫీ గెలవడంలో గుర్బానీది ప్రధాన పాత్ర పోషించాడు. ఆ సీజన్‌లో మొత్తం 39 వికెట్లు సాధించి అత్యధిక వి​కెట్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఢిల్లీతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో హ్యాట‍్రిక్‌ వికెట్లను సాధించడంతో పాటు మొత్తంగా ఆరు వికెట్లను తన ఖాతాలో వేసుకుని విదర్భ తొలిసారి రంజీ టైటిల్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. హిమాచల్‌ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్లు, కేరళతో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో 5 వికెట్లను, కర్ణాటకతో జరిగిన సెమీ ఫైనల్లో 7 వికెట్లను గుర్బానీ సాధించాడు. అయితే ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఐపీఎల్‌ వేలంలో గుర్బానీని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. ఐపీఎల్‌ వేలంలో గుర్బానీ కనీస ధర రూ. 20 లక్షలుండగా అతన్ని కొనుగోలు చేయడానికి ఏ ప్రాంఛైజీ ఆసక్తి కనబర్చలేదు.

 ఇషాంత్‌ శర్మ

ఇషాంత్‌ శర్మ

ఐపీఎల్ 11వ సీజన్ కోసం నిర్వహించిన వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లలో ఇషాంత్ శర్మ ఒకడు. కనీస ధర రూ. 75 లక్షలతో వేలంలోకి వచ్చిన ఇషాంత్ శర్మను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి కనబర్చలేదు. గతేడాది కూడా ఇషాంత్‌ను తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. అయితే చివరి నిమిషంలో మురళీ విజయ్‌ గాయపడటంతో అతని స్థానంలో ఇషాంత్‌ను కింగ్స్‌ పంజాబ్‌ తీసుకుంది. కింగ్స్‌ పంజాబ్‌ మెంటార్‌ సెహ్వాగ్‌ సలహా మేరకు ఇషాంత్‌ను జట్టులోకి తీసుకున్నారు. అయితే ఆ సీజన్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడిన ఇషాంత్‌ శర్మ ఒక వికెట్‌ను కూడా తీయలేకపోయాడు. ఐపీఎల్‌లో వివిధ జట్లకు ఆడిన అనుభవం ఇషాంత్‌ సొంతం. అంతేకాదు ఢిల్లీ లోకల్‌ బాయ్‌ కావడం ఇషాంత్ శర్మకు కలిసొచ్చే అంశం.

శ్రీనాథ్‌ అరవింద్‌

శ్రీనాథ్‌ అరవింద్‌

కర్ణాటకకు చెందిన ఈ ఫాస్ట్‌ బౌలర్‌ 2011 ఐపీఎల్‌ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున అద్భుత ప్రదర్శన చేశాడు. ఆ సీజన్‌లో 21వికెట్లతో అత్యధిక వికెట్లు సాధించిన మూడో బౌలర్‌గా నిలిచాడు. ఆపై 2016-17 సీజన్‌లో మరొకసారి మెరిసినప్పటికీ, ఈ సీజన్‌లో మాత‍్రం అతన్ని కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. విజయ్ హాజారే ట్రోఫీ ముగిసిన అనంతరం దేశవాళీ క్రికెట్‌కు 33 ఏళ్ల అరవింద్‌ గుడ్‌ బై చెప్పాడు. ఈ సీజన్‌ ఐపీఎల్‌ వేలంలో అతని కనీస ధర రూ. 50 లక్షలు కాగా, అతను అమ్ముడుపోలేదు.

అశోక్‌ దిండా

అశోక్‌ దిండా

2016 ఐపీఎల్‌ సీజన్‌ వేలంలో చివరి నిమిషంలో పుణె జట్టు అశోక్‌ దిండాని కొనుగోలు చేసింది. ఫైనల్‌ రౌండ్‌లో దిండా పుణె జట్టులోకి వచ్చాడు. ఆ సీజన్‌లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లు సాధించి పుణె గెలుపులో దిండా కీలక పాత్ర పోషించాడు. ఆ సీజన్‌లో మొత్తం 9 మ్యాచ్‌లాడిన దిండా 11 వికెట్లు తీశాడు. ఆ తర్వాత 2017 సీజన్‌లో మూడు గేమ్‌లు ఆడిన దిండా తదుపరి మ్యాచ్‌‌ల్లో రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఐపీఎల్లో 10 ఏళ్ల అనుభవం ఉన్నప‍్పటికీ దిండాను నిలకడలేమి ఆటగాడు కావడంతో 11వ సీజన్‌ కోసం నిర్వహించిన వేలంలో ఏ ఫ్రాంచైజీ కూడా దిండాను కొనుగోలు చేసేందుకు ఆసక్తికనబరచలేదు.

 వరుణ్ ఆరోన్

వరుణ్ ఆరోన్

వరుణ్ ఆరోన్, ఉమేశ్ యాదవ్‌లు ఇద్దరూ అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఒకేసారి అరంగేట్రం చేశారు. వీరిద్దరూ 145 కిమీ వేగంతో బంతులు విసరగలరు. గత సీజన్‌లో వరుణ్ ఆరోన్‌ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రూ. 2.8 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ప్రాంఛైజీ నమ్మకాన్ని గెలవడంలో విఫలమయ్యాడు. ఈ ఏడాది వేలంలో కనీస ధర రూ. 50 లక్షలతో వేలంలోకి వచ్చిన వరుణ్ ఆరోన్‌ని కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ కూడా ఆసక్తి చూపలేదు.

Story first published: Monday, March 12, 2018, 15:11 [IST]
Other articles published on Mar 12, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి