బౌలర్లు విఫలం, బోల్టన్ సెంచరీ: తొలి వన్డేలో భారత్ ఓటమి

Posted By:
India Women vs Australia Women

హైదరాబాద్: నికోల్ బోల్టన్ (100 నాటౌట్; 101 బంతుల్లో 12 ఫోర్లు)తో అజేయ సెంచరీతో రాణించడంతో వడోదర వేదికగా భారత మహిళల జట్టుతో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత మహిళల జట్టు నిర్దేశించిన 201 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 32.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి చేధించింది.

ఆస్ట్రేలియా బ్యాట్స్ ఉమెన్‌లలో ఓపెనర్లు నికోల్ బోల్టన్ (100 నాటౌట్), హేలీ (38) పరుగులతో చక్కటి శుభారంభాన్నిచ్చారు. జట్టు స్కోరు 60 పరుగుల వద్ద శిఖా పాండే బౌలింగ్‌లో హేలీ పెవిలియన్‌కు చేరగా, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ మెగ్ లానింగ్ (33) దూకుడుగా ఆడే క్రమంలో రనౌట్ అయింది. అదే సమయంలో వన్డేల్లో మెగ్ లానింగ్ 3000 పరుగుల మైలురాయిని అందుకుంది.

అనంతరం బరిలోకి దిగిన ఎల్సీ పెర్రీ (25)తో కలిసి ఓపెనర్ బోల్టన్ జట్టుకు విజయాన్ని అందించింది. ఈ మ్యాచ్‌లో బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. అంతకముందు టాస్ గెలిచిన భారత మహిళల జట్టు 200 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. తాజా విజయంతో ఆస్ట్రేలియా మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. టోర్నీలో భాగంగా ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్‌ గురువారం జరగనుంది.


ఆస్ట్రేలియా విజయ లక్ష్యం 201

ఐసీసీ ఉమెన్‌ చాంపియన్‌షి‌ప్‌లో భాగంగా వడోదర వేదికగా ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరుగుతోన్న తొలి వన్డేలో భారత మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 200 పరుగులు చేసిన ఆలౌటైంది. దీంతో ప్రత్యర్ధి ఆస్ట్రేలియా జట్టుకు 201 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు ఓపెనర్ స్మృతి మందాన (12) పరుగుల వద్ద పదో ఓవర్‌లో గార్డ్‌నర్‌ బౌలింగ్‌లో లానింగ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాట పట్టింది. ఆ తర్వాత 12, 18వ ఓవర్లలో రోడ్రిగ్యూస్‌(1), మరో ఓపెనర్‌ పూనమ్‌ రౌత్‌ (37) కూడా ఔటయ్యారు.

దీంతో 60 పరుగులకే భారత మహిళల జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హర్మన్ ప్రీత్ కౌర్ (9), దీప్తి శర్మ (18), వేదా కృష్ణమూర్తి (16), శిఖా పాండే (2) నిరాశపరిచారు. చివర్లో సుష్మ వర్మ (41), పూజ వస్తాకర్ (51) హాఫ్ సెంచరీతో రాణించడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేసింది.

ఆస్ట్రేలియా మహిళా జట్టు బౌలర్లలో జెస్ జోనాసెన్ నాలుగు వికెట్లు తీసుకోగా, వెల్లింగ్టన్ మూడు, గార్డెనర్, మెఘాన్ చెరో వికెట్ తీసుకున్నారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత మహిళల జట్టు
దక్షిణాఫ్రికా పర్యటనలో ఆ జట్టును ఓడించి వన్డే సిరిస్‌ను అందుకున్న భారత మహిళల జట్టు స్వదేశంలో ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరిస్‌కు సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సోమవారం ఇరు జట్ల మధ్య వడోదరలోని రిలయన్స్ స్టేడియం వేదికగా తొలి వన్డే ప్రారంభమైంది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. అనారోగ్యం కారణంగా కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ తొలి వన్డేకు దూరమైంది. దీంతో మిథాలీ స్థానంలో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కెప్టెన్సీ పగ్గాలు అందుకుంది. ఐసీసీ ఉమెన్‌ చాంపియన్‌షి‌ప్‌లో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌తోనే బోణీ కొట్టాలని మహిళల జట్టు గట్టి పట్టుదలగా ఉంది.

ఈ సిరీస్‌‌లో మిగిలిన రెండు వన్డేలు (15, 18) తేదీల్లో ఇదే స్టేడియం వేదికగా జరుగుతాయి. మ్యాచ్‌లు ఉదయం 9 గంటలకు ప్రారంభంకానున్నాయి. తొలి వన్డేలో నెగ్గడం ద్వారా శుభారంభం అందుకోవాలని భావిస్తోంది. చివరిసారి భారత్‌-ఆసీస్‌ గత జూలైలో ఇంగ్లండ్‌లో జరిగిన వన్డే ప్రపంచ కప్‌ సెమీ్‌సలో తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో భారత్‌ 36 పరుగులతో ఆస్ట్రేలియాపై గెలిచింది.

Story first published: Monday, March 12, 2018, 13:02 [IST]
Other articles published on Mar 12, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి