భారత పర్యటనలో కోహ్లీ ఇచ్చిన బ్యాట్‌తో ఆడతా: డేనియెల్లి

Posted By:
Dannielle Wyatt Tweets that she will play with Virat Kohli’s Bat
Danielle Wyatt reveals how Virat Kohli reacted to her 'marry me' tweet

హైదరాబాద్: ఇంగ్లాండ్‌ మహిళా క్రికెటర్‌ డేనియెల్లి వాట్‌ గుర్తుండే ఉంటుంది. 2014లో టీ20 వరల్డ్ కప్ కోసం ధోని నాయకత్వంలోని టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాపై కోహ్లీ ప్రదర్శన చూసిన డేనియెల్లి పీకల్లోతు ప్రేమలో పడిపోయింది. ట్విటర్‌ వేదికగా 'కోహ్లీ నన్ను పెళ్లి చేసుకో' అని ప్రపోజల్‌ చేసి వార్తల్లో నిలిచింది.

ఆ తర్వాత అదే ఏడాది టీమిండియా ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లింది. అప్పుడు డెర్బిషైర్‌లో భారత్‌-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వార్మప్‌ మ్యాచ్‌కు వచ్చిన డేనియెల్లి మ్యాచ్‌ అనంతరం కోహ్లీతో కలిసి ఫోటో దిగింది. ఈ సందర్భంగా కోహ్లీ తన దగ్గర ఉన్న ఒక బ్యాట్‌ను బహుమతిగా డేనియెల్లికి బహుకరించాడు. కోహ్లీతో దిగిన ఫొటోను, బ్యాట్‌ను కూడా డేనియెల్లి అప్పట్లో ట్విటర్‌లో పోస్టు చేసింది.

అయితే ఇప్పుడు ఆమె గురించి ఎందుకని అనుకుంటున్నారా? త్వరలో ముక్కోణపు టీ20 సిరీస్‌ కోసం ఇంగ్లాండ్‌ జట్టు భారత్‌లో పర్యటించనుంది. భారత్‌ పర్యటనకు వచ్చే ఇంగ్లాండ్‌ జట్టులో డేనియెల్లి సభ్యురాలిగా ఉంది. దీంతో భారత పర్యటనలో విరాట్ కోహ్లీ ఇచ్చిన బ్యాట్‌తోనే ఆడతానని స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ 'విదేశీ పర్యటనల్లో కూడా కోహ్లీ బ్యాట్‌నే ఉపయోగిస్తున్నా. భారత పర్యటనలో నేను కోహ్లీ ఇచ్చిన బ్యాట్‌తోనే ఆడతాను. ఎందుకంటే నేను వాడే బ్యాట్‌ విరిగిపోయింది' అని పేర్కొంది. ఐసీసీ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ముక్కోణపు టీ20 సిరీస్‌ మార్చి 23 నుంచి ప్రారంభం కానుంది.

ఈ ముక్కోణపు టీ20 సిరిస్‌లో భారత్‌, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జట్లు పాల్గొనున్నాయి. తొలి మ్యాచ్‌ ఇంగ్లాండ్‌-ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ఆ తర్వాత మార్చి 25న భారత్‌-ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరగనుంది.

Story first published: Tuesday, March 13, 2018, 16:40 [IST]
Other articles published on Mar 13, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి