కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న చివరి, మూడో టెస్టు క్రికెట్ రెండో ఇన్నింగ్సులో భారత్ 268 పరుగులకు ఆలవుట్ అయింది. ద్రావిడ్, లక్షణ్ ల అర్థ సెంచరీలతో భారత్ ఈ మాత్రం స్కోరు చేయగలిగింది. ఈ మ్యాచులో గెలవాలంటే శ్రీలంక 122 పరుగులు చేస్తే సరిపోతుంది. భారత్ తొలి ఇన్నింగ్సులో 249 పరుగులు చేసింది. శ్రీలంక తొలి ఇన్నింగ్సులో 396 పరుగులు చేసింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్సును ప్రారంభించిన భారత్ బ్యాట్స్ మెన్ శ్రీలంక బౌలర్ల ముందు నిలువలేకపోయారు. ద్రావిడ్, లక్ష్మణ్ లు మాత్రమే శ్రీలంక బౌలర్లను ప్రతిఘటించారు. ద్రావిడ్ 68 పరుగులు చేయగా, లక్ష్మణ్ 61 పరుగులు చేసి నాటవుట్ గా మిగిలాడు. గంభీర్ 26 పరుగులు, సెహ్వాగ్ 34 పరుగులు చేశారు. గంగూలీ 18 పరుగులు చేశాడు. పార్థివ్ పటేల్ ఒక పరుగు మాత్రమే చేసి అవుటయ్యాడు. టెండూల్కర్ 14 పరుగులు చేశాడు. అనిల్ కుంబ్లే 9 పరుగులు చేసిన మురళీధరన్ బౌలింగులో అవుటయ్యాడు. హర్భజన్ చివర్లో మెరుపులు మెరిపించాడు. 26 పరుగులు చేసిన హర్భజన్ వాస్ బౌలింగులో అవుటయ్యాడు. ఆ తర్వాత జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మలు డకవుట్లు కావడంతో భారత్ రెండో ఇన్నింగ్సు ముగిసింది.