వికెట్లకు దూరంగా ఎవ'రైనా' ఆడతారా..?

Posted By:
India vs Sri Lanka 1st T20I: Suresh Raina out for 1 run

హైదరాబాద్: భారీ అంచనాలతో మైదానంలో అడుగుపెట్టిన రైనా కేవలం ఒకే ఒక్క పరుగుతో సర్దుకున్నాడు. ముక్కోణపు టీ20 టోర్నీలో భాగంగా శ్రీలంకతో మంగళవారం రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా (1) పేలవ రీతిలో క్లీన్ బౌల్డయ్యాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన నువాన్ ప్రదీప్ బౌలింగ్‌లో వికెట్లను పూర్తిగా విడిచిపెట్టి బ్యాక్ ఫుట్‌పైకి వెళ్లిన సురేశ్ రైనా.. ఫుల్‌టాస్‌గా వచ్చిన బంతిని ఏమాత్రం అందుకోలేకపోయాడు.

India vs Sri Lanka 1st T20I: Suresh Raina out for 1 run | Oneindia News

ఫుల్‌టాస్ బంతి లెగ్, మిడిల్‌ వికెట్లు తగిలి వాటిని పడేసుకుంటూ.. పోతున్న దృశ్యాన్ని చూసి కోచ్ రవిశాస్త్రి, తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ ఆశ్చర్యం వ్యక్తం చేయడం టీవీల్లో స్పష్టంగా కనిపించింది. సాధారణంగా ఫుల్‌టాస్ బంతికి ఓ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ బౌల్డవడం చాలా అరుదు. ఏడాది తర్వాత ఇటీవల టీమిండియాలోకి పునరాగమనం చేసిన సురేశ్ రైనా.. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో విధ్వంసక రీతిలో బ్యాటింగ్ చేశాడు.

అక్కడ కూడా వికెట్లని విడిచిపెడుతూ సిక్సర్లు బాదిన సందర్భాల్లో ఉన్నాయి. కానీ.. ఈ టీ20 మ్యాచ్‌లో అతను ఆడిన తీరు మరీ పేలవం. పూర్తిగా వికెట్లను విడిచిపెట్టేసి చాలా వెనక్కి వెళ్లిపోయాడు. రోహిత్ శర్మ సైతం తన స్టైల్‌లో డకౌట్ అయి త్వరగానే పెవిలియన్‌కు చేరుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్ 49 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సులతో (90) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఛేదనలో శ్రీలంక హిట్టర్ కుశాల్ పెరీరా 37 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో(66) దూకుడుగా ఆడటంతో శ్రీలంక మరో 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి 5 వికెట్ల తేడాతో విజేతగా నిలిచింది.

Story first published: Wednesday, March 7, 2018, 15:25 [IST]
Other articles published on Mar 7, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి