ఆ హిట్టర్ మళ్లీ వస్తున్నాడు: కోల్‌కతాకు అదనపు బలం

Posted By:

హైదరాబాద్: ఐపీఎల్‌ పదో సీజన్‌ ఆరంభంలో గుజరాత్ లయన్స్ బౌలర్లుపై విరుచుకుపడి 19 బంతుల్లోనే వేగవంతమైన అర్ధసెంచరీని సాధించి అందరి దృష్టిని ఆకర్షించిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఓపెనర్‌ క్రిస్‌లిన్‌ మళ్లీ మైదానంలో అడుగుపెట్టబోతున్నాడు.

రాజ్‌కోట్‌ వేదికగా గుజరాత్‌ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ లిన్‌ (41 బంతుల్లో 93 నాటౌట్‌; 6 ఫోర్లు, 8 సిక్సులు) పరుగులతో రాణించడంతో కోల్‌కతా వికెట్ నష్టపోకుండా 14.5 ఓవర్లలోనే అద్భుత విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో గంభీర్ 76 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

IPL 2017: Chris Lynn back in training for KKR

దీంతో ఐపీఎల్ పదో సీజన్‌లో అతడికి తిరుగులేదని అందరూ భావించారు. ఆ తర్వాత ఏప్రిల్‌ 9న వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ లిన్‌ క్యాచ్‌ కోసం ప్రయత్నిస్తూ గాయపడ్డాడు. అప్పటి నుంచి చికిత్స తీసుకుంటూ ఐపీఎల్‌కి దూరంగా ఉంటున్న లిన్.. త్వరలోనే మళ్లీ మైదానంలోకి రానున్నట్లు ప్రకటించాడు.

ప్రస్తుతం కోలుకోవడంతో ఈ సీజన్‌ ఆఖర్లో జరిగే మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు. 'భుజం నొప్పి దాదాపు తగ్గిపోయింది. మూడు వారాల తర్వాత నెట్స్‌లో కూడా ప్రాక్టీస్ చేశాను. భుజం సాధారణంగానే ఉన్నట్లు అనిపిస్తోంది. భారత్ నుంచి ఆస్ట్రేలియాకి వెళ్లేలోపు కనీసం కొన్ని ఐపీఎల్ మ్యాచ్‌లైనా ఆడాలని కోరుకుంటున్నా' అని క్రిస్‌లిన్ వివరించాడు.

అంతేకాదు మే 9న కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరుగనున్న మ్యాచ్‌‌కి క్రిస్‌లిన్ కోల్‌కతా జట్టులోకి పునరాగమనం చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టోర్నీలో పది మ్యాచ్‌లాడిన కోల్‌కతా ఏడింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.

టైటిల్‌ కోసం పోరు దగ్గరపడుతున్న నేపథ్యంలో క్రిస్ లిన్‌ జట్టులో చేరితే కోల్‌కతాకు బలం చేకూరుతుంది. ఇక మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో కనీసం ఒకటి గెలిచినా కోల్‌కతా జట్టు ప్లేఆఫ్ చేరిపోతుంది. క్రిస్‌లిన్ స్థానంలో ప్రస్తుతం కోల్‌కతా ఓపెనర్‌గా సునీల్ నరేన్ ఆడుతున్న సంగతి తెలిసిందే.

Story first published: Tuesday, May 2, 2017, 22:55 [IST]
Other articles published on May 2, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి