గుహవాటి కాదు గువహటి: అభిమానికి సారీ చెప్పిన వార్నర్

Posted By:

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా భారత్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకున్నాడు. ఎలాంటి భేషజాలు లేకుండా అరంగేట్ర క్రికెటర్‌కైనా వార్నర్ గౌరవం ఇస్తుండటం మనం ఇప్పటికే చాలాసార్లు క్రికెట్ మ్యాచ్‌ల్లో చూశాం.

ఇందుకు ఉదాహరణ. ఐపీఎల్ పదో సీజన్‌లో భారత యువ బౌలర్ థంపీ బౌలింగ్ చేస్తుండగా అతని షూ జారి పిచ్‌పై పడిపోతే.. దానిని స్వయంగా అతని చేతికి అందించి అనంతరం వార్నర్ పరుగు పూర్తి చేశాడు. ఇటీవల ముగిసిన ఐదు వన్డేల సిరిస్‌లో హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేస్తుండగా బంతి జారిపోతే, నాన్‌ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న వార్నర్ పిచ్ మధ్యలోకి వేగంగా వెళ్లి బంతిని అందించాడు.

 భారత అభిమానికి సారీ చెప్పిన డేవిడ్ వార్నర్

భారత అభిమానికి సారీ చెప్పిన డేవిడ్ వార్నర్

తాజాగా ఓ భారత అభిమానికి సారీ చెప్పి తన స్వభావాన్ని డేవిడ్ వార్నర్ మరోసారి చాటుకున్నాడు. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా రెండో టీ20 కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు ఆదివారం గువహటికి చేరుకున్నాయి. గువహటికి చేరుకున్న వెంటనే అక్కడి విమానాశ్రయ అధికారులు ఇరు జట్లకు స్థానిక సంప్రదాయాలతో ఘనస్వాగతం పలికారు.

'వెల్‌కమ్‌ టు గుహవాటి' అని ట్వీట్ చేసిన వార్నర్

ఈ సందర్భంగా దిగిన ఓ ఫొటోను వార్నర్‌ తన సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ‘వెల్‌కమ్‌ టు గుహవాటి' అని వార్నర్‌ ట్విటర్‌లో పేర్కొన్నాడు. వార్నర్ ట్వీట్‌లో తప్పుని గుర్తించిన ముంబైకి చెందిన ఆశిష్ ప్రతాప్ సింగ్ అనే అభిమాని ‘డేవిడ్ వార్నర్ బ్రో అది గుహవాటి కాదు.. గువహటి' అని రిప్లై ఇచ్చాడు.

 సారీ బ్రో.. నా స్పెల్లింగ్ తప్పు

సారీ బ్రో.. నా స్పెల్లింగ్ తప్పు

దీంతో తప్పు తెలుసుకున్న వార్నర్ వెంటనే ‘సారీ బ్రో.. నా స్పెల్లింగ్ తప్పు' అని బదులిచ్చాడు. మంగళవారం గువహటిలో కొత్తగా నిర్మించిన బర్సపరా స్టేడియంలో రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఆసీస్‌ రెగ్యులర్ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌ భుజానికి గాయమవ్వడంతో అతడు టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు.

 స్మిత్‌కు గాయంతో కెప్టెన్‌గా బాధ్యతలు

స్మిత్‌కు గాయంతో కెప్టెన్‌గా బాధ్యతలు

దీంతో ప్రస్తుత టీ20 సిరీస్‌కు వార్నర్‌ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా రాంచీ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా 9 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే.

Story first published: Tuesday, October 10, 2017, 13:46 [IST]
Other articles published on Oct 10, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి