భారత క్రికెట్ సరైన మార్గంలో వెళ్లడం లేదన్న మదన్ లాల్.. కొన్నేళ్లుగా ఆటగాళ్లలో క్రికెట్ ఆడుతున్నామన్న జోష్ కనిపించడం లేదని చెప్పాడు. జట్టులో ఫిట్‌నెస్ సమస్యలపై కూడా మదన్ లాల్ ప్రశ్నలు లేవనెత్తాడు. ఈ విషయంలో రెండో వన్డే అనంతరం రోహిత్ మాట్లాడుతూ.. దేశం తరఫున ఆడేందుక సగం సగం ఫిట్‌గా ఉన్న ఆటగాళ్లను తీసుకోకూడదని అన్నాడు. ఈ మాటలను గుర్తు చేసిన మదన్ లాల్.. ఒక కెప్టెన్ ఈ మాటలు అన్నాడంటే ఎక్కడో ఏదో తప్పు జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశాడు.
'దీనికి ఎవరు బాధ్యులు? ట్రైనర్ల వల్లే ఇలా జరిగిందా? అసలు ఫిట్‌గా లేని వాళ్లను ఎలా పంపుతున్నారు? మనం అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాం. ఫలితం కనిపిస్తూనే ఉందిగా' అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'ఆటగాళ్లకు విశ్రాంతి కావాలంటే ఐపీఎల్ మ్యాచుల సమయంలో తీసుకోవాలి కదా. ముందు కంట్రీ ఫస్ట్. మీరు ఐసీసీ టోర్నీలో గెలవకపోతే దేశంలో క్రికెట్ స్థాయి దిగజారిపోవడం ఖాయం' అన్నాడు. సీనియర్ ప్లేయర్లపై కూడా మండి పడిన మదన్ లాల్.. 'జట్టులోని సీనియర్ ప్లేయర్లు గత మూడేళ్లలో ఎన్ని సెంచరీలే చేశారు? వయసు పెరిగే కొద్దీ కన్ను, చేతుల మధ్య సమన్వయం లోపించడం సహజమే కానీ.. సీనియర్ ఆటగాళ్లు జట్టును ముందుండి నడిపించాలి కదా' అని ప్రశ్నించాడు.