|
మళ్లీ అవే తప్పిదాలు..
కొంత కాలంగా టీమిండియాను పట్టి పీడిస్తున్న ఫీల్డింగ్ తప్పిదాలు ఈ మ్యాచ్‌లో మరోసారి స్పష్టంగా కనిపించాయి. భారత బౌలింగ్ దళం మ్యాచ్‌లో చాలా వరకు ఆధిపత్యం చెలాయించింది. ఒకానొక దశలో తమ జట్టుకు విజయాన్ని కట్టబెట్టేలా కనిపించారు బౌలర్లు. కానీ ఫీల్డర్ల తప్పిదాల వల్ల వాళ్ల కష్టం బూడిదలో పోసిన పన్నీరైంది. అనవసర పరుగులు ఇవ్వడంతో పాటు కొన్ని క్యాచులను కూడా భారత ఆటగాళ్లు మిస్ చేశారు.
|
రాహుల్ క్యాచ్ కీలకం
తొమ్మిది వికెట్లు కోల్పోయి ఓటమికి ఒక్క అడుగు దూరంలో ఉన్న బంగ్లాదేశ్‌ను టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కాపాడాడు. మెహదీ హసన్ ఇచ్చిన అత్యంత సులభమైన క్యాచ్‌ను నేలపాలు చేశాడు. దీంతో హసన్‌కు కొండంత ధైర్యం వచ్చింది. ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న అతను.. ముస్తాఫిజుర్ రెహ్మాన్‌తో కలిసి పదో వికెట్‌కు రికార్డు స్థాయిలో 51 పరుగులు జతచేసి తమ జట్టుకు విజయాన్ని అందించాడు.
|
ఫ్యాన్స్ ఆగ్రహం
ఇలా సులభమైన క్యాచ్ నేలపాలు చేసిన రాహుల్‌పై భారత అభిమానులు మండి పడుతున్నారు. రాహుల్ చేసిన తప్పిదం వల్లనే భారత జట్టు ఓడిందని నెట్టింట తెగ కామెంట్లు చేస్తున్నారు. రాహుల్ ఇచ్చిన జీవనదానం వల్లనే మెహదీ హసన్.. బంగ్లా జట్టును విజయ తీరాలకు చేర్చాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇలాగే కీలక సమయాల్లో ఒత్తిడికి గురై సులభమైన క్యాచ్‌లు వదిలేసి, మ్యాచ్‌లను కూడా భారత్ ఓడిపోవడం తెలిసిందే.
|
బ్యాటింగ్‌లో ఒకే ఒక్కడు..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. శిఖర్ ధవన్ (7), కోహ్లీ (9) ఇద్దరూ విఫలమవగా..రోహిత్ శర్మ (27), శ్రేయాస్ అయ్యర్ (24), వాషింగ్టన్ సుందర్ (19) ఫర్వాలేదనిపించారు. కేఎల్ రాహుల్ (73) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. జట్టు స్కోరును 200 దాటించేందుకు ప్రయత్నించాడు. కానీ అతనికి మిగతా బ్యాటర్లు షాబాజ్ అహ్మద్ (0), శార్దూల్ ఠాకూర్ (2), దీపక్ చాహర్ (0), మహమ్మద్ సిరాజ్ (9), కుల్దీప్ సేన్ (2 నాటౌట్) ఎవరి నుంచి పెద్దగా సహకారం దక్కలేదు. దీంతో టీమిండియా 41.2 ఓవర్లలో 186 పరుగులకే ఆలౌట్ అయింది.