
సచిన్‌ను అధిగమిస్తాడు:
జియోఫ్రే బాయ్‌కాట్ 'ది టెలిగ్రాఫ్'కు రాసిన కథనంలో ఇలా పేర్కొన్నాడు. 'ఇంగ్లాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా రికార్డు నెలకొల్పిన జో రూట్.. 200 టెస్టులు ఆడగలడు. ఒకవేళ అతను అన్ని టెస్టులు ఆడితే కచ్చితంగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కన్నా ఎక్కువ పరుగులు చేయగలడు. ఇప్పుడు రూట్ వయసు 30 ఏళ్లు. ఇప్పటికే 99 టెస్టుల్లో 8249 పరుగులు చేశాడు. అతడికి తీవ్ర గాయాలు కానంత వరకూ సచిన్ సాధించిన 15921 పరుగులను అధిగమించకపోవడానికి ఇతర కారణాలు లేవు' అని బాయ్‌కాట్ అన్నాడు. బాయ్‌కాట్ ఇంగ్లాండ్ తరఫున 108 టెస్టులు, 38 వన్డేలు ఆడాడు.

నేటితరం ఆటగాళ్లతో పోల్చాలి:
జో రూట్‌ను మాజీ దిగ్గజాలతో కాకుండా నేటితరం ఆటగాళ్లతో పోల్చాలని బాయ్‌కాట్ పేర్కొన్నాడు. 'విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్.. రూట్‌తో సమాంతర ఆటగాళ్లు. వీళ్లు కూడా సచిన్ టెండ్యూలక్ర్ చేసినన్ని పరుగులు చేయగలరు. రూట్‌ను వీరితోనే పోల్చి చూడాలి. పాతతరం దిగ్గజాలతో కాదు. ఎందుకంటే ప్రతీ ఆటగాడు ఆయా పరిస్థితులను బట్టి తయారవుతాడు. శ్రీలంక పర్యటనకు ముందు వరకూ రూట్ సరిగా ఆడలేకపోయాడు. కరోనా విరామాన్ని అతడు చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. ఈ సిరీస్‌లో రూట్ ఆడుతుంటే తనకి తెలియకుండానే ప్రతీ బంతికీ పరుగులు చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు కనిపించింది. కానీ ఆస్ట్రేలియా పేస్‌ను ఎదుర్కోవడంలోనే అసలైన సవాలు ఎదురుకానుంది' అని బాయ్‌కాట్ చెప్పుకొచ్చాడు.

లంక సిరీస్‌లో 426 పరుగులు:
గాలె వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో 228 పరుగులు చేసిన జో రూట్.. రెండో టెస్టులోనూ 186 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో 106.50 సగటుతో 426 పరుగులు చేశాడు. దీంతో ఇంగ్లాండ్ తరఫున అత్యధిక టెస్టు పరుగులు చేసిన నాలుగో బ్యాట్స్‌మెన్‌గానూ రూట్ నిలిచాడు. ఇప్పటి వరకూ 99 టెస్టులాడిన జో రూట్ 49.39 సగటుతో 8249 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ప్రస్తుతం రూట్ 29వ స్థానంలో ఉన్నాడు. 200 టెస్టులాడిన సచిన్ 15921 పరుగులతో టాప్‌లో కొనసాగుతున్నాడు.

బుధవారం చెన్నైకి:
భారత్‌తో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం రూట్ సేన బుధవారం చెన్నై వచ్చే అవకాశం ఉంది. జట్టు సభ్యులంతా ఆరు రోజులు క్వారంటైన్‌లో ఉంటారు. ఫిబ్రవరి 2 నుంచి ఇంగ్లీష్ ఆటగాళ్లు ప్రాక్టీస్ ప్రారంభించనున్నారు. భారత్, ఇంగ్లాండ్ మధ్య టెస్టు సిరీస్ ఫిబ్రవరి 5న చెన్నై వేదికగా ఆరంభంకానుంది. శ్రీలంకతో టెస్టులకు బెన్‌స్టోక్స్, పేసర్ ఆర్చర్ విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ భారత్‌తో టెస్టుల కోసం తిరిగి జట్టుతో చేరనున్నారు.
IPL 2021: స్టోక్స్‌ను మేం ఇవ్వం.. ముంబై అభిమానికి రాజస్థాన్ పంచ్!!


Click it and Unblock the Notifications












