
అర్షిత శెట్టితో ప్రేమ:
గత కొన్నాళ్లుగా మనీష్ పాండే, అర్షిత శెట్టి ప్రేమలో ఉన్నారు. ఎప్పటినుంచే ఈ జంట విందు వినోదాలు అంటూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. చివరి ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి ఈ రోజు పెళ్లి చేసుకుంటున్నారు. ముంబైకి చెందిన 26 ఏళ్ల అర్షిత తుళు భాషలో 'తెళికెడా బొల్లి' సినిమాతో 2012లో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత 'ఉదయం ఎన్‌హెచ్4' ద్వారా తమిళ పరిశ్రమలో అడుగుపెట్టింది. ఇంద్రజిత్, ఓరు కన్నియం మూను కలవనికలం వంటి హిట్ చిత్రాలలో నటించింది. ప్రస్తుతం ఆర్.పన్నీర్‌సెల్వం దర్శకత్వంలో 'నాన్ దా శివ' చిత్రంలో నటిస్తోంది.

ఉత్కంఠగా పోరులో అద్భుత విజయం:
ఆదివారం చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఫైనల్ పోరులో తమిళనాడుపై అద్భుత విజయం సాధించిన కర్ణాటక సయ్యద్ ముస్తాక్ అలీ దేశవాళీ టీ20 ట్రోఫీని కైవసం చేసుకుంది. ముస్తాక్ అలీ ట్రోఫీని కర్ణాటక వరుసగా రెండోసారి దక్కించుకోవడం విశేషం. కెప్టెన్ మనీష్ పాండే (45 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 60 నాటౌట్) అజేయ అర్ధ శతకంతో రాణించడంతో.. హోరాహోరీగా జరిగిన ఫైనల్లో కర్ణాటక ఒక్క పరుగు తేడాతో తమిళనాడును ఓడించింది.

ట్రోఫీనే బహుమతి:
కర్ణాటక అద్భుత విజయం సాధించడంతో సోమవారం పెళ్లి చేసుకోబోతున్న కెప్టెన్ మనీశ్ పాండేకు జట్టు చక్కటి బహుమతిని అందించింది. ఆదివారం సూరత్‌లో మ్యాచ్ ఆడిన మనీశ్.. రోడ్డు మార్గం ద్వారా ముంబై చేరుకొని కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లి వేడుకలో పాల్గొన్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ... 'టీమిండియా తదుపరి సిరీస్ కోసం ఎదురు చూస్తున్నా. కానీ.. దీనికి ముందు, నాకు మరో ముఖ్యమైన సిరీస్ ఉంది. రేపు వివాహం చేసుకోబోతున్నా' అని తెలిపాడు.

23 వన్డేలు, 32 టీ20లు:
మనీష్ పాండే భారత్ తరఫున 23 వన్డేలు, 32 టీ20లు ఆడాడు. వన్డే ఫార్మాట్‌లో మనీష్ సగటు 36.7గా ఉండగా.. టీ20 ఫార్మాట్‌లో 39.1 గా ఉంది. వన్డేల్లో ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు చేసాడు. టీ20ల్లో రెండు అర్ధ సెంచరీలు సాధించాడు. వన్డేల్లో 440 పరుగులు.. టీ20ల్లో 587 పరుగులు చేసాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్-12లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ఆడాడు.