నేడు క్రిస్మస్. దీంతో ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పలువురు క్రీడాకారులు కూడా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతున్నారు. అలాగే క్రిస్మస్ వేడుకల్లోనూ పాల్గొంటున్నారు. ఈ క్రమంలో భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ కూడా అభిమానులకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు. వేర్వేరు సంవత్సరాల్లో కూడా క్రిస్మస్ పండుగ అంటే అదే అనుభూతి కలుగుతుందని ట్వీట్ చేశారు. అంతేకాకుండా తాను గతంలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఫోటోలను మాష్టర్.. తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇందులోని ఓ ఫోటోలో సచిన్ క్రిస్మస్ తాతయ్య గెటప్‌లో ఉండడం గమనార్హం. ఆ ఫోటోలో సచిన్ క్రిస్మస్ తాతయ్య గెటప్‌లో చిన్న పిల్లలతో సందడి చేస్తున్నారు. అంతే కాకుండా వారితో క్రికెట్ కూడా ఆడుతున్నారు. ఓ పాపతో సచిన్ బ్యాటింగ్ చేయించడం విశేషం. దీంతో ఆ పిల్లలు అంతా చాలా ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఈ ఫోటో ఇప్పటి కాదు. 2018 నాటిది. 2018లో చిన్న పిల్లలతో కలిసి క్రిస్మస్ తాతయ్య గెటప్‌లో చేసుకున్న సంబరాలను సచిన్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. అలాగో మరో ఫోటోలో క్రిస్మస్ తాతయ్యతో సచిన్ ఉన్నాడు. ఈ ఫోటో 2019 నాటిది.
అలాగే టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతోపాటు మాజీ క్రికెటర్లు వసీం జాఫర్, వీవీఎస్ లక్ష్మణ్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. విదేశీ ఆటగాళ్లైన రషీద్ ఖాన్, ఫర్నాడో కూడా ట్విట్టర్ వేదికగా క్రిస్మస్ విషెస్ తెలిపారు. ఆనందం ఒక బహుమతి, శాంతి ఒక బహుమతి, శ్రేయస్సు ఒక బహుమతి. ఇవన్నీ క్రిస్మస్ రోజు పొందగలం అని మాజీ క్రికెటర్, ఎన్‌సీఏ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేశాడు. అందరికి ఈ సీజన్ ఉల్లాసంగా, ప్రకాశవంతంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. ప్రతి ఒక్కరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతూ టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్.. క్రిస్మస్ విషెస్‌కు సంబంధించిన ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. అందరికీ ఆనందం, ఆరోగ్యం లభించాలని కోరుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పాడు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా. వీరితోపాటు ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రోనాల్డో కూడా శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. కాగా క్రిస్మస్‌కు తోడు బాక్సింగ్ డే సందర్భంగా రేపటి నుంచి ఇండియా, సౌతాఫ్రికా.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.