మిడిలార్డర్‌లో డాట్ బాల్స్: మా ఓటమిని డిసైడ్ చేశాయంటున్న కెప్టెన్

Posted By:
Dot balls the reason Bangladesh lost to India in Nidahas Trophy: Skipper Mahmudullah

హైదరాబాద్: మిడిల్ ఓవర్లలో ఎక్కువ శాతం డాట్ బాల్స్ పడటం వల్లే తాము ఓడిపోయామని బంగ్లాదేశ్ కెప్టెన్ మొహ్మదుల్లా పేర్కొన్నాడు. ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా గురువారం టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి చెందడం కంటే కూడా జట్టు ఆడిన తీరుపై అతడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు.

బంగ్లాదేశ్‌తో టీ20: సురేశ్ రైనా అరుదైన ఘనత

మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మొహ్మదుల్లా మాట్లాడుతూ 'మిడిల్ ఓవర్లలో ఎక్కువ ఒత్తిడికి గురయ్యాం. ప్రధానంగా ఎక్కువ డాట్‌ బాల్స్‌ పడ్డాయి. నేను కూడా ఏడు డాట్ బాల్స్ ఆడాను. కనీసం సింగిల్స్‌తో బ్యాటింగ్‌ రొటేట్‌ చేయడం కూడా కష్టమైంది ఏ దశలోనూ తమ జట్టు నాణ్యమైన బ్యాటింగ్‌ చేయలేదు' అని అన్నాడు.

'టీ 20ల్లో డాట్‌ బాల్స్‌ అనేవి చాలా తక్కువ శాతం ఉండాలి. మా ఇన్నింగ్స్‌లో 46 బంతులకు అసలు పరుగులే రాలేదు. ఇంకా 30 నుంచి 40 పరుగులు చేయాల్సి ఉన్నా, సాధారణ స్కోరుకే పరిమితమయ్యాం. ఇది మా ఓటమిపై తీవ్ర ప‍్రభావం చూపింది. ఇక్కడ మా ఓటమి కంటే కూడా ఆట తీరు బాలేదు. ఒత్తిడిని అధిగమించాలంటే సింగిల్స్‌ చాలా ప్రధానం' అని అన్నాడు.

బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 6 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. అనంతరం బంగ్లా నిర్దేశించిన 140 పరుగుల లక్ష్యాన్ని భారత్ మరో 8 బంతులు మిగిలి ఉండగానే 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

శిఖర్ ధావన్ (43 బంతుల్లో 55; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మరోసారి మెరువగా రైనా (27 బంతుల్లో 28; 1 ఫోర్, 1 సిక్స్) రాణించాడు. బంగ్లా బ్యాట్స్‌మెన్‌లలో లిట్టన్ దాస్ (30 బంతుల్లో 34; 3 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. షబ్బీర్ (26 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. భారత బౌలర్ విజయ్ శంకర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

Story first published: Friday, March 9, 2018, 17:22 [IST]
Other articles published on Mar 9, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి