ముక్కోణపు టీ20 సిరిస్: లంకను చిత్తుగా ఓడించిన భారత్, ఫైనల్ బెర్త్ కన్ఫమ్

Posted By:
4th T20I

హైదరాబాద్: ముక్కోణపు టీ 20 సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన టీ20లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 153 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ 17.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. తద్వారా లంకేయులతో ఆరంభంలో ఎదురైన ఓటమి బదులు తీర్చుకుంది.

తాజా విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లడంతో పాటు ఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. భారత బ్యాట్స్‌మెన్లలో రోహిత్ శర్మ (11), శిఖర్ ధావన్ (8), కేఎల్ రాహుల్ (18), సురేశ్ రైనా (27) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరినప్పటికీ ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పాండే (41), కార్తీక్ (29) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

లంక బౌలర్లలో దనంజయ రెండు వికెట్లు తీసుకోగా, ప్రదీప్‌, జీవన్‌ మెండిస్‌ తలో వికెట్‌ తీసుకున్నారు. వర్షం కారణంగా 19 ఓవర్లకు కుదించారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 19 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది.


నాలుగో వికెట్ కోల్పోయిన భారత్
ముక్కోణపు టీ 20 సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న టీ20లో కేఎల్ రాహుల్ (18) పరుగుల వద్ద ఔట్ కావడంతో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. దీంతో 12 ఓవర్లకు గాను 4 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (11), శిఖర్ ధావన్ (8), కేఎల్ రాహుల్ (18), సురేశ్ రైనా (27) పరుగులు చేసి ఔటయ్యారు. పాండే 22, కార్తీక్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు.


మూడో వికెట్ కోల్పోయిన భారత్
ముక్కోణపు టీ 20 సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న టీ20లో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ఆరంభంలోనే ఓపెనర్లు రోహిత్‌(11), శిఖర్‌ ధావన్‌(8) తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరారు. అనంతరం క్రీజలోకి వచ్చిన సురేశ్‌ రైనా(27) ధాటిగా ఆడే క్రమంలో ప్రదీప్‌ బౌలింగ్‌లో తిశారా పెరీరాకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో భారత్‌ 9 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 83 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 19 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది.


నిరాశ పరిచిన ఓపెనర్లు
ముక్కోణపు టీ 20 సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న టీ20లో ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌ బ్యాటింగ్‌లో నిరాశపర్చారు. 153 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ(11) ధనంజయ బౌలింగ్‌లో కుశాల్ మెండీస్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ శిఖర్ ధావన్(8) స్వల్ప స్కోర్‌కే మళ్లీ ధనుంజయ బౌలింగ్‌లో పెరీరాకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం భారత్ 4 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసింది.


భారత్‌ విజయ లక్ష్యం 153

ముక్కోణపు టీ 20 సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో శ్రీలంక 19 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు 153 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. శ్రీలంక ఓపెనర్‌ మెండీస్‌ (55) హాఫ్ సెంచరీతో రాణించగా... తరంగ (22), శనక (19) గుణరత్న(17) పరుగులు చేశారు. భారత బౌలర్లలో శార్ధూల్ ఠాకూర్ నాలుగు వికెట్లు తీసుకోగా, సుందర్ రెండు, చాహల్, విజయ్, ఉనద్కట్ తలో వికెట్ తీశారు. వర్షం కారణంగా మ్యాచ్‌ను 19 ఓవర్లకు కుదించిన సంగతి తెలిసిందే.


భారీ స్కోరు దిశగా శ్రీలంక
ముక్కోణపు టీ 20 సిరీస్‌లో భాగంగా భారత్‌తో కొలంబో వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన శ్రీలంకను మెండిస్‌ (48 నాటౌట్‌), తరంగ (20) ఆదుకున్నారు. జట్టును భారీ స్కోరు దిశగా నడిపిస్తున్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు ఇప్పటివరకూ 60 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 10 ఓవర్లు ముగిసే సమయానికి శ్రీలంక 94/2 పరుగులతో ఉంది.


5 ఓవర్లకు శ్రీలంక 46/2
ముక్కోణపు టీ 20 సిరీస్‌లో భాగంగా భారత్‌తో కొలంబో వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో ఐదు ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక రెండు వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది. 25 పరుగుల వద్ద ఓపెనర్ దనుష్క గుణతిలక (17)ను ఠాకూర్ పెవిలియన్‌కి పంపగా ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో కుశాల్ పెరీరా (3) ఔటయ్యాడు. ప్రస్తుతం కుశాల్ మెండిస్ 22, ఉపుల్ తరంగ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. వర్షం కారణంగా మ్యాచ్‌ను 19 ఓవర్లకు కుదించిన సంగతి తెలిసిందే.


టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
ముక్కోణపు టీ 20 సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో కొలంబో వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచిన భారత్ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. వర్షం కారణంగా అయితే వర్షం కారణంగా 6.45 గంటలకు వేయాల్సిన టాస్ 8.05 గంటలకు వేశారు. ఆలస్యంగా ప్రారంభమైన కారణంగా మ్యాచ్‌ను 19 ఓవర్లకు కుదించారు.

India vs Sri Lanka 2018 Match 4 Score Card

దీని వల్ల ముగ్గురు బౌలర్లు తలో 4 ఓవర్లు, మరొక బౌలర్ 3 ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం ఉంది. బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్ కారణంగా శ్రీలంక కెప్టెన్ దినేష్ చండీమాల్‌పై ఐసీసీ రెండు మ్యాచ్‌ల నిషేధం విధించింది. దీంతో ఈ మ్యాచ్‌లో సారథ్య బాధ్యతలు తిషారా పెరీరాకు అప్పగించారు.

చండీమాల్ స్థానంలో సురంగా లక్మల్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగింది. రిషబ్‌ పంత్‌ స్థానంలో కేఎల్‌ రాహుల్‌ తుది జట్టులోకి వచ్చాడు. ఈ సిరీస్‌లో మూడు జట్లూ చెరో విజయంతో సమంగా నిలచినప్పటికీ భారత్‌కు మెరుగైన రన్‌రేట్‌ కలిగి ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే ఫైనల్‌ బెర్తును దాదాపు ఖాయం చేసుకుంటుంది.


కొలంబోలో వర్షం: టాస్ వాయిదా

కొలంబో వేదికగా జరుగుతోన్న నిదాహాస్ ముక్కోణపు టీ20 సిరిస్‌లో సోమవారం భారత్-శ్రీలంక జట్ల మధ్య జరగనున్న నాలుగో టీ20 మ్యాచ్ వర్షం అడ్డంకిగా మారింది. తేలికపాటి జల్లులు కారణంగా పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. కొలంబోలో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో ఔట్ ఫీల్డ్ కొంచెం తడిగా ఉండటంతో అంఫైర్లు టాస్ వాయిదా వేశారు.

మైదానాన్ని పరిశీలించిన అంఫైర్లు టాస్ టైమ్‌ను 6:45PMగా మ్యాచ్ జరిగే సమయాన్ని 7:15PMగా నిర్ణయించారు. ఇప్పటి వరకూ ఈ సిరీస్‌లో మూడు జట్లు తలో ఒక మ్యాచ్‌లో విజయం సాధించాయి. దీంతో భారత్-శ్రీలంక జట్ల మధ్య జరగనున్న ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది.

ఈ సిరిస్‌లో ఆరంభ మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఓటమిపాలైన రోహిత్ సేన, ఆ తర్వాత బంగ్లాదేశ్‌పై విజయం సాధించిన ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. బంగ్లాదేశ్ చేతిలో ఓటమిపాలైన శ్రీలంక ఈ సిరీస్‌లో ఆశలు నిలుపుకోవాలంటే టీమిండియాను తప్పక ఓడించాలి.

శనివారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ శ్రీలంకను ఓడించి టైటిల్ రేసులోకి రావడంతో సిరీస్‌ను రసవత్తరంగా మారింది. దీంతో ఈ మ్యాచ్‌లో శ్రీలంకను భారత జట్టు ఓడిస్తే అగ్రస్థానంలోకి దూసుకెళ్లడంతో పాటు ఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంటుంది.

ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, సురేష్ రైనా, లోకేష్ రాహుల్, మనీష్ పాండే, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), విజయ్ శంకర్, వాషింగ్టన్ సుందర్, జయ్‌దేవ్ ఉనడ్కట్, షార్దూల్ ఠాకూర్, యజ్‌వేంద్ర చాహల్.

శ్రీలంక: దనుష్క గుణతిలక, కుశాల్ మెండిస్, కుశాల్ పెరిరా (వికెట్ కీపర్), ఉపుల్ తరంగ, దాసున్ శనక, తిషారా పెరిరా (కెప్టెన్), జీవన్ మెండిస్, అకిల దనంజయ, నువాన్ ప్రదీప్, సురంగ లక్మల్, దుష్మంత చమీరా.

Story first published: Monday, March 12, 2018, 19:01 [IST]
Other articles published on Mar 12, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి