
సిడ్నీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మళ్లీ సారథిగా ఎంపికవడాన్ని గౌరవంగా భావిస్తున్నానని, కెప్టెన్సీని తిరిగి పొందాననుకోవట్లేదు అని ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అన్నాడు. ఈ సీజన్లో జట్టుకు మరో టైటిల్‌ను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నాడు. వార్నర్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ 2016 ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే 2018లో బాల్ ట్యాంపరింగ్ వివాదంతో నిషేధానికి గురయ్యాక.. వార్నర్ సన్‌రైజర్స్ కెప్టెన్సీ కూడా కోల్పోయాడు. దీంతో న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ జట్టును నడిపించాడు.
గతేడాది మళ్లీ డేవిడ్ వార్నర్ ఐపీఎల్లో పునరాగమనం చేసి 697 పరుగులతో అదరగొట్టాడు. అయితే ఈ ఏడాది సీజన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం వార్నర్‌ను మరోసారి కెప్టెన్‌గా నియమించింది. ఈ విషయంపై మంగళవారం మీడియాకు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ఇచ్చిన ఇంటర్వ్యూలో వార్నర్ స్పందించాడు. 'సన్ రైజర్స్‌కు కెప్టెన్‌గా ఉండడాన్ని నేను గౌరవంగా భావిస్తున్నా. మళ్లీ సారథ్యం దక్కడం గొప్ప విషయం అంతేకాని కెప్టెన్సీని తిరిగి పొందాననుకోవట్లేదు. నేను ఆటగాళ్లు, సిబ్బంది మరియు యజమానులతో గొప్ప సంబంధాన్ని కలిగి ఉన్నా. దానికి నేను నా కృతజ్ఞతను తెలియజేస్తున్నా' అని వార్నర్ తెలిపాడు.
'జట్టులోని ప్రతి ఒక్కరూ నాయకుడే. విలియమ్సన్, నేను ఎప్పుడూ ఆలోచనలు పంచుకుంటాం. నేను ఏ స్థానంలో ఉన్నా ఏ తేడా ఉండదు. నేను గతేడాది కూడా నాయకుడిననే అనుకున్నా. పేరు ముందు సి(కెప్టెన్) అని ఉందా లేదా అనేది నేను పట్టించుకోను. నా ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికే ప్రయత్నిస్తా. మరొక ఐపీఎల్ టైటిల్ గెలిచేందుకు ప్రయత్నిస్తా. నేను జట్టులో లేనప్పుడు కేన్, భువీ అద్భుతంగా పనిచేశారు. సన్‌రైజర్స్ రూపంలో ఓ గొప్ప కుటుంబం దక్కింది' అని డేవిడ్ వార్నర్ చెప్పాడు.
కరోనా వైరస్ నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్‌ను సెప్టెంబర్ 19వ తేదీ నుంచి యూఏఈలో నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఐపీఎల్ 2020 ఎలా నిర్వహించాలనే అంశంపై చర్చించడానికి ఐపీఎల్ పాలకమండలి ఆగస్టు 2న సమావేశం జరగనుందని లీగ్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ మీడియాకు వెల్లడించారు. మ్యాచ్‌లను కుదించాలంటే ఏమేరకు చేయాలి.. రోజుకు రెండు చొప్పున మ్యాచ్‌లు ఎన్ని పెట్టాలి.. దాదాపు రెండు నెలల పాటు కుటుంబానికి దూరంగా ఉండటం ఇబ్బందన్న అభిప్రాయాల నేపథ్యంలో ఆటగాళ్లతో పాటు భార్యాపిల్లల్ని అనుమతించాలా వద్దా అనే విషయాల్ని ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఆగస్టు 2న పూర్తి స్పష్టత రానుంది.